టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇక అమరావతి ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సాధక బాధకాలను దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కరోనా కారణంగా ఇంతవరకు ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వైసీపీ సర్కారు వేధింపులపై ఆరా తీస్తూ ధైర్యం చెబుతున్నారు.
ఎవరు ఇబ్బందులు పడినా..
పార్టీవారే కాకుండా ప్రజలు ఎవరు ఇబ్బందులు పడుతున్నా అధికారంలో ఉన్న వారి కంటే ముందే ఆయన స్పందిస్తూ తాము అన్ని విధాలా అండగా ఉంటామన్న భరోసా ఇస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలో జరిగిన యువతి హత్యే ఇందుకు నిదర్శనం. సంఘటన జరిగిన వెంటనే హతురాలి తల్లిని ఫోన్‌లో పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పటమే కాకుండా పార్టీ పరంగా రూ.2లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే గాజువాకలో యువతి హత్య, నంద్యాల ప్రాంతంలో ఓ మైనారిటీ కుటుంబం మొత్తం ఆత్మహత్య లాంటి సంఘటనలెన్నో ఆయన స్పందనకు ఉదాహరణగా నిలుస్తాయి.
రైతులను పరామర్శించాలనుకున్నా..
గత నెలలో నివర్ తుపాను ప్రాంతాల్లో పర్యటించి బాధిత రైతులను పరామర్శించాలనుకున్నా వయస్సు రీత్యా , కోవిడ్ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. అయితే, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రైతు బీమాపై వైసీపీ సర్కారు తీరును నిరసిస్తూ ఆయన పొడియం వద్ద కింద కూర్చుని నిరసన తెలిపారు. అసెంబ్లీలో చంద్రబాబు వాదనను కొట్టిపడేసిన సర్కారు తర్వాత అర్థరాత్రే బీమా ప్రీమియం విడుదల చేయడాన్ని అందరూ గమనించారు.
Must Read ;- వైసీపీ సర్కారు నయా ప్లాన్.. చట్టపరంగా ప్రభుత్వ భూముల కబ్జా
అమరావతి రైతులకు అండగా..
ఆయన అంకురార్పణ చేసిన అమరావతికి పట్టిన గ్రహణంపై ఎంతో ఆవేదన చెందుతున్నారు. తాము ఉద్యమం చేపట్టి ఏడాదయిన సందర్భంగా అమరావతి రైతులు నిర్వహించిన జనభేరి సభకు వెళుతూ శంకుస్థాపన చేసిన ప్రాంతంలోని మట్టిపై ఆయన ప్రణమిల్లిన తీరు మనస్సున్న ఎవరినైనా కంటతడి పెట్టిస్తుంది. అలుపెరగకుండా ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇస్తున్నారు.
పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశం
ఏపీ సర్కారు తీరుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్ని విధాల అండగా ఉండాలని టీడీపీ శ్రేణులకు జూమ్ సమావేశాల్లో దిశా నిర్థేశం చేస్తున్నారు. సర్కారు విధానాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా ఇవ్వాలంటూ ప్రోత్సహిస్తున్నారు. ఏపీలో పోలీసులు చూపిస్తున్న పక్షపాత వైఖరిని ఎప్పటికప్పుడు లేఖల ద్వారా డీజీపీ దృష్టికి తీసుకొస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉండి ఇలా అన్ని రకాలుగా ఏపీలో పరిస్థితులపై నిత్యం సమీక్షిస్తున్నా చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక ప్రజలకు అందుబాటులో అమరావతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read ;- నాకు ఇల్లు లేదన్నారు.. అమరావతిలో ఇల్లు కట్టిన జగనేం పీకాడు: చంద్రబాబు