‘‘ఏంట్రా ఈవాళ బంద్ అంట కదా.. నీకు సెలవేనా’’, ‘‘ఎక్కడ బావా.. మా బాస్ రమ్మంటున్నాడు, కాకపోతే తొందరగా వచ్చేయొచ్చు..సాయంత్రం సిట్టింగ్ వేద్దామా’’ .. ఇవన్నీ మనం ఎప్పుడూ వినేవే. ఆ బంద్ ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. అది కరెక్టా , రాంగా అనే దాకా డిస్కషన్ అస్సలు పోనే పోదు. కాని ఈసారి అలా జరగలేదు. రైతులు పిలుపిస్తే జరిగిన భారత్ బంద్ ఎందుకనేది అందరికీ అర్ధమయ్యేలా చేశారు.
ఢిల్లీని చుట్టుముట్టిని లక్షల మంది..
పొలంలో అరక వెనకాలే నడిచే రైతు.. రోడ్డెమ్మట నడిచాడు. పంటను కాపలా కాసే రైతన్న.. ఢిల్లీ సరిహద్దులను కావలి కాశాడు. పొలంకాడ తినే కూడు రోడ్డు మీదే తిన్నాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాదిమంది రైతులు ఒక్కసారే ఢిల్లీని చుట్టుముట్టారు. ఎంతమంది పోలీసులు ఎదురైనా భయపడలేదు.. లాఠీలు చూపించినా బెదరలేదు. అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లను సైతం ఎత్తి పడేశారు. జలఫిరంగులతో దాడి చేసినా ఏ మాత్రం చలించలేదు. ముసలివాళ్లు సైతం గంటల తరబడి రోడ్డుపై ఉండి.. వణికించే చలిలో సైతం నిప్పులు కక్కుతూ వారు చేసిన పోరాటం దేశం మొత్తం తిలకించింది. వారి మొర ఆలకించింది. అందుకే ప్రతి ఒక్కరికి ఈ రైతులు ఎందుకు పోరాడుతున్నారో అర్ధమైంది. అలుపెరగని వారి పోరు.. వారి కష్టం అందరికీ తెలిసేలా చేసింది. అందుకే ఈసారి బంద్ ఎలా జరిగిందనేదాని కన్నా.. ఎంతమందికి వారి సమస్య తెలిసిందనేదే ముఖ్యం. అలా అనుకుంటే వారు వంద శాతం విజయవంతమయ్యారనే చెప్పాలి.
అందరూ సపోర్ట్..
ఐటీ ఉద్యోగి సైతం.. రైతుకు అన్యాయమే జరుగుతోందని అంటుంటే.. కాలేజీ కుర్రాడు సైతం.. అరే ఏం పోరాడతున్నారన్నా.. మనం సపోర్ట్ చేయాల్సిందే అంటుంటే.. ఆ రైతు అంత కష్టంలోనూ హాయిగా నవ్వుకుంటున్నాడు. విజయగర్వంతో, రెట్టింపు ఉత్సాహంతో అడుగు ముందుకేస్తున్నాడు. నిజంగా ఈసారి అందరిలోనూ భారత్ బంద్ గురించి పాజిటివ్‌గా చర్చ జరిగింది. రాజకీయాలతీతంగా రైతులకు అన్యాయం జరుగుతుంది.. న్యాయం చేయాల్సిందేననే కామెంట్లు వినపడ్డాయి.
Must Read ;- మద్దతిచ్చిన పార్టీల్లో రైతులపై గౌరవం ఎంత?

వచ్చే గిట్టుబాటు ధరలో చాలా వరకు దళారీల పరం అవుతుందనేది వాస్తవం. టమోటాలు రైతు 2 రూపాయలకు అమ్మితే.. మనం కొనేటప్పుడు 20 రూపాయలు పెట్టాల్సి వస్తోంది. అక్కడే తేడా తెలిసి పోతుంది. సరిగ్గా దీన్ని చూపించే కేంద్రం వ్యవసాయ చట్టాలను తెచ్చింది.. అదే వాదిస్తోంది కూడా. అలాంటి దళారీ వ్యవస్ధను నిర్మూలించడానికే చట్టాలు తెచ్చామని చెబుతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర పెరుగుతుందని.. రైతు పొలంకాడే పంటను అమ్ముకోవచ్చని.. ఎక్కడికైనా తీసుకుపోయి అమ్ముకోవచ్చని.. ఎప్పుడైనా అమ్ముకోవచ్చని చెప్పింది. కాని ఆ చట్టాలను తిరగేస్తేనే అసలు సంగతులు బయటపడతాయి.
కార్పొరేట్ కంపెనీలకే లాభం
కేవలం కార్పొరేట్ కంపెనీలకు మన వ్యవసాయ ఉత్పత్తులు తేరగా ఇచ్చేయడానికే ఈ చట్టాలని అర్ధమవుతుంది. రైతు ఎక్కడికీ తీసుకుపోలేడు.. ట్రాన్స్‌పోర్టు ఖర్చు పెట్టుకోలేడు.. అప్పుడు ఏదో ఒక కంపెనీ వచ్చి కొంటుంది. రైతు పంటను దాచుకోలేడు.. అప్పుడు ఏదో ఒక కంపెనీకి అమ్ముకుంటే.. ఆ కంపెనీవాడు కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకుని.. రేటు పెరిగాక మార్కెట్‌లోకి వదులుతాడు. ఇక కంపెనీ వాడు చెప్పిన పంటనే వేయాల్సిన పరిస్ధితి వస్తుంది.. లేదంటే వాడు చెప్పినట్లే చేస్తూ.. తన సొంత పొలంలోనే రైతు కూలీగా మారే దుస్ధితి కూడా వస్తుంది. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తులను కారుచౌకగా కొనేసి.. విదేశీ, స్వదేశీ మార్కెట్లో అమ్ముకుని లాభాలు గడించడానికే ఈ చట్టాలు పనికొస్తాయి. అందుకే రైతులంతా దళారీ వ్యవస్ధను తొలగించండి.. మాకు సరైన రేటుకు గ్యారంటీ ఇవ్వండని డిమాండ్ చేస్తున్నాయి.. అంతేకాని కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వ్యవసాయాన్ని వదిలేయకండని మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రైతుల మొర ఆలకించి ఆ చట్టాలకు సవరణలు చేస్తుందని ఆశిద్దాం.
Also Read ;- ‘రైతుకి అండగా నిలబడలేని ప్రభుత్వం ఉండీ ఏం లాభం?’











