అక్కినేని నట వారసుడు సుశాంత్ కు సోలోగా సరైన హిట్ పడలేదనే చెప్పాలి. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో అల్లు అర్జున్ పక్కన చోటు దక్కించుకుని ఆ హిట్ తో ఊరట చెందాల్సి వచ్చింది. ‘చి.ల.సౌ’ కొంతవరకూ సోలో హీరోగా గట్టెక్కించింది. తాజాగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో జనం ముందుకు వచ్చారు. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 27న విడుదలైంది. పేరులో కొత్తదనం ఉన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఓ కాలనీలో ఒంటరి మహిళపై జరిగిన దాడితో సినిమా ప్రారంభమవుతుంది. చూడగానే ఇదేదో మర్దర్ మిస్టరీ కథ అన్న భావన కలుగుతుంది. కట్ చేస్తే ఓ ఆర్కిటెక్ట్ కంపెనీలో కథ మొదలవుతుంది. అక్కడ అరుణ్ (సుశాంత్) కీలక బాధ్యతల్లో ఉంటాడు. ఆ కంపెనీలో ఉద్యోగం కోసం మీనాక్షి ( మీనాక్షి చౌదరి) వస్తుంది. వీరిద్దరూ ఆ కంపెనీలో ప్రేమలో పడతారు. అసలు కథలోకి వెళ్లే ముందు చాలా సేపటి వరకూ కొసరు కథే కొనసాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమా ప్రారంభంలో మహిళపై జరిగిన దాడికీ, వాహనాల పార్కింగ్ కూ ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోడానికి ఇంటర్వెల్ వరకూ ఆగాల్సిందే.
ఈ మధ్యలో అరుణ్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనడానికి షోరూమ్ కు వెళ్లడం, అక్కడ సేల్స్ మేన్ గా పనిచేసే వెన్నెల కిషోర్ తన చిన్న నాటి స్నేహితుడని తెలుసుకోవడం, అతను అసలు బైక్ ఎందుకు కొనాలనుకున్నాడో చెప్పడం, ఈ నేపథ్యంలోనే అతని ప్రేమ వ్యవహారం సంఘటనలతో కథ నడుస్తుంది. తన ప్రియురాలైన మీనాక్షి ఇంటికి వెళ్లి నో పార్కింగ్ ప్లేస్ అరుణ్ బైక్ పార్క్ చేసిన తర్వాత కథ మలుపుతిరుగుతుంది. కాలనీలో కార్పొరేటర్ల మధ్య నడిచే రాజకీయం, ఒకరిని దెబ్బకొట్టడానికి ఇంకో కార్పొరేటర్ ఓ పోలీస్ అధికారి సహాయంతో అరాచకాలు చేస్తుంటాడు. ఆ అరాచకాలన్నీ నో పార్కింగ్ ప్లేస్ లో బైక్ పెట్టిన అరుణ్ మెడకు చుట్టుకుంటాయి. వీటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడన్నదే కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
అసలు టైటిల్ చూస్తేనే ఈ సినిమాకు వెళ్లాలా వద్దా అన్న ఆలోచన కలుగుతుంది. ఇది ఏ జోనర్ లోకి వచ్చే సినిమానో ఊహించలేం. సినిమా చూశాక కూడా ఆ జోనర్ ఏమిటో మనమే చెప్పలేం. సినిమా ప్రథమార్థమైతే ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడుతుంది. బైక్ కొనడానికి వెళ్లిన వ్యక్తితో అన్ని విషయాలు అక్కడ చెప్పించడం విసుగు కలిగిస్తుంది. సినిమా ప్రారంభమే జనానికి మింగుడు పడదు. ఎక్కడ ప్రారంభమైంది? సినిమా ఎలా వెళుతోంది? అన్న స్పృహను కూడా ప్రేక్షకుడు కోల్పోతాడు.
సినిమాల కథల ఎంపికలో హీరో సుశాంత్ ఎలాంటి తప్పిదాలు చేస్తుంటాడో ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అరుణ్ గా సుశాంత్ లో స్పార్క్ లేదు. అతని మొహంలో హావభావాలే పలకవు. అక్కినేని వారసుడు అనుకుని అతనిలో లేని నటనను ఊహించుకుని సినిమాని ఎంజాయ్ చేయడం తప్ప మరో మార్గం లేదు. ఏదో నాలుగు డ్యాన్సులు చేసేస్తే జనం ఆదరించేస్తారనుకోవడం కూడా భ్రమే. కామెడీతో బలవంతంగా నవ్వించే ప్రయత్నం కనిపించిందిగానీ మనకు మాత్రం ఎక్కడా నవ్వు రాదు.
వెన్నెల కిషోర్ లాంటి టైమింగ్ ఉన్న నటుడు కూడా ఈ విషయంలో విఫలమయ్యాడు అంటే తప్పు ఎవరిదో అర్థం చేసుకోవాలి. ఈ సినిమాకు ప్రేక్షకులు రారాదు అనే ఉద్ధేశంతో సినిమా తీసినట్టుంది. మీనాక్షి పాత్రకు మాత్రం మంచి మార్కులు పడతాయి. చిన్న వయసు అమ్మాయి అయినా అందంగా కనిపించింది. మరికొన్ని ఆఫర్లు రావడానికి అవకాశం ఉన్న అమ్మాయిలా కనిపించింది. పోలికలు చూస్తే ఓ అగ్రహీరో కూతురు అన్నట్టు ఉంది. హీరో సుశాంత్ తల్లిగా నటి ఐశ్వర్య నటించింది. ఆమె మొహం చూస్తేనే ఇలాంటి తల్లి పాత్రకు ఇంకెవరూ దొరకలేదా అన్న భావన కలుగుతుంది.
ఒకప్పుడు హీరోయిన్ గా ఆకర్షించిన ఆమె మొహం అలా ఎందుకు మారిపోయిందో మనకు అర్థం కాదు. పోలీసు అధికారి రుద్ర పాత్ర పోషించిన వ్యక్తికి మంచి మార్కులు పడతాయి. అనవసరమైన పాత్రలు, కథకు పొంతనలేని సన్నివేశాలతో సినిమా గందరగోళంగా తయారైంది. ఒకవిధంగా థియేటర్లో ఈ సినిమాకు పార్కింగ్ ఫీజు కూడా దండగే. అన్ని విషయాల్లో దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది. కొందరు డబ్బులు ఎక్కువ ఉండి ఇలాంటి సినిమాలు తీస్తారా అన్న ఆలోచన చూసే వారికి కలిగి తీరుతుంది.
నటీనటులు: సుశాంత్, మీనాక్షి చౌదరి, వెన్నెల కిషోర్, వెంకట్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, రవివర్మ, ఐశ్వర్య తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం ప్రవీణ్ లక్కరాజు, మాటలు: సురేష్ బాబా – భాస్కర్, కెమెరా: సుకుమార్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: దర్శన్
విడుదల: 27-08-2021
ఒక్క మాటలో: ఆ థియేటర్ కు జనం వెళ్లరాదు
రేటింగ్: 1.5/5











