ఎఫ్‌సీయూకే – ఈ సినిమా పేరే వెరైటీగా ఉంది. అక్షరాలు అటూ ఇటూ మారిస్తే ఏకంగా బూతు అర్థమే వస్తుంది. కానీ ఇది ఓ ఫాదర్, చిట్టి, ఉమా, కార్తీక్ ల కథగా చెబుతూ దానికో జస్టిఫికేషన్ ఇచ్చారు దర్శకుడు. జగపతిబాబు ప్రధాన పాత్రధారుడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో మిగతా ముగ్గురితో ఆయన సంబంధం ఎలాంటిదన్న అంశాన్నే దర్శకుడు చెప్పదలుచుకున్నాడని టైటిల్ ను బట్టి అర్థమవుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథ లోకి వెళితే..
టైటిల్ మాదిరిగానే కథలో బూతు పాళ్లు ఎక్కువగానే ఉంది. అందుకే కాబోలు సెన్సార్ నుంచి దీనికి ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఫణి భూపాల్ (జగపతి బాబు)ది కండోమ్ ల బిజినెస్. దానికి తోడు ఆయన మంచి ప్లే బాయ్ కూడా. తండ్రి ఒకలా ఉంటే అతని కొడుకు మరోలా ఉంటాడు. మంచి కుర్రాడు కార్తీక్ (రామ్ కార్తీక్). అతను ఓ మెడికో ఉమ (అభిరామి)ని ప్రేమిస్తాడు. అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది.
ఆమె కూడా కార్తీక్ ను ఇష్టపడుతుంది. ఇలాంటి తరుణంలో చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల కార్తీక్, ఉమల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. ఇంతకీ ఇందులో ఉన్న చిట్టి ఎవరు? ఈ నలుగురిలో ఈ పాత్రకు ఎవరితో సంబంధం ఉంటుంది? ఈ కథ ఓ కొలిక్కి రావాలంటే ఏం జరగాలి? దర్శకుడు ఎలాంటి ముగింపు ఇచ్చాడు అన్నదే కథ. ఇలాంటి కథలు సుఖాంతమవుతాయని అందరూ ఊహించేదే. కానీ ఎలాంటి మలుపులు ఉన్నాయన్నదే ఆసక్తిపెంచేలా చేస్తుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఈ సినిమా టైటిల్ డిజైన్ మాదిరిగానే సినిమా ఉంది. దర్శకుడి తడబాటు కథనంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ తరహా కథలను వినోదాత్మకంగా మలచాలి. ఆ విషయంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెట్టినట్టు ఉంటుంది. కథనంలో గ్రిప్ మిస్సయ్యింది. జగపతిబాబును మంచి తండ్రిగా చూపినా ఆ పాత్రలోని మరో కోణం ప్రేక్షకులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఇలాంటి పాత్రలు చేయడం జగపతిబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటిదాకా విలన్ పాత్రలతో పేరు తెచ్చుకున్న జగపతిబాబును కొత్త తరహాలో దర్శకుడు చూపాడు. మిగతా మూడు పాత్రకూ ఇందులో చాలా ప్రాధాన్యం ఉంది. ఇంటర్వెల్ కు ముందు చిట్టి పాత్రను ప్రవేశపెట్టి దర్శకుడు ట్విస్ట్ ఇచ్చాడు.
కథలో మలుపులు ఎక్కువ పెట్టే ప్రయత్నంలో దర్శకుడు గందరగోళానికి గురయ్యాడు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడు బోర్ ఫీలయ్యేలా నెరేషన్ ఉంది. ఇలాంటి బోల్డ్ కంటెంట్ కు వినోదం తోడైతేనే కథనంపై ఆసక్తి కలుగుతుంది. పైగా డైలాగుల్లో పసలేదు. దర్శకుడు ఎక్కడ తాను తప్పులు చేస్తున్నాడో తెలుసుకునే లోపు సినిమా పూర్తయిపోయి ఉంటుంది ఇలాంటి కథను ఎంచుకుని నిర్మాత సినిమా చేయాలనుకోవడం కూడా సాహసమేననాలి. పాటలు, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు లాంటివన్నీ ఇందులో చర్చించకుండా ఉంటేనే బాగుంటుంది. ఫ్యామిలీ కథకు మసాలా జోడించి చెప్పడంతో అది కాస్తా నషాళానికి అంటి రుచి తెలియకుండా పోయింది.
నటీనటులు: జగపతిబాబు, రామ్ కార్తీక్, అభిరామి తదితరులు
మాటలు: ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
పాటలు: ఆదిత్య, కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె. మూర్తి
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
బ్యానర్: శ్రీ రంజిత్ మూవీస్
విడుదల: 12-02-2021
ఒక్కమాటలో: సెన్స్ లేని సెక్స్ ప్రయత్నం
రేటింగ్: 1.5/5
– హేమసుందర్ పామర్తి