దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న సాగు రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేస్తామని బీరాలు పలికిన నరేంద్ర మోడీ సర్కారు… అన్నదాతల ఆగ్రహంతో దెబ్బకు దిగిరాక తప్పలేదు. రైతుకు దక్కాల్సిన కనీస మద్దతు ధర అంశాన్ని అసలు పట్టించుకోకుండానే వ్యవహరించిన మోడీ సర్కారు… వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, నిల్వ చేసుకునే వెసులుబాటు తదితర విషయాల్లో కీలక సంస్కరణలు చేస్తూ కొత్త సాగు చట్టాలను ప్రతిపాదించింది. అన్నదాతల అనుమతి లేకుండానే వాటికి ఆమోదముద్ర కూడా వేయించుకుంది. అయితే తానేం చేసినా ఎదురు చెప్పేవారెవరూ లేరన్న కోణంలో ముందుకు సాగిన మోడీ సర్కారుకు అన్నదాతలు తమ బలమేంటో, తమ సంఘటిత శక్తి ఏమిటో ప్రత్యక్షంగా చూపారు. ఫలితంగా రైతు సంఘాల నేతలతో దఫదఫాలుగా చర్చలు జరుపుతున్న కేంద్రం… తాను ప్రతిపాదించిన కొత్త చట్టాలకు ఎట్టకేలకు సవరణలు చేసేందుకు అంగీకరించింది. అయితే మోడీ సర్కారు దిగివచ్చినట్టుగా అన్నదాతలు సంతృప్తి చెంది ఆందోళనలు విరమిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
కొత్త చట్టాలు
సాగు రంగానికి నూతనోత్తేజాన్ని నింపుతామంటూ ప్రకటించిన మోడీ సర్కారు… మూడు ప్రధాన అంశాలకు సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చింది. వీటిలో కీలకమైన కనీస మద్దతు ధర అంశమే లేకపోగా… దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రైతు తన పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చంటూ ఓ కొత్త చట్టం తెచ్చారు. దీనితో పాటు పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చంటూ మరో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇక మరో కీలక అంశమైన కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో ఏదేనీ వివాదం తలెత్తితే… దాని పరిష్కార బాధ్యతను సివిల్ కోర్టు నుంచి జాయింట్ కలెక్టర్‌కు బదలాయించింది. ఈ మూడు అంశాలు దేశ సాగు రంగాన్ని కుదేలు చేస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టారు. తొలుత పంజాబ్ రైతులే ఈ ఉద్యమాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా వారికి తోడయ్యారు. వీరికి ఎన్డీఏ పక్షాలు మినహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రజాసంఘాలు, ప్రజలు కూడా తమ మద్దతు రైతన్నలకేనంటూ తేల్చేశాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగిన భారత్ బంద్ విజయవంతమైంది.
Must Read ;- ఐఏఎస్, ఐపీఎస్ లు పొలంలో నాట్లు వేయడం చూశారా?
దిగొచ్చిన సర్కారు
రైతులకు అంతకంతకూ పెరుగుతున్న మద్దతు, ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతలు అంతకంతకూ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న తీరుతో మోడీ సర్కారు నిజంగానే భయపడిందని చెప్పక తప్పదు. పరిస్థితి చేయి దాటిపోతోందన్న భావన వచ్చిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ప్రధాని రంగంలోకి దింపారు. అయితే అమిత్ షాతో చర్చల సందర్భంగా కూడా రైతులు వెనక్కు తగ్గలేదు. కొత్తగా రంగంలోకి వచ్చిన మూడు చట్టాలను రద్దు చేయడం మినహా మరే ఇతర ప్రత్యామ్నాయాలకు తాము సిద్ధంగా లేమని అన్నదాతలు షాకు తేల్చి చెప్పారు. దీంతో అమిత్ షా రాయబారం కూడా విఫలం కావడంతో… చేసేది లేని పరిస్థితుల్లో తాను చేసిన కొత్త చట్టాలకు మోడీ సర్కారు ఐదు సవరణలను ప్రతిపాదించింది. కొత్త చట్టాల్లో ప్రస్తావించని కనీస మద్దతు ధరపై మరింత క్లారిటీ ఇచ్చేలా సవరణను ప్రతిపాదించిన మోడీ సర్కారు… మండీ వ్యవస్థను యధాతథంగా కొనసాగించడం, ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లలో ఏకరీతి పన్ను విధానం, పంట ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం, ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వం కూడా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేయడం, కాంట్రాక్టు ఫార్మింగ్ వివాదాల పరిష్కారం కోసం తిరిగి సివిల్ కోర్టులను ఆశ్రయించేలా వెసులుబాటు కల్పిస్తూ… మొత్తంగా తన కొత్త మూడు చట్టాలకు ఐదు సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. వీటిపై రైతు సంఘాల నేతలతో మాట్లాడిన కేంద్రం… వాటి అమలు కోసం లిఖితపూర్వక హామీ ఇచ్చింది.
రద్దు చేయాల్సిందే..
అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయడం మినహా మరే ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించేది లేదని తేల్చి చెప్పిన రైతులు… తమ ఉద్యమాన్ని కొనసాగించేందుకే సిద్ధపడ్డారు. దీంతో అన్నదాతల ఆగ్రహంతో దిగొచ్చినట్టుగా కనిపించిన మోడీ సర్కారు… చట్టాలకు సవరణల పేరిట లిఖితపూర్వక హామీలను ఇవ్వడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. ఎందుకంటే… ఎలాగోలా రైతుల ఆందోళనలను విరమింపజేస్తే ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారం అయినట్టేనని మోడీ సర్కారు భావిస్తోంది. సర్కారు మదిలోని ఈ భావనను పసిగట్టిన రైతులు… కొత్త చట్టాలను రద్దు చేస్తే తప్పించి ఆందోళనలను విరమించేది లేదని తేల్చేశారు. దీంతో అన్నదాతల దెబ్బకు మోడీ దిగొచ్చినా… తాము డిమాండ్ చేస్తున్నట్లుగా ఆ కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తుండటం మోడీకి నిజంగానే పుండు మీద కారం చల్లిన చందమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా… ఇకపై తాను ఏదనుకుంటే అది చేసేస్తూ సాగుతున్న మోడీ సర్కారుకు ఇకపై అంతా సవ్యంగా సాగుతుందన్న భావన క్రమంగా కనుమరుగు అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read ;- అన్నదాత ఘోష ఆగేది ఎప్పటికి?