రాజమౌళి కుటుంబం నుంచి సినిమా వస్తుందన్నా క్రేజే. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా, మరో కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’ ఈ శనివారం విడుదలైంది. దీనికి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు ముందే బోలెడంత ప్రచారం లభించింది. `మత్తు వదలరా` తర్వాత వీరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడంతో సినిమా మీద హైప్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. పెళ్లి మండపం నుంచి హీరోహీరోయిన్లు పారిపోతే ఎలా ఉంటుంది అనే లైన్ తీసుకుని ఈ కథనున తయారు చేశారు. హీరో పెళ్లితోనే ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. వీరు (శ్రీసింహా), మధు (మిషా నారంగ్) లకు పెళ్లి జరుగుతుంటుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలన్నది పెళ్లి కొడుకు ప్రయత్నం. అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అందుకే అతనికి ఇష్టముండదు. దానికి కారణం అతనికి మరో అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉండటమే.
కృష్ణవేణి (చిత్ర శుక్లా) అనే అమ్మాయిని అతను ప్రేమిస్తాడు. జరుగుతున్న పెళ్లిని క్యాన్సిల్ చేయించడం కోసం అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అతనికి ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడు పెద్దలు ఎందుకు ఈ పెళ్లిని కుదిర్చారు? ప్రేమించిన అమ్మాయి ఏమైంది? చివరికి అతను ఎవరిని పెళ్లి చేసుకుకోవాల్సి వచ్చింది? అన్నదే ఈ ‘తెల్లవారితో గురువారం’ సినిమా. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందింది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
రాజమౌళి కుటుంబ సభ్యులు చిన్న సినిమాలతోనే పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు ‘మత్తువదలరా’ కూడా అలాంటి ప్రయత్నమే. కామెడీ చిత్రాల్లో ఓ ప్రత్యేకమైన ఒరవడికి వీరు కృషి చేస్తున్నారు. అది ఈ సినిమాలో కూడా కనిపించింది. కాకపోతే కథనంలో సాగదీత ఉంది. కథ ముందుకు నడవాలి కాబట్టి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను ఉపయోగించుకున్నారు. ఒక్క రాత్రిలో జరిగే కథ ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. నేల విడిచి సాము చేసినట్టుగా అనిపిస్తుంది. కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు కూడా వికటిస్తాయి. మత్తువదలరా లాంటి వినోదాన్ని ఆశించి ఈ సినిమాకి వెళితే మాత్రం నిరాశ తప్పదు.
హీరోహీరోయిన్ల పాత్ర వరకూ నటన బాగుంది. వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే సత్య, వైవా హర్షల పాత్రలతో నవ్వించడానికి ప్రయత్నం చేశారు. మనకు నవ్వు వచ్చిందా లేదా అన్నది తర్వాతి విషయం. ప్రథమార్థం వరకూ కథను వేగంగానే నడిపినా సెకండాఫ్ లో ఇంకా మందగించింది. మధుకు పెళ్లి ఎందుకు ఇష్టంలేదో దర్శకుడు కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు. అదే మరో హీరోయిన్ విషయంలోనూ కనిపిస్తుంది. ఎలాంటి కథనైనా ఆసక్తిగా మలచగలగాలి. అది లోపించడం వల్లే సినిమా గాడి తప్పింది.
నటీనటులు: శ్రీసింహా, చిత్ర శుక్లా, మిషా నారంగ్, సత్య, వైవా హర్ష, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: కాలభైరవ, రచన: నాగేంద్ర. పి, కెమెరా: సురేష్. ఆర్, ఎడిటింగ్: సత్య గిడులూరి
నిర్మాణం: వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని.
దర్శకత్వం: మణికాంత్ జెల్లీ
విడుదల తేదీ : 27-03-2021
ఒక్క మాటలో: కామెడీ విడిచి చేసిన సాము
రేటింగ్: 2/5
– హేమసుందర్ పామర్తి