ఏపీలో శుక్రవారం నాడు పలువురు ఐఏఎస్ అధికారులను జగన్ సర్కారు బదిలీ చేసింది. ఈ బదిలీల్లో ఐదారుగురు సీనియర్ ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగినా.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా కొనసాగుతున్న గిరిజా శంకర్ బదిలీపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నపెద్దిరెడ్డి రామంద్రారెడ్డి ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖపై వెల్లువెత్తిన విమర్శలు ఏ శాఖలోనూ వినిపించలేదు. ఇతరత్రా వ్యవహారాలు ఎలా ఉన్నా.. పీఆర్ శాఖ సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. దీంతో ఆ శాఖ కమిషనర్‌గా ఉన్న గిరిజా శంకర్‌తో పాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గిరిజా శంకర్‌కు ఏకంగా జైలు శిక్ష కూడా విధించిన హైకోర్టు.. ఆ తర్వాత ఆ శిక్షను తగ్గించి ఓ రోజంతా కోర్టులో కూర్చోబెట్టేసింది. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా కీలక పోస్టులో విధులు నిర్వర్తించిన గిరిజా శంకర్.. ఏనాడూ హ్యాపీగా పనిచేసిన పాపాన పోలేదనే చెప్పాలి.
అన్నింటా ధిక్కరణలే..
గ్రామాల్లోని పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు, పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాల నిర్మాణం, ఉపాధి నిధుల విడుదలలో జాప్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సర్కారు ఇష్టారాజ్యం.. ఇలా పంచాయతీ రాజ్ శాఖ లెక్కలేనన్ని వివాదాలను చవి చూసింది. వీటిపై దిద్దుబాటు చర్యలు చేపడదామని అధికారులు చూసినా.. మంత్రి పెద్దిరెడ్డి మాటను కాదని ముందడుగు వేయలేకపోయారు. వీటిపై పలువురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఈ కేసుల విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము జారీ చేసిన ఆదేశాలను కూడా పాటించకుండా ఎలా సాగుతారని ఆగ్రహించిన కోర్టు.. ఏకంగా అధికారులపై కన్నెర్రజేసింది. కోర్టు ధిక్కరణ కేసులను నమోదు చేసింది. అయినా కూడా పెద్దిరెడ్డి పట్టించుకోలేదు కదా.. మరింత దూకుడుగా వెళ్లారు. ఫలితంగా పంచాయతీరాజ్ శాఖ వెల్లువెత్తిన వివాదాలు మరే శాఖలోనూ కనిపించలేదనే చెప్పాలి.
కోన ఎలా రాణిస్తారో..?
గిరిజా శంకర్ మాదిరే కొత్తగా పంచాయతీరాజ్ కమిషనర్‌గా బదిలీ అయిన కోన శశిధర్ కూడా సమర్థవంతమైన అధికారిగానే పేరు తెచ్చుకున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జగన్ సర్కారు గుడ్ లుక్స్‌లో పడిపోయారు. గుంటూరు కలెక్టర్ పదవి నుంచి ప్రమోషన్ దక్కించుకున్న ఆయన పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆ శాఖ నుంచి తాజా బదిలీల్లో ఆయన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కోన శశిధర్ పనితీరు కారణంగా అప్పటిదాకా పౌర సరఫరాల శాఖలో నిత్యం అయోమయ పరిస్థితులన్నీ మటుమాయం అయిపోయాయి. మరి పౌర సరఫరాల శాఖను చక్కబెట్టినట్టుగానే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖను కూడా ఆయన చక్కబెడతారో.. లేదంటే పెద్దిరెడ్డికి ఎదురు చెప్పలేక కోర్టుల చుట్టూ గిరిజా శంకర్ మాదిరే తిరుగుతారో చూడాలన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- ఈ సారి పూనం వంతు.. బెయిల్ కూడా లేదంతే