(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
బెదిరింపులతో, ప్రలోభాలతో, పైరవీలతో ఇలా.. ఓటర్లను ప్రభావితం చేసే ప్రతీ అంశాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆయన చర్యల ద్వారా నిరూపితం అవుతోంది. Ysrcp ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… వలంటీర్ వ్యవస్థ కీలకంగా మారింది. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ /వార్డు వలంటీర్ ను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకంలో… లబ్ధిదారులతో సన్నిహితంగా మెలిగే వలంటీర్ల వ్యవస్థను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎస్ ఈ సి ఆదేశించడం అందుకు నిదర్శనం. వలంటీర్ల సేవలను ఎన్నికల్లో వినియోగించుకోవద్దని ఆయన స్పష్టం చేశారు.
అధికార పార్టీ గొంతులో పచ్చివెలక్కాయ..
వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎన్నికల్లో చక్రం తిప్పాలని భావించిన అధికార పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అమలులోకి వచ్చిన మరుక్షణం… ఎన్నికల్లో అధికార పార్టీ లబ్ధి పొందేందుకు ఎంతగానో దోహదపడుతుందని అప్పట్లోనే చర్చ నడిచింది. ఒకానొక సమయంలో ఓటర్ల ఇంటికి నేరుగా నగదు పంపిణీ చేసినా పట్టు కోవడం ఎవరివల్లా సాధ్యం కాదని, ఈ వ్యవస్థ సాయంతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ భారీ నగదు పంపిణీకి తెర లేపుతుంది అని అంచనాలు వేశారు. ఆ సమయం రానే వచ్చింది… ఎన్నో వివాదాల తరువాత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి.
Must Read ;- నిమ్మగడ్డది శునకానందం : గౌరవనీయ మంత్రి వ్యాఖ్య
ఈ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ డేగకన్ను వేసి ఉంటుందన్న విషయం విస్మరించడానికి వీలులేదు. ఈ కారణంగానే అధికార పార్టీ ఎస్ సి సి పదవీ విరమణ తర్వాత ఎన్నికలు తమకు నచ్చినట్టుగా నిర్వహించాలని భావించింది. ఆ వ్యూహం కాస్త బెడిసి కొట్టి.. ఎన్నికల రణరంగంలోకి దిగాల్సి రావడంతో వలంటీర్లు కీలక భూమిక పోషిస్తారని అంతా భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ… అందరి కంటే ఓ అడుగు ముందుకేసి ఎస్ ఈ సి వలంటీర్ల సేవలను ఎన్నికల ప్రక్రియలో నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ విషయమై ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశారు.
తీవ్ర ప్రభావం చూపే వారు…
ఎన్నికల్లో వలంటీర్ల సేవలు అధికార పార్టీ వినియోగించుకుని ఉంటే… ఓటర్ల తీర్పు పై తీవ్ర ప్రభావం చూపే వారు అనడంలో సందేహం లేదు. ప్రధానంగా లబ్ధిదారులను పార్టీ ఓటు బ్యాంకుగా మార్చడంలో సఫలం అవుతారు అనడంలో మరో ప్రశ్నకు తావులేదు. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా అన్ని వర్గాలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందినా.. వాటన్నింటిని ఓట్లుగా మలచుకోవడంలో టిడిపి విఫలమైంది. అయితే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన పార్టీ శ్రేణులు.. గ్రూపు తగాదాలు, ఇతరత్రా కారణాలతో విస్మరించారు. అధికార పార్టీకి ఆ సమస్య కూడా ఉండదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వం నెల నెలా జీతాలు చెల్లిస్తోంది.
పథకాల అమలులో ఎంత చిత్తశుద్ధితో పని చేస్తారో … అంతే చిత్తశుద్ధితో ఓటర్లను ప్రభావితం చేయగలుగుతారు అనడంలో మరో ప్రశ్నకు తావులేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ఎన్నికల కమిషనర్ చెక్ పెట్టారు.
Also Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!