విజయదశమి అనే పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది. వి+జయ+దశ+మి.. ఇలా విడగొట్టి చూస్తే అద్భుతం అని మీకు అనిపిస్తోంది కదూ. ఎందుకలాగో వివరించే ప్రయత్నం చేద్దాం.
మన ప్రాచీన రుషి పుంగవులు ఏ పేరుని పెట్టినా అందులో గమనించాల్సిన అనేక రహస్యాలు ఉన్నాయి. అక్షరాల్లో, పదాల్లో, పదాల విరుపుల్లో.. ఏదో ఒక అర్థం ఉండనే ఉంటుంది. వాటిని తెలుసుకున్న పక్షంలో పండుగలలో దాగిన గొప్పదనం అర్థమై పదికాలాల పాటు మనం ఈ పండుగ సంప్రదాయాన్ని కొనసాగించగలుగుతాము. మన ముందు తరం వాళ్లకి కూడా అందజేయగలిగిన వాళ్లం కూడా అవుతాము. ఈ దృష్టితో చూస్తే ఈ పండుగ పేరు ‘జయదశమి’ కాదు. విజయ దశమిట.పైగా విజయ ‘దశ’మి ఏమిటి? పదిరోజులపాటు సాగే పండుగట ఇది. మంచిదే! పదిరోజుల పాటే ఉందుకు సాగాలి? సరే.. పదిరోజులపాటూ పండుగ చేసుకోకుండా ‘10వ రోజునే ఎందుకు పండుగ చేసుకోవాలి? ఈ పది రోజుల్లోనూ మరి మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజ, దుర్గాష్టమి రోజున దుర్గాపూజ కూడా ఉంటూంటే, విజయం మాత్రం 10వ రోజునే వచ్చిందంటూ ‘విజయదశమి’ నాడే విశేష పూజని ఉదయం సాయంకాలాల్లో చేస్తారా? ఎందుకని? ఇలా ఎంతగా ఆలోచించడం మొదలెడితే అంతా ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ! అందుకే ఇంకా లోపలికి వెళ్లి ఆ రహస్యాల సంగతేంటో తెలుసుకుందాం!
జయం వేరు.. విజయం వేరు.. ఎందుకలా?
కేవలం మనకున్న అంగబలంతో, అర్ధ బలంతో ఎదుటివారి మీదికి వెళ్లి గెలుపుని సాధించగలిగితే.. అంటే గెలిస్తే దాన్ని ‘జయం’ అనాలంటోంది శాస్త్రం. ఇలా సాధించిన ‘జయం’ ఎప్పుడూ శాశ్వతంగా ఉండదట. ఇది నిజం కాబట్టే ఈ యుద్ధంలో గెలుపుని సాధించిన రాజు పైసారి యుద్ధంలో గెలుపుని సాధించని సందర్భాలెన్నో కనిపిస్తాయి మనకు. అశాశ్వతమైన గెలుపుని ‘జయం’ అనాలంటోంది ధర్మశాస్త్రం. అదే మరి ‘విజయ’ మైతే అది సంపూర్ణం శాశ్వతం కూడా. జయానికీ విజయానికీ మధ్య ఉండే తేడా అనేది అంగ బలాన్నీ అర్ధబలాన్నీ మరింతగా సమీకరించుకున్న కారణంగా వచ్చేది కాదు. ‘జయం’ అంటే మనుష్య శక్తితో సాధించుకునేది. అయితే విజయ మనేది మనకి రాబోతున్న గెలుపునకు భగవంతుడి అనుగ్రహం తోడైతే లభించేది అవుతుంది.
మనకి కావలసిన అన్ని శక్తులూ ఉన్నా భగవంతుడి అనుగ్రహం లేని పక్షంలో మనకి కలిగే గెలుపు సంపూర్ణం, శాశ్వతం కానే కాదు. ఇది నిజం కాబట్టే అర్జునుడికి ఉన్న పేర్లలో ఒకటి ‘విజయు’డనేది. అంటే ఎల్లకాలమూ అతనికి భగవదనుగ్రహం ఉంటూనే ఉంటుంది సుమా! అని తెలియజెప్పడమన్నమాట. ఆ కారణంగానే అర్జునుడి కన్నా గొప్పవాళ్లైన ఏకలవ్యుడూ కర్ణుడూ కూడా అతణ్ణి గెలవలేకపోయారు. పైగా ఏవేవో కారణాల వల్ల ఓడిపోయారు కూడా. మళ్లీ ఇదే అర్జునునికి, భగవదనుగ్రహమనేది ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడి వెళ్లినప్పుడు ఉండే వీలే లేకపోయింది.
ఆ కారణంగానే అంతఃపుర కాంతలందరికీ రక్షణగా ఉంటూ ఆ స్త్రీలని తెస్తూన్న సందర్భంలో దోవలు కొట్టేవాళ్లంతా అర్జునుని మీద తిరగబడి అర్జునుణ్ణి కావడి బద్దలతో మోదారు. అంటే ఏమన్నమాట? కృష్ణుడున్నంతకాలమే అర్జునునికి ఆ శక్తి ఉండి ‘విజయు’డయ్యాడు. ఆయన గతించాక అర్జునుడు కేవలం ‘పార్థునిగా’నే (కుంతీదేవి పుత్రునిగా మాత్రమే) అయిపోయాడు. కాబట్టి జయమంటే గెలుపు, విజయమంటే భగవంతుని కృపానుగ్రహాల కారణంగా లభించిన గెలుపని అర్థమన్న మాట! అందుకే సంప్రదాయం తెలిసిన ఎవరికైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నామంటూ చెప్పి పాదాభివందనాన్ని చేస్తే ‘జయోస్తు’ అనరు.. ‘విజయోస్తు’ అనే ఆశీర్వదిస్తారు. ‘నీకు గెలుపు లభించుగాక! దానికి పరమేశ్వరుని అనుగ్రహం ఉండుగాక! ఆ కారణంగా నీది శాశ్వతమైన గెలుపుగా మారుగాక!’ అని దాని అర్థమన్నమాట.
తనంత తానుగా ఆ అమ్మే ఓ దేవత అవుతూంటే, మళ్లీ ఆమెకి గెలుపుకోసం మరో దేవతానుగ్రహం కావాలా? అప్పుడే కదా ఆమె జయం విజయం ఔతుంది? ఇదేమిటబ్బా అని మనకు అనిపిస్తుంది. రాక్షసులూ దేవతలూ అనే ఇద్దరూ ఆయా స్థానాలని పొందింది కేవలం తమకి తాముగా ఆచరించిన తపస్సు వల్లనే. అంటే సాధించిన తపశ్శక్తి కారణంగానే.ఈ నేపథ్యం లో రాక్షసులు ఎక్కడ దేవతలని జయించలేమో? అనే దృష్టితో మరింత మరింత తపస్సుని చేశారు. వాళ్లు ఎంత స్థాయి తపస్సు చేశారంటే తానొక్కతే గాని వెళ్లి యుద్ధానికంటూ దిగితే చాలనంత. దాంతో ఆమె గణపతి నుండి పాశాన్నీ, కుమారస్వామి నుంచి శక్తి ఆయుధాన్నీ, తన భర్త శంకరుని వద్ద నుంచి శూలాన్నీ, శ్రీ మహావిష్ణువు నుంచి చక్రాన్నీ.. ఇలా ఇన్నింటినీ ధరించి (8మంది దేవతల నుండి 8 తీరుల తపశ్శక్తిని ఆయుధాల రూపంలో స్వీకరించి అష్టభుజిగా) ఆమె రోజుకో రాక్షసుణ్ణి చొప్పున వధించుకుంటూ వచ్చి 9 మంది రాక్షసులని వధించాక 10 రోజున 10వ రాక్షసుడైన మహిషుణ్ణి వధించింది. ఇలా 9 దాటి 10 వ వధ కాబట్టీ, విజయాన్ని సాధించిన 10వ రోజు కాబట్టీ ‘విజయదశమి’అయింది.
అది 10 (దశ)కున్న గొప్పదనం. 10 అనేది పూర్ణసంఖ్య. తన వెనుక 9 ఇంటిని అండగా కలిగిన సంఖ్య. దిక్కుల సంఖ్య 10. తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలు నాలుగూ, ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయవ్యమనే విదిక్కులూ (దిక్కుకీ దిక్కుకీ మధ్య ఉండేవి) నాలుగు, పైనా కిందా అనే రెండూ కలిపి 10 మాత్రమే. శ్రీహరి ఈ లోకంలో ఉన్న అందరినీ రక్షించే నిమిత్తం ఎప్పటికి ఏది అవసరమో గమనించి అప్పటికి ఆ అవతారాన్నెత్తుతూ క్రమంగా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ అనే 9 అవతారాలని ముగించి ఇక తప్పదనే దృష్టితో ‘కల్కి’ అవతారాన్నెత్తి మొత్తం అందర్నీ సంహరించి యుగానికి ముగింపుని 10వ అవతారంతోనే చేశాడు. పది తర్వాత అంకెలన్నిటిలోనూ పది అంకె ప్రవస్తావన ఉంటూనే ఉంటుంది. ఏకాదశి (1+10=11), ద్వాదశ (2+10=12) త్రయోదశ (3+10=13) చతుర్దశ (4+10=14)… ఈ తీరుగా ఉంటూనే ఉంటుంది.
వ్యక్తి శరీరం కూడా బాల్యం, బుద్ధిబలం, శరీరబలం, కంటిబలం తగ్గడం, శుక్రశక్తి తగ్గడం, రక్తం తగ్గడం, మానసిక ధైర్యం తగ్గడం, శరీరం స్పర్శనీ, కళ్లు చూపునీ, చెవులు వినికిడినీ, ముక్కు వాసననీ, నాలుక రుచినీ కోల్పోతుంది ప్రతి పదేళ్లకీ. (1 నుండి 10 వరకూ బాల్యం, 11 నుండి 20 వరకూ బుద్ధిబలం.. ఇలా ఎదిగిన శరీరం తగ్గుదలవైపుకి వెళ్తూ 91 నుండి 100కి అన్ని అవయవాల దిగుదలకీ వ్యక్తి గురవుతూ ఉంటే ఇక్కడ కూడా ప్రాధాన్యం 10 కే కదా!
కేవలం ఓటమి అనేదే లేకపోవడం కాదు. పవిత్రత కూడా ఏమాత్రమూ చెడకపోవడం ఉంటుంది ఈ విజయదశమి రోజున. అమ్మవారు ఈ విజయదశమి రోజున జమ్మిచెట్టు నీడన ఉంటుంది. జమ్మిచెట్టునే సంస్కృతంలో శమీ అంటారు. లోకంలో ఎక్కడైనా అపవిత్రత అనేది ఉండే చోటుగా శ్మశానాన్ని చెప్తారెవరైనా. ఆశ్చర్యకరమైన అంశమేమంటే జమ్మిచెట్టు అమ్మవారు ఈ విజయదశమి రోజున ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటారో, అది అపరాజితాస్థలం. ఆ జమ్మిచెట్టు మాత్రమే శ్మశాన స్థలాన్ని కూడా పవిత్రీకరించగల శక్తి కలది.
ఈ కారణంగానే అమ్మవారు జమ్మిచెట్టు కింద కూర్చుని దర్శనమిస్తూ అ – పరాజిత – నని తన గురించి మనకి అర్థమయ్యేలా అనుగ్రహిస్తారు అందర్నీ వీరు, వారు అనే భేదం లేకుండా! ఇంత లోతు అర్థం కల 10వ తిథి అయిన దశమి నాడు అమ్మ రాక్షసులపై విజయాన్ని సాధించింది. అందుకే అపరాజిత ఇంతటి విజయాన్ని సాధించిందీ, 9 దాటి 10వ నాడు విజయ రహస్యాన్ని మనకందించిందీ అమ్మ కాబట్టే ఆమెకి ఈ విజయదశమి నాటి పేరు ఆమె చేసినకృత్యాలని బట్టి – అ – పరాజిత – అని. పరాజయం (ఒటమి) అనేదే ఎరుగని తల్లి – లేని తల్లి. (న+ పరాజిత= అపరాజిత)
తన్నో దుర్గిః ప్రచోదయాత్!











