నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటోన్న మలయాళ టీనేజ్ లవ్ స్టోరీ ‘కప్పేళ’. ఈ తరం యువతీ యువకులు ఏది ప్రేమో, ఏది ఆకర్షణో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ముక్కూ ముఖం తెలియని వారితో ఫోన్ సంభాషణలోనూ, ఛాటింగ్ లోనూ మునిగి తేలుతూ.. దాని పర్యావసానాన్ని తెలుసు కోలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ సినిమా ఓ చెంపపెట్టు. ఆ పాయింట్ ను చాలా సహజంగా, సున్నితంగా తెరమీద ఆవిష్కరించాడు కొత్త దర్శకుడు ముహమ్మద్ ముస్తాఫా.
కథేంటి? : జెస్సీ అనే ఓ దిగువ మధ్యతరగతి అమ్మాయి.. చెల్లి, తల్లిదండ్రులతో ఒక పల్లెటూళ్ళో నివసిస్తూ ఉంటుంది. తండ్రి రైతు, తల్లి టైలర్. ఆ ఇద్దరికీ కూతుళ్లిద్దరూ చేదోడు వాదోడుగా ఉంటారు. ఒక రోజు జెస్సీ తన ఫోన్ నుంచి పొరపాటున ఒకరికి కాల్ చేస్తుంది. అది ఒక ఆటో డ్రైవర్ నెంబర్. తన పొరపాటును గ్రహించిన ఆ అమ్మాయి అతడికి సారీ చెప్పి.. ఫోన్ కట్ చేస్తుంది. అయితే ఇదే నెంబర్ తో ఆ ఆటోడ్రైవర్ జెస్సీని ట్రాప్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా అతడి ఆకర్షణలో మునిగిపోతుంది. ఇద్దరూ ఒకరు ముఖం ఒకరు చూసుకోకుండా.. డైరెక్ట్ గా కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. అతడ్ని కలుసుకోడానికి ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా బస్సెక్కుతుంది. బస్టాండ్ లో అతడు అమ్మాయి గురించి వెయిట్ చేస్తూంటాడు. ఇంతకీ జెస్సీ అతడ్ని ఎలా గుర్తుపడుతుంది? ఆ ప్రయత్నంలో ఆమె ఎలాంటి సమస్యలు ఫేస్ చేసిందీ అన్నదే మిగతా కథ.
ఎలాతీశారు?: సింపుల్ స్టోరీ.. కన్ఫ్యూజన్ లేని నెరేషన్ .. నటీనటుల సహజ నటన.. కాసిని ఎమోషన్స్ .. శ్రుతిమించని డ్రామా.. ఈ సినిమా ప్రత్యేకతలు. దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా సుత్తి లేకుండా చెప్పడమే ఈ సినిమా ప్రత్యేకత. హీరోయిజం లేదు, అనవసర బిల్డప్పులు లేవు. చక్కగా కొలత కొలిచినట్టు నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ను రాబట్టాడు దర్శకుడు. కేరళలోని సహజమైన లొకేషన్స్ .. అందమైన విజువల్స్ .. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. జెస్సీగా అన్నాబెన్ చాలా చక్కగా నటించగా.. ఆటో డ్రైవర్ గా రోషన్ మ్యాథ్యూ అదరగొట్టాడు. నెట్ ఫ్లిక్స్ లో చోక్డ్ అనే హిందీ సినిమా చూసిన వారు అందులో హీరోగా నటించిన రోషన్ ను కప్పేళా లో చూసి గుర్తుపడతారు.
ఒక్కమాటలో : ఇప్పడొస్తున్న లవ్ స్టోరీస్ కు చాలా భిన్నంగా కప్పేళ సినిమా కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రేమ గుడ్డిది అన్న నానుడిని.. ఈ సినిమా నిజంగా నిజం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. యువతకు కావల్సిన అన్ని అంశాల్నీ ఈ సినిమాలో మేళవిస్తూనే .. ఒక చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చాడు దర్శకుడు. అందుకేనేమో .. సితారా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకొని.. తెలుగులో నిర్మించే ప్రయత్నం చేస్తోంది… నిజంగా ఇలాంటి యూనివర్సల్ కాన్సెప్ట్స్ ను ఏ భాషలోనైనా నిర్మించవచ్చు.
ఎక్కడ చూడాలి?: నెట్ ఫ్లిక్స్
నటీనటులు : అన్నాబెన్, రోషన్ మ్యాథ్యూ, శ్రీనాథ్ భాసి, సుధీష్, సుధీ కొప్ప, నిషా సరంగ్ తదితరులు
సాంకేతిక నిపుణులు : సంగీతం.. సుశిన్ శ్యామ్, సినిమాటో గ్రఫీ.. జిమ్షి ఖాలిద్, ఎడిటింగ్.. నౌఫల్ అబ్దుల్లా..
నిర్మాణం: విష్ణు వేణు
భాష: మలయాళం
రేటింగ్ : 3.5 / 5