బియ్యపు మదుసూదనరెడ్డి.. వైసీపీలో దూకుడు కలిగిన నేత. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్యెల్యేగా కొనసాగుతున్న ఈయన.. మొన్నామధ్య అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో తనదైన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రసంగం చూసినవారంతా అయ్యో మదుసూదనా.. ఇంగ్లీష్ మీడియం లేక ఇబ్బంది పడ్డారా? అన్న జాలి కలగక మానదు. అయితే విపక్షాలపై తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే మదుసూదన.. జగన్ ను ఎవరేమన్నా అస్సలు ఊరుకోరు. అంతేకాదండోయ్.. ఆయనలో జగన్ పట్ల ఆపర భక్తుడు కూడా ఉన్నాడన్న విషయం ఇటీవలే బయటపడింది కదా. ఇప్పుడేమో.. ఆ భక్తిని మరింతగా చూపించుకునే దిశగా జగన్ సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ సందర్భాన్ని పురస్కరించుకుని తన నియోజకవర్గంలో ఆకాశాన్నంటేలా కటౌట్ లను ఏర్పాటు చేశారు. మరి ఈ కటౌట్లు జగన్ కంటబడతాయో లేదో గానీ.. జగన్ పై మదుసూదన భక్తి పారవశ్యం మాత్రం జనానికి అయితే చేరిపోయింది.
జగన్ కు గుడి..
తన సుధీర్ఘ పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలన్నీ వైసీపీ సర్కారు ఇప్పటికే 90 శాతం మేర అమలు చేసిందట. అంతేకాకుండా నవరత్నాల పేరిట జగన్ చెప్పిన హామీలు, వాటి అమలుతో జగన్ తిరుగులేని నేతగా ఎదిగారట. ఈ అంశాలన్నీ కనిపించేలా మదుసూదనరెడ్డి తన నియోజకవర్గ కేంద్రం శ్రీకాళహస్తిలో ఏకంగా జగన్ కు గుడి కట్టించేశారు. రూ.10 లక్షలతోనే ఈ గుడిని కట్టినట్టుగా చెబుతున్న మదుసూదన.. ఇందుకోసం చాలా ఎక్కువ నిధులే ఖర్చుపెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోని మదుసూదన.. శ్రీకాళహస్తిలోని జగనన్న కాలనీలో ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ గుడిపై ఇటీవలే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి. బతికున్న నేతకు గుడి కట్టించడమేమిటంటూ వైసీపీ వర్గాలే నొసలు చిట్లించాయి. అయితే బయట నుంచి విమర్శలతో పాటు పార్టీ నుంచి వినిపించిన విమర్శలను కూడా మదుసూదన పట్టించుకోలేదనే చెప్పాలి. ఎవరేమనుకున్నా.. తనలోని జగన్ భక్తిని ఆయన ఇలా చాటుకున్నారు.
ఆకాశాన్నంటేలా కటౌట్లు
ఆగస్టు 28.. జగన్ మ్యారేజ్ డే కదా. సరిగ్గా ఈ రోజు (ఆగస్టు 28) నాటికి వైఎస్ భారతితో జగన్ కు పెళ్లి జరిగి 25 ఏళ్లు అవుతుందట. అందుకే ఈ వేడుకను ప్రత్యేకంగా జరుపుకునేందుకు జగన్ కుటుంబ సమేతంగా సిమ్లా టూర్ వెళ్లారు. ఇక వైసీపీ శ్రేణులు జగన్ సిల్వర్ జూబ్లీ వేడుకను తమదైన రేంజిలో హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో అందరికంటే ముందు ఉన్న మదుసూదన.. జగన్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ లోనూ తనదైన ప్రత్యేకతను చూపించారు. జగన్, భారతిలు వివిధ సమయాల్లో తీయించుకున్న ఫొటోలతో మదుసూదన ఆకాశాన్నంటేలా ఓ భారీ కటౌట్ ను రూపొందించారు. ఈ కటౌట్ ఇప్పుడు శ్రీకాళహస్తితో పాటు ఏపీవ్యాప్తంగా సోసల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జగన్ పట్ల మదుసూదనకు ఉన్న స్వామి భక్తి కారణంగానే ఈ కటౌట్ వెలసిందన్న కామెంట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- బాబు, జగన్ జమానాల లెక్క ఇది!











