ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇప్పుడప్పుడే వీడేలా కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను తీసుకున్న సీబీఐ.. ఓ ప్రత్యేక బృందాన్ని కడపకు పంపింది. తొలి దఫా దర్యాప్తు మొదలెట్టగానే.. కరోనా కారణంగా సీబీఐ అధికారులు కడప వదిలి వెళ్లిపోయారు. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఇటీవలే రెండో దఫా దర్యాప్తును మొదలుపెట్టిన సీబీఐ బృందం.. కడప సెంట్రల్ జైలు ఆవరణలోని గెస్ట్ హౌస్ ను కేంద్రంగా చేసుకుని నాన్ స్టాప్ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు బుధవారం నాటికి వంద రోజులు పూర్తి అయ్యింది. అయినా కూడా ఇంకా ఈ కేసు మిస్టరీ వీడలేదు. అయితే సుదీర్ఘ దర్యాప్తు నేపథ్యంలో పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్, వివేకా పొలం పనులు పర్యవేక్షించే ఉమాశంకర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన సీబీఐ.. వివేకా ఇంటి వాచ్ మన్ రంగయ్య వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ కీలక ఘటనలు మినహా సీబీఐ ఈ వంద రోజుల దర్యాప్తులో పెద్దగా సాధించిందేమీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సీబీఐ కస్టడీకి ఉమాశంకర్
ఇదిలా ఉంటే.. ఈ కేసులో అరెస్ట్ చేసిన సునీల్ కుమార్ యాదవ్ ను ఏకంగా పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా వివరాలు రాబట్టే యత్నం చేశారు. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు తాజాగా ఆయనను కూడా తమ కస్టడీకి తీసుకున్నారు. సీబీఐ వేసిన కస్టడీ పిటిషన్ కు కడప కోర్టు సమ్మతించడంతో గురువారం ఉమాశంకర్ ను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. జగన్ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసిన వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డిని కూడా తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఆ బెయిల్ ను రద్దు చేసి ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దీనిపై కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఎప్పటికి మిస్టరీ వీడేనో..?
వివేకా హత్య కేసు దర్యాప్తు తీరు చూస్తుంటే.. అసలు ఈ కేసు మిస్టరీ వీడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ ను అరెస్ట్ చేసిన సమయంలోనే హత్యకు వాడిన ఆయుధాలు దొరికాయని చెప్పిన సీబీఐ అధికారులు.. ఇప్పటికీ నిందితులెవరన్న విషయాన్ని తేల్చకపోవడం గమనార్హం. అంతేకాకుండా రెండు రోజుల క్రితం వివేకా ఇంటి వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించిన సీబీఐ అధికారులు.. కేసు మిస్టరీ వీడిపోయినట్టుగానే వ్యవహరించారు. అయితే తాజాగా మళ్లీ ఉమాశంకర్ కస్టడీ, ఎర్ర గంగిరెడ్డిల కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించడం చూస్తుంటే.. మరిన్ని రోజుల పాటు సీబీఐ విచారణ కొనసాగడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే వంద మందికి పైగా వ్యక్తులను విచారించిన సీబీఐ.. వారి నుంచి ఏఏ వివరాలను రాబట్టిందన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- జగన్‌కు రిలీఫ్.. సాక్షిని బుక్ చేసిందే











