జీహెచ్ఎంసీ ఎన్నికల వేడీ రాష్ట్రం మొత్తానికి తాకింది. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీకి చెందిన కొందరు నేతలు చేస్తున్న ప్రసంగాలు హైదరాబాద్‌లో యుద్ధ వాతావరణానికి దారితీస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు నేతలు ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ ఎన్నికల పోటీ తారాస్థాయికి చేరుకుంది. ఈ పోటీలో గెలిచేందుకే పార్టీల మధ్య స్వరం పెరిగిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఎన్నికల తంతునంతా హైదరాబాద్ ప్రజలు దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు.
పార్టీలు చేస్తున్న ప్రచార సరళిని, నేతలు చేస్తున్న రెచ్చగొట్టే మాటలను హైదరాబాద్ ప్రజలు క్లోజ్‌గా పరిశీలిస్తున్నారు. మొన్న సోమవారం భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య ‘ఛేంజ్ హైదరాబాద్’ పేరుతో హైదరాబాద్‌లో ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత ఆయన సమావేశం వివరాలను పేరు మార్చి ట్విట్టర్‌లో పెట్టడం సంచలనంగా మారింది. ‘గో అవే’ అని తెలుగులో అంతరార్థం వచ్చే హ్యాష్ ట్యాగ్‌తో తేజస్వీ సూర్య పేరు ట్రెండింగ్ అయింది. అయితే తేజస్వీ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవడాన్ని ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. కానీ అందులో తేజస్వీ వాడిన ఒక పదాన్ని మేము ప్రచురితం చేయలేకపోతున్నామని అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. అంటే గో అవే పదానికి తెలుగులో ఒక బూతు అర్థం వచ్చేలా ఉన్నట్లు ఆ వార్త పత్రిక ఉద్ధేశ్యం అనుకుంట.
Must Read ;- పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అయితే తేజస్వీ చేసిన వ్యాఖ్యలే కావు.. ఇతర నాయకులు కొందరు చేస్తున్న వ్యాఖలపై ప్రజలు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు, సీట్ల కోసం నేతలు ఇలాంటి రెచ్చగొట్టే వివాదస్పద వ్యాఖ్యలను కావాలనే చేస్తున్నారని పేర్కొంటున్నారు. హైదరాబాద్ ప్రజలను ఇలాంటి వ్యాఖ్యలతో విడగొట్టే ప్రయత్నాన్ని చేస్తుండటం దురదృష్టకరమని అంటున్నారు. ఇక్కడి ప్రజలను రెండు వర్గాలుగా విడగొట్టి ఓట్లను సీట్లుగా మల్చుకోవాలని కొంత మంది నాయకులు చేస్తున్న ప్రయత్నం సఫలం కాదని అంటున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అన్నిరాజకీయ పార్టీల మీద ఉందనే విషయాన్ని గ్రహించాలి. అలాగే బీజేపీ వాళ్లను బిర్యానీ తినిపిస్తామని ఎంఐఎం నేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు, పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకి చెందినవిగానే చూడాల్సి ఉంటుందని మేథావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కావాలనే రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఆ వర్గం వారి ఓట్లను దండుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడాన్ని హైదరాబాదీలు ఎప్పటికీ సమర్ధించరనేది నేతలు గ్రహించాల్సి ఉంది. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణంగానే చూడాలి గానీ ఇలా ఓట్ల కోసం ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌ను రెండుగా చీల్చడం సరైంది కాదని మేథావులు, ప్రజలు పేర్కొంటున్నారు. నేతలు ఇకనైనా తమ పంథాను మార్చుకోకుంటే ప్రజలే వారికి బుద్ధి చెబుతామని హైదరాబాదీలు హెచ్చరిస్తున్నారు.
Also Read ;- భారతీయుల ఓట్లతో గెలవలేరా?:బండి సంజయ్











