కేంద్రం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణశాఖకు భారీగా కేటాయింపులు జరిపారు. ఆధునికీకరణకు కేటాయింపులు ఉంటాయని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రూ.4.78లక్షల కోట్లు కేటాయించారు. పదిహేనేళ్లలో ఈసారి ఎక్కువగా కేటాయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ కేటాయింపుల విషయం ఎలా ఉన్నా.. ఆయుధ సంపత్తి ఆధునికీకరణకు జరిపే కేటాయింపులే కీలకంగా ఉంటుండగా మిగతాది నిర్వహణ వ్యయం, వేతనాలు వంటివి ఉంటాయి. ఈ సారి ఆ మూలధన వ్యయం, నిర్వహణ వ్యయాన్ని కూడా 19 శాతం పెంచారు.
పాకిస్తాన్‌తో పాటు చైనాతో..
ఓవైపు పాకిస్తాన్‌తో పాటు చైనాతో కూడా ఇటీవల సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రక్షణానికి భారీగా కేటాయింపులు జరిపారు. గతంలో ఈ మూలధన వ్యయం రూ.1.13లక్షలు ఉండగా ఈ సారి అది రూ.1.34లక్షల కోట్లకు చేరింది.గత ఏడాదిలో పోల్చితే 19 శాతం పెంచారు. రాఫెల్ యుద్ధ విమానాల రాక, ఎయిర్ డిఫెన్స్ సిస్టం, యుద్ధ ట్యాంకుల కొనుగోళ్లు చేస్తుండడంతో ఈ మేరకు అదనపు కేటాయింపులు జరిపారు. మొత్తం మీద గతంలో 4.71లక్షల కోట్ల బడ్జెట్ ఉండగా, ఈ సారి అది రూ.4.78లక్షల కోట్లకు చేరింది. అయితే పెన్షన్ల తగ్గింపుతో పాటు పలు విభాగాల్లో కోతలు విధించడంతో మూలధన వ్యయం కేటాయింపులు పెరిగాయి. మొత్తం జీడీపీతో ఈ కేటాయింపు (పెన్షన్లు కాకుండా) చూస్తే 1.62శాతం పెంపు కనిపిస్తోంది. కాగా పాకిస్తాన్ కూడా ఆ దేశ డీజీపీతో పోల్చితే మనకంటే ఎక్కువ శాతం కేటాయింపులు జరుపుతున్నా..ఆ దేశ జీడీపీ తక్కువగా ఉంది. చైనా మాత్రం 2శాతం పైగానే తన జీడీపీలో రక్షణ రంగానికి కేటాయింపులు చేస్తోంది. తాజాగా మన బడ్జెట్‌లో అత్యవసర కొనుగోళ్లకు గాను రక్షణ శాఖకు రూ.20,776 కోట్లు కేటాయించడం హర్షించదగిన పరిణామంగా చెబుతున్నారు.
Must Read ;- తెలుగు రాష్ట్రాలకు నిల్.. ఎన్నికలున్నోళ్లకు ఫుల్

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం
కాగా, ఈ సారి జరిగిన కేటాయింపులపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 2021-22కి గాను రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్ల కేటాయింపుతో పాటు మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఇచ్చిన ప్రధానమంతి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ శారు. ఇక ఆయుధాల కొనుగోలు, మరమ్మతులకు గతేడాది రూ.1,13,734 కోట్లు ఉండగా ఈసారి 18 శాతం పెంచి రూ.1,35,060 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో లడ్డాఖ్ , సియాచిన్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని భద్రతా బలగాలకు సౌకర్యాలు మెరుగుపర్చనున్నారు.
అయినా చైనా కంటే తక్కువే..
మన బడ్జెట్‌లో ఇన్ని కేటాయింపులు చేసినా.. చైనాతో పోల్చినప్పుడు అంకెల పరంగా తక్కువగానే కనిపిస్తోంది. చైనా బడ్జెట్ పరిశీలిస్తే 2014-19 కాలంలో 261.11 బిలియన్ డాలర్లు కేటాయించగా భారత్ 71.1 బిలియన్ డాలర్లు , పాకిస్తాన్ 10.3 బిలియన్ డాలర్లు కేటాయించింది.
2014 నుంచి కేటాయింపులు ఇలా..
2013లో రక్షణ శాఖకు యూపీఏ ప్రభుత్వం రూ.2.28 లక్షల కోట్లు కేటాయించగా మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.2.33లక్షల కోట్లు కేటాయించింది. 2015–16 లో ఆధునీకరణకు రూ. 70.414 కోట్లు కేటాయించగా, 2016–17 నాటికి అది 0.9 శాతం తగ్గి రూ. 69.783 కోట్లకు చేరింది. రక్షణ పరికరాలు, ఆయుధాల కొనుగోళ్లు, రాడార్ల వ్యవస్థల కొనుగోళ్లలో వచ్చిన ఇబ్బందుల కారణంగా కేటాయింపు తగ్గినట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. 2019-2020లో తొలిసారిగా రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఆ ఏడాది పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.3,18,847 కోట్లు కేటాయించారు.
Must Read ;- టీమిండియాకు ఆర్థిక మంత్రి ప్రశంసలు.. క్రీడలకు మొండిచేయి











