నాగచైతన్య కెరియర్ ను పరిశీలిస్తే మొదటి నుంచి కూడా అతనికి ప్రేమకథలే కలిసొచ్చాయనే విషయం అర్థమవుతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చైతూ చేసిన ‘ఏ మాయ చేశావే’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. చైతూ జోడీగా సమంత నటించిన ఈ సినిమా, ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఆ తరువాత చైతూ చేసిన ‘100% లవ్’ కూడా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం, ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కథానాయికగా తమన్నా అలరించిన ఈ సినిమాను, యూత్ ఇప్పటికీ మరిచిపోలేదు.
ఇలా ప్రేమకథలతో మంచి విజయాలను అందుకున్న చైతూ, ఆ తరువాత వరుసగా యాక్షన్ తో కూడిన సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఆ జాబితాలో ‘దడ’ .. ‘బెజవాడ’ .. ‘తడాఖా’ .. ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలు కనిపిస్తాయి. ఈ సినిమాలతో తనలోని యాక్షన్ యాంగిల్ ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయడానికి చైతూ ప్రయత్నించాడు. కానీ సున్నితమైన డైలాగ్స్ చెబుతూ .. సుకుమారంగా ప్రియురాలి ఒడిలో ఒదిగిపోయే ప్రేమికుడిగానే ఆయనను చూడడానికి ఇష్టపడిన అభిమానులు, యాక్షన్ సినిమాలను ఆదరించలేకపోయారు. ఇలా వరుస పరాజయాలతో .. తన నుంచి అభిమానులు ఎలాంటి కథలను ఆశిస్తున్నారనే విషయం చైతూకి అర్థమైంది. అందుకు నిదర్శనమే ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన ‘మజిలీ’.
Must Read ;- అక్కినేని వారబ్బాయికి అచ్చొచ్చిన లవ్ స్టోరీస్
చైతూ అప్పటివరకూ చేస్తూ వచ్చిన ప్రేమకథల్లో ‘మజిలీ’ స్థానం ప్రత్యేకమేనని చెప్పాలి. ఉత్సాహాన్నీ .. ఉద్వేగాన్ని జోడించి దర్శకుడు ‘శివ నిర్వాణ’ ఈ ప్రేమకథను అందంగా ఆవిష్కరించాడు. సమంత .. దివ్యాన్ష కౌశిక్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, నటుడిగా చైతూను మరోస్థాయికి తీసుకెళ్లింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సంపాదించిపెట్టింది.
చైతూకి ప్రేమకథలే అచ్చొస్తాయనే విషయాన్ని ఈ సినిమా సక్సెస్ మరోసారి నిరూపించింది. అందువలన చైతూ మరో ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. అదే ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల మార్కు ప్రేమకథలు ఎంత సహజంగా ఉంటాయనేది అందరికీ తెలుసు. అందువలన ఈ సరికొత్త ప్రేమకథపైనే యూత్ దృష్టి వుంది. చైతూ జోడీగా సాయిపల్లవి నటించడం మరింత కుతూహలాన్ని పెంచుతోంది. ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాన్ని అక్కినేని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- లవ్ స్టోరి కి గుమ్మడికాయ కొట్టేశారు