తెలుగు తెరపై సౌందర్య తరువాత ఆ స్థాయి స్పీడ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న కథానాయిక రకుల్. చిన్నసినిమాలతో .. చిన్న హీరోలతో తన కెరియర్ ను మొదలెట్టిన ఆమె, ఆ తరువాత స్టార్ స్టేటస్ ను అందుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. తెలుగులో ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. అల్లు అర్జున్ .. రామ్ వంటి యువ కథానాయకుల జోడీగా ఆమె దూసుకుపోయింది. అయితే రకుల్ కి అవకాశాలు వచ్చినంత వేగంగా విజయాలు రాలేదు. స్టార్ హీరోల సరసన ఆమె చేసిన సినిమాల్లో భారీ విజయాలను అందుకున్నవి తక్కువే. బడ్జెట్ పరంగా మాత్రమే అవి భారీ చిత్రాలుగా నిలిచిపోయాయి అంతే.
తెలుగులో నాగార్జున .. రవితేజ వంటి సీనియర్ హీరోలతోను కలిసి నటించినా, ఆశించినస్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. దాంతో తమిళంలో కార్తీ .. సూర్య వంటి సీనియర్ హీరోల సరసన కూడా సందడి చేసింది. అక్కడ కూడా ఆమెకి నిరాశే ఎదురైంది. అయినా తమిళ సినిమాలు చేస్తూనే, ఎలాగో అలా తెలుగులో కెరియర్ ను నెట్టుకొద్దామని ఆమె అనుకుంటే, అప్పటికే తెలుగులో పూజా హెగ్డే .. కీర్తి సురేశ్ .. రష్మిక మందన జోరందుకున్నారు. ఆ తరువాత వరుసలో మెహ్రీన్ .. నభా నటేశ్ .. నిధి అగర్వాల్ చేరిపోయారు. దాంతో తెలుగుకి సంబంధించినంత వరకూ రకుల్ కెరియర్ అయోమయంలో పడిపోయింది.
వరుస పరాజయాలు .. కొత్త కథానాయికల నుంచి గట్టిపోటీ ఎదురుకావడం వలన, రకుల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె చేతిలో సినిమాలు లేవనే గుసగుసలు వినిపించాయి. కానీ రకుల్ మొదటినుంచి చాలా చురుకైనదే. వెలుగులోనే వెతుక్కోవాలనే విషయం ఆమెకి బాగా తెలుసు. అందువల్లనే తెలుగులో అవకాశాలు తగ్గుతూ వున్న సమయంలోనే ఆమె తమిళ అవకాశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. అదే సమయంలో హిందీ సినిమాలపైనా ఫోకస్ చేసింది. ఫలితంగా తమిళ .. హిందీ భాషల్లో కలుపుకుని, ఇప్పుడు ఆమె చేతిలో అరడజను సినిమాలు వున్నాయి. వచ్చే ఏడాదిలో వీటిలో ఒక నాలుగు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో రెండు హిట్ కొట్టినా ఆమె కెరియర్ మరింత మెరుగుపడే అవకాశాలు వున్నాయి.
ఇప్పుడు ఆమెకి తెలుగులో అవకాశాలు లేవని చెప్పుకోవడం లేదు. తమిళ .. హిందీ సినిమాలతో రకుల్ బిజీ అనే అనుకుంటున్నారు .. ఆమెకి కావలసింది కూడా అదే. ఈ నేపథ్యంలోనే నితిన్ జోడీగా ‘చెక్’ సినిమా చేసే అవకాశం రకుల్ కి లభించింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఒక కథానాయికగా ప్రియా వారియర్ నటిస్తుండగా, మరో కథానాయికగా రకుల్ అలరించనుంది. ఇక పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనున్న ‘విరూపాక్ష‘ సినిమాలోనూ కథానాయికగా రకుల్ పేరే వినిపిస్తోంది. తెలుగులో రకుల్ కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందా? లేదా? అని జోస్యం చెప్పేవిగానే ఈ సినిమాలను భావించాలి.
Must Read ;- మల్దీవ్స్ లో బికినీ తో సందడి చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్