ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటిదాకా వైఎస్ ఫ్యామిలీ వ్యక్తులను టచ్ చేయని సీబీఐ అధికారులు.. పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత మాత్రం తమదైన శైలిలో దూకుడుతో సాగుతున్నారు. వైఎస్ ఫ్యామిలీకి చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాటి విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని పిలిచారు. సీబీఐ అధికారుల పిలుపుతో వైఎస్ భాస్కరరెడ్డి మంగళవారం ఉదయం కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ కు ఒంటరిగానే వచ్చారు. వచ్చీ రాగానే..కారు దిగి నేరుగా సీబీఐ అధికారుల వద్దకు వెళ్లిపోయారు. కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి సీబీఐ విచారణకు వచ్చిన వైనం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
అందరూ అవినాశ్ మనుషులే!
సునీల్ కుమార్ ను అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ అధికారులు అతడి నుంచి కీలక సమాచారాన్నే రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇదివరకే అవినాశ్ వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను విచారించిన సంగతి తెలిసిందే. ఆ మరునాడే.. అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఉదయ్ కుమార్ రెడ్డి, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి నెలకొల్పిన ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నఅతడి తండ్రిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఇక సోమవారం నాటి విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి పెదనాన్నస్ ప్రకాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. వైఎస్ ప్రకాశ్ రెడ్డిని విచారణకు పిలిచినంతనే.. ఈ కేసు విచారణకు ఎంపీ హోదాలో ఉన్న అవినాశ్ రెడ్డి కూడా హాజరు కాక తప్పదన్న వాదనలు వినిపించాయి. ఆ వాదనలు నిజమేనన్నట్లుగా మంగళవారం నాడు సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని విచారణకు పిలవడం గమనార్హం. అంటే.. రేపో, ఎల్లుండో వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందేనన్న వాదనలు అంతకంతకూ బలపడుతున్నాయి.
అవినాశ్ చుట్టే ఎందుకు..?
వివేకా మర్డర్ మిస్టరీలో ఆది నుంచీ వైఎస్ అవినాశ్ రెడ్డి చుట్టూనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే.. వివేకా హత్య జరిగిన తర్వాత తొలుత అక్కడికి చేరుకున్న అవినాశ్ రెడ్డి.. వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారట. ఈ విషయాన్ని జగన్ ఫ్యామిలీ నేతృత్వంలోని సాక్షి టీవీ కూడా అలాగే ప్రసారం చేసింది. ఆ తర్వాతే వివేకా హత్యకు గురయ్యారన్న విషయం బయటపడింది. దీంతో అసలు వివేకా గుండెపోటుతో చనిపోయారని మీకు సమాచారం ఎవరిచ్చారంటూ ఇటీవలే సాక్షి టీవీ ప్రతినిధిని కూడా సీబీఐ విచారించింది. ఇక వివేకా ఫ్యామిలీతో అవినాశ్ రెడ్డి ఫ్యామిలీకి ఆర్థిక పరమైన విభేదాలున్నాయట. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ రెండు కుటుంబాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయన్నది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. ఈ కోణంలో సునీల్ నుంచి కొంత కీలక సమాచారాన్ని సేకరించిన మీదటే సీబీఐ అధికారులు వరుసపెట్టి వైఎస్ అవినాశ్ రెడ్డి అనుచరులు, బంధువులు, ఏకంగా ఆయన ఫ్యామిలీ కేంద్రంగానే విచారణ సాగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- వివేకా కేసులో అన్ని వేళ్లూ జగన్ వైపే!











