అతిథిని దేవుడిలా గౌరవించమంటోంది మన శాస్త్రం. కానీ వచ్చిన అతిథి దెయ్యమా దేవుడా ఎలా తెలుసుకోవాలో మాత్రం చెప్పలేదు. ఈ తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘అనగనగా ఓ అతిథి’ చిత్రం. కన్నడంలో ‘కరాళ రాత్రి’గా సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని ఓటీటీ సినిమాగా తెలుగులో రీమేక్ చేసి విడుదల చేశారు. ‘ఆహా’ ఓటీటీ ద్వారా ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
కథలోకి వెళితే..
ఓ పేద కుటుంబలోకి వచ్చిన అతిథితో ఆ కుటుంబంలోకి ఎలాంటి కష్టాలొచ్చాయి అన్నదే కథ. పేద కూలీ దంపతులు (ఆనంద్ చక్రపాణి, వీణాసుందరి) ల కుమార్తె మల్లిక (పాయల్ రాజ్ పుత్) ఆలోచనా ధోరణి వేరు. మగవాళ్లు ఎవరైనా ఆడగాలి సోకితే పడిపోతారనే ఆమె నమ్మకం. వయసు పైబడినా ఆమెకు పెళ్లి కాదు. ఇలాంటి ఆ కుటుంబంలోకి చిన్నికృష్ణ (చైతన్య కృష్ణ) వస్తాడు.
అతని దగ్గర బోలెడంత బంగారం, డబ్బు కూడా ఉంటుంది. అంతడబ్బు అతని వద్దకు ఎలా వచ్చిందనేది ఓ సస్పెన్స్. అసలు అతను ఆ ఇంటికే ఎందుకు రావాల్సి వచ్చింది? మల్లికకు పెళ్లి ఎందుకు జరగడం లేదు? అన్నది ఇందులో కీలక అంశాలు. ఆశ, అత్యాశ, దురాశల గురించి ఓ స్వామీజీతో ముందే ప్రవచనం చెప్పించారు. ఇంతకీ ఈ ఆశ, దురాశ ఎవరిలో వచ్చాయన్నది మరో కోణం. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కథ సాగుతుంది. సినిమా చివరలో మంచి ట్విస్టు ఉంటుంది. అది చెప్పేస్తే థ్రిల్ ఉండదు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఈ కథ ప్రధానంగా మల్లిక కోణంలోనే సాగుతుంది. ఈ పాత్రను పాయల్ చక్కగా పోషించింది. ఆ పాత్రలోని ఎమోషన్స్ బాగా కేరీ చేసింది. పాత్రలోని వేరియేషన్స్ ని బాగా పండించింది. కొన్ని సన్నివేశాలు భావోద్వేగంతో సాగాయి. చైతన్య కృష్ణ కూడా బాగా చేశాడు. నిజానికి ఈ కథ కన్నడంలో సినిమాగా రాకముందు ఓ నాటకం. సినిమాగా బాగుంటుందనే ఉద్దేశంతో తెరకెక్కింది. అక్కడ మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడిగా దయాళ్ పద్మనాభన్ కు కూడా ఈసినిమా మంచి పేరు తెచ్చింది.
అనేక అవార్డులనూ రివార్డులనూ సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. నటుల నుంచి చక్కటి నటనను రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కథనంలో కొంత సాగదీత కనిపించింది. మాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పాల్సి ఉంటుంది. సహజత్వానికి రచయిత కాశీ నడింపల్లి పెద్ద పీట వేశారు. వినోదానికి అవకాశం చాలా తక్కువ. కమర్షియల్ అంశాలు లేవు. పాయల్ రాజ్ పుత్ ఉంది కదా అని ఏదో ఆశించి వెళితే కూడా భంగపాటే కలుగుతుంది. ఆర్ట్ ఫిల్మ్ లక్షణాలు ఈ సినిమాకు బాగా కనిపించాయి. ఇలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ కథకు కమర్షియల్ మసాలా లేకపోతే కష్టం.
నటీనటులు : పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణా సుందర్, నల్ల వేణు తదితరులు
సాంకేతిక వర్గం: కళ : విఠల్ కోసనం, మాటలు: కాశీ నడింపల్లి, కెమెరా : రాకేశ్ బీ, సంగీతం: అరోల్ కోరేలి
బ్యానర్: ట్రెండ్ లౌడ్
నిర్మాతలు: రాజా రామమూర్తి, చిదంబరం నడేసన్
దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్
ఎక్కడ చూడాలి? : ఆహా
విడుదల తేదీ : 20 – 11 – 2020
ఒక్క మాటలో : చూడాలనిపిస్తే చూడటమే
రేటింగ్ : 2.5/5
– హేమసుందర్ పామర్తి