2001 డిసెంబరు 13.. బరితెగించిన ఉగ్రమూకలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలు విసిరిన రోజు. సుదీర్ఘ భారతదేశ చరిత్రలో బ్లాక్ డే గా మిగిలిన రోజు. పటిష్ఠమైన మన భద్రతా వ్యవస్థ విఫలమైన రోజు. మన ప్రజాస్వామ్య సౌధంపై ఉగ్రవాదులు పంజా విసిరిన రోజు. రాజధాని నడిబొడ్డున, అత్యంత పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా.. మన అత్యున్నత రాజ్యాంగ పరిరక్షణా వ్యవస్థపై దాడి జరిగిన రోజు. మన భద్రతా దళాల వాడిని వేడిని పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కర్ ఏ తోయిబా.. రుచి చూసిన రోజు.
సమావేశాలు జరుగుతున్న వేళ..
పార్లమెంటు శీతకాల సమావేశాలు జరుగుతున్న వేళ.. ఉదయం.. దేశ ఉపరాష్ట్రపతి, హోంమంత్రి అద్వాణీ సహా అతిరథ మహారథులు, ప్రభుత్వాధినేతలు, అధికార ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ఆశీనులై ఉన్న వేళ. ఇంతలో సమావేశాలకు చిన్నపాటి విరామం. దీంతో.. సభ్యులు ఒక్కొక్కరుగా వెలుపలకు వస్తున్నారు. వాతావరణం.. తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. ఇంతలోనే అలజడి. హోంమంత్రి స్టిక్కరుతో ఓ కారు పార్లమెంటు గేటు వైపుగా దూసుకొచ్చింది. హోంమంత్రి స్టిక్కరు ఉండడంతో సెక్యకూరిటీ సిబ్బంది.. ఆ కారును అడ్డుకోలేదు. ఎందుకో అనుమానం వచ్చి ఆపగా.. అందులోని ఉగ్రవాదులు కిందకు దిగి విచక్షణా రహితంగా కాల్పులు మొదలెట్టారు. ఊహించని ఈ ఘటనతో తొలుత మన దళాలు కలవరపాటుకు గురయ్యాయి. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూక.. పార్లమెంటు ప్రధాన భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న ఉపరాష్ట్రపతి భద్రతా సిబ్బంది ముందుగా తేరుకుంది. ముష్కరులపై ఎదురుదాడికి దిగింది. కానీ, కరుడుగట్టిన ముష్కరుల తూటాలకు ఇద్దరు వీరులు నేలకొరిగారు. దీంతో.. ముష్కరులు అక్కడి నుంచి పార్లమెంటు ప్రధాన ద్వారం దిశగా వేగంగా కదిలారు. మన ప్రభుత్వాధినేతలు, ఎంపీలే వారి లక్ష్యం. ఆ సమయంలో అందరూ అక్కడే ఉన్నారు. విషయం తెలిసి సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అందరూ పార్లమెంటు భవనంలోకి పరిగెత్తారు.
Must Read ;- 26/11 ఉగ్రదాడులకు 12 ఏళ్లు పూర్తి!

ప్రాణాలను అడ్డుపెట్టిన భద్రతా దళం
ఇంతలో మన భద్రతా సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. సభ్యులను లోపల పెట్టి పార్లమెంటు తలుపులు మూసేశారు. నలువైపులా ఉన్న గేట్లను కూడా మూసేశారు. మన ప్రజాస్వామ్య సౌధానికి, దేశ ప్రతిష్ఠకు తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరీ పోరాడారు. ఉగ్రమూకను అష్టదిగ్బంధం చేసేశారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన హోరాహోరీ పోరాటంలో విజయం సాధించారు. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులనూ మట్టుబెట్టారు.
ఈ రోమాంచిత వీరోచిత సమరంలో ఆరుగురు ఢిల్లీ పోలీస్, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఓ గార్డ్.. మొత్తంగా 9 మంది వీరులు అమరులయ్యారు. పదుల సంఖ్యలో వీరులు గాయపడ్డారు. దేశ ప్రతిష్ఠను తమ ప్రాణాలు అడ్డువేసి మరీ కాపాడారు. ఇంత పెద్ద దుర్ఘటనలో మన పార్లమెంటు సభ్యులెవరికీ చిన్న గాయం కూడా కాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు.. మన వీరుల పోరాటం ఏపాటిదో. సరిగ్గా అంతకు నెల ముందు ఇలాగే ఉగ్రవాదు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై కూడా దాడి చేయగా.. అక్కడ 38 మంది మరణించారు. ఇది జరిగిన తర్వాత కూడా పార్లమెంటుపై దాడి జరిగిందంటే.. దాన్ని మన ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యంగా కొందరు విమర్శించారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..
పాక్ దుస్సాహసాన్ని తీవ్రంగా పరిగణించిన అప్పటి వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. కఠిన చర్యలకు దిగింది. దేశం మొత్తం.. అట్టుడికి పోయింది. ముక్తకంఠంతో పాక్ చర్యలను ఖండించింది. పాక్ తో భారత్ అన్ని సంబంధాలనూ తెంచుకుంది. తన బలగాలను సరిహద్దుల వెంబడి భారీగా మోహరించింది. దీనికి ప్రతిగా.. పాక్ కూడా సైన్యాన్ని మోహరించింది. ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
వాజ్పేయి ప్రధాని పదవిని చేపట్టిన నాటి నుంచీ పాక్ తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకే యత్నించారు. కానీ, ప్రతిసారీ పాక్ తన దుష్ట బుద్ధిని చాటుకుంటూనే వచ్చింది. మన ప్రధాని.. కరాచీకి బస్సు యాత్ర చేస్తే.. దానికి ప్రతిగా పాక్ కార్గిల్ యుద్ధానికి దిగింది. మన వాళ్లు స్నేహ హస్తం అందిస్తే.. వాళ్లు ఏకంగా మన పార్లమెంటు పైకే దాడికి దిగారు. ఈ దుర్ఘటన జరిగి నేటికి 19 ఏళ్లయ్యాయి. ఈ సందర్భంగా.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు నివాళి అర్పించడం మన కనీస బాధ్యత.
Also Read ;- పాకిస్తాన్లో బయటపడ్డ 1300 ఏళ్లనాటి పురాతన హిందూ ఆలయం
https://www.youtube.com/watch?v=VsRTc6nPnY8











