రాజధాని తరలింపు ప్రక్రియ చాపకింద నీరులా సాగిపోతోంది. తెలుగు సంవత్సరాది ఏప్రిల్ 13 నాటికి విశాఖ నుంచి పాలన సాగించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈలోగా విశాఖలో పరిపాలన కోసం భవనాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. విశాఖ, ఆ చుట్టుపక్కల ఖాళీ భూములు, భవనాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. విశాఖ ద్వారకా బస్టాండ్‌పై నాలుగో అంతస్థుకు ఆర్టీసీ పరిపాలనా కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక వాల్తేరు క్లబ్‌ను స్వాధీనం చేసుకుని గవర్నర్ బంగ్లాగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, అందుకే సిట్ విచారణ వేగవంతం చేసిందని తెలుస్తోంది.
బొత్స చెప్పేశారు
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది నుంచి విశాఖ నుంచి పాలన సాగుతుందని మంత్రి బొత్స ప్రకటించారు. ఈ లోగా న్యాయపరమైన చిక్కులు అన్నీ తొలగిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, సిబ్బంది విశాఖకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి బొత్స స్పష్టం చేశారు. అంటే రాబోయే మూడు నెలల కాలంలో అన్ని ఏర్పాట్లు చేసుకుని పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని అర్థం అవుతోంది. హైకోర్టులో తీర్పు రావడమే తరువాయి, వెంటనే రాజధాని విశాఖ తరలిపోనుందని తెలుస్తోంది.

అమరావతిపై హైకోర్టు తీర్పు కీలకం
అమరావతి నుంచి రాజధాని తరలించవద్దంటూ 93 పిటీషన్లు వేశారు. వీటన్నింటినీ కలపి హైకోర్టులో రోజు వారీ విచారణ సాగుతోంది. రాబోయే రెండు నెలల్లో అమరావతి రాజధానిపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సానుకూలంగా తీర్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే విశాఖలో అన్నీ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయని మంత్రి బొత్స వెల్లడించారు. రాజధానిని మూడు ముక్కలు చేసే ప్రకటన దగ్గర నుంచి బొత్స చేస్తున్న ప్రకటనలు సంచలనం రేపుతున్నాయి. ఏప్రిల్ నాటికి పరిపాలనా రాజధాని విశాఖకు తరలడం ఖాయమని మంత్రి బొత్స చెప్పడం, అక్కడ ఏర్పాట్లు జరిగిపోతూ ఉండటం చూస్తుంటే ఉగాది నుంచి పాలన విశాఖ నుంచి సాగుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
సీఎం కార్యాలయంతో ప్రారంభం
ముందుగా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. ముందు సీఎం క్యాంపు కార్యాలయం తరలిస్తే, మిగిలినవి ఒకదాని తరవాత ఒకటి తరలించ వచ్చనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే హైకోర్టులో అమరావతి రాజధానిపై తీర్పు వచ్చిన రోజే సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలిపోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రి బొత్స చేస్తున్న ప్రకటనలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది నాటికి పరిపాలన విశాఖ నుంచి కొనసాగించాలని సీఎం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
Must Read ;- కొనసాగుతున్న సత్య ప్రమాణాల ఎపిసోడ్.. విశాఖలో ఉద్రిక్తత











