సినీ దర్శక నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి నోట కొత్త రాగం వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పోసాని కృష్ణమురళి కేసీఆర్ జపం చేశాడు. కేసీఆర్‌ను ఏకంగా ఆకాశాన్ని ఎత్తేశాడు. ఎన్‌టిఆర్ తరువాత కేసీఆరే బెస్ట్ సీఎం అని కితాబిచ్చాడు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలోనే హైదరాబాద్‌లో లా అండ్ అర్డర్ మెరుగ్గా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో మతఘర్షణలు తగ్గాయని, మళ్లీ ఆ తరువాత హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే అది కేసీఆర్ పాలనలోనే అని కితాబిచ్చారు. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన చెప్పారు.
పోసాని చెబితే ఓట్లు రాలుతాయా?..
ఎన్నికల సమయంలో సడెన్‌గా పోసాని కృష్ణ మురళి తెరపైకి వచ్చి దర్శకుడు ఎన్.శంకర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రజల ఓట్ల కోసమే పోసానిని ఇలా తెరముందుకు తీసుకొచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్పీడుకు బ్రేకులు వేయాలంటే ఇక్కడ ఉన్న సెటిలర్ల ఓట్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే దర్శకుడు శంకర్‌తో కలిసి పోసాని కృష్ణమురళితో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే పోసాని కృష్ణ మురళి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన ప్రకటన ఎంత మేరకు ఆ పార్టీకి లాభం చేకూరుస్తుందో చెప్పడం కష్టమే అంటున్నారు. పోసాని ఎప్పుడు ఎలా మాట్లాడుతారో.. అసలెందుకు మాట్లాడుతారో.. ఆ మాటల వెనుక అర్థం, పరమార్థం ఏమిటో అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అప్పుడప్పుడు ఇలా మీడియా ముందుకు వచ్చి విరుచుకుపడుతుంటారు. ఈ నేపథ్యంలో పోసానితో ఇలా ప్రకటనలు చేయిస్తే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రోళ్ల ఓట్లు పడతాయా అంటే అది కష్టమే అనే సమాధానం వస్తుంది. పోసాని మాటలను నమ్మే పరిస్థితిలో సెటిలర్లు ఉన్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది.
Must Read ;- GHMC ఎన్నికలు కేసీఆర్ ఫ్యామిలీకి ‘రక్త’ పరీక్షే
టీఆర్ఎస్‌కే ఓటు వేయండి…
ఈ రోజు సోమాజిగూడా ప్రెస్ క్లబ్‌లో దర్శకుడు ఎన్.శంకర్‌తో కలిసి దర్శకనిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కే ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఎన్టీఆర్ తర్వాత సీఎం కేసీఆరే హైదరాబాద్‌లో మతకలహాలు లేకుండా చేశారన్నారు. ఢిల్లీలో ఉన్న అంత పెద్ద మనిషి కూడా కొన్ని చేయలేక పోయారని పరోక్షంగా బీజేపీని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కూడా కొన్ని మంచి పనులు చేశారు, కొన్నింటిని చేయలేకపోయారని తెలిపారు. తాను విమానంలో వెళ్తుంటే తెలంగాణ అంతా పచ్చగా కనిపించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కొంత మంది ఆంధ్రా లీడర్ల మీదనే కోపం, కానీ ఆంధ్రా ప్రజలపై కాదన్నారు. వందేళ్ల క్రితం పెద్ద వర్షం వస్తే నిజాం నవాబ్ ఒక్కరినీ కూడా కాపాడలేకపోయాడు, కానీ కేసీఆర్ ఏదో ప్రయత్నం చేశాడని చెప్పారు. ప్రజలు, చోటా మోటా నేతలే నాలాలు కబ్జా చేశారని ఆరోపించారు. వచ్చిన వరదకు కేసీఆర్ కారణం కాదు కదా అని, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా కూడా వరదను ఏమీ చేయలేరన్నారు. లక్షల కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారన్నారు. నిధలు లేని కారణంగా పనులు మెల్లగా జరుగుతున్నాయని పోసాని చెప్పారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ అభివృద్ది అవుతుందని, ఈ ఆరేళ్లల్లో జరగాల్సిన అభివృద్ధి జరిగిందని కేసీఆర్ ను కొనియాడారు. అన్ని పనులు ఒకేసారి కావాలంటే ఎవరికి సాధ్యం కావని ఆయన కేసీఆర్‌ను కీర్తించారు.
Also Read ;- తెలంగాణ వైసీపీ.. అలాంటిది ఒకటి ఉందా?











