టీవీ రేటింగ్స్ కుంభకోణంలో ముంబయి పోలీసులు తాజాగా రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్ చందానీని అరెస్టు చేశారు. ఈ ఏడాది అక్టోబరు ఆరో తేదీన రిపబ్లిక్ టీవీ యాజమాన్యం రేటింగ్స్ స్కామ్ చేస్తోందంటూ హన్సా మీడియా రిసెర్చ్ హెడ్ నితిన్ థియోకర్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ గనశ్యామ్ సింగ్‌పై ఇప్పటికే 1400 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రూవర్లుగా మారినట్టు తెలుస్తోంది.
రేటింగ్స్ మాఫియా
దేశంలో టీవీల రేటింగ్స్‌ను అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ప్రకటనల రెవెన్యూ పెంచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ రేటింగ్స్‌ను తప్పుగా నమోదు చేస్తోందంటూ హన్సా మీడియా రీసెర్చ్ హెడ్ నితిన్ థియోకర్ గుర్తించారు. దీనిపై ఆయన గత అక్టోబరులో కోర్టును ఆశ్రయించారు. కొన్ని టీవీ ఛానళ్లు రేటింగులను వారికి అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ప్రకటనదారులను మోసం చేస్తున్నాయని కేసులో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ముంబయి పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేశారు. తాజాగా రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్ చందానీని అరెస్టు చేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Also Read ;- బైడెన్, ఆర్నాబ్ కోసం తెగ గూగల్ చేశారట జనాలు

అర్నాబ్‌పై ఇప్పటికే పలు కేసులు
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ఇప్పటికే పలు కేసులు నడుస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ స్టూడియో ఇంటీరియర్‌కు రూ.80 లక్షలతో పనులు చేయించుకుని బిల్లులు చెల్లించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇంటీరియర్ పనులు చేయించుకుని మూడు సంవత్సరాలకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టు సంస్థ యజమాని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందని, దీనికి అర్నాబ్ గోస్వామి బాధ్యత వహించాలని కేసు నమోదైంది. దీనిపై ఇప్పటికే ముంబయి పోలీసులు అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేసి జైలులో పెట్టారు. అర్నాబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు చేయడంతో అతన్ని విడుదల చేశారు. తాజాగా ఈ స్కామ్‌లో రిపబ్లిక్ టీవీ సీఈవోను అరెస్టు చేయడంతో మరోసారి రిపబ్లిక్ టీవీ వార్తల్లో నిలిచింది.
Must Read ;- అరెస్టు ఎఫెక్ట్ : ఇక అన్ని రాష్ట్రాల్లో అర్ణబ్ దూకుడు!










