( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అనగనగా ఓ రెడ్డి గారు… ఆ రాజకీయ పార్టీకి ఉత్తరాంధ్రకు ఓ పెద్ద దిక్కు.. అదే ఊరిలో మరో రెడ్డి గారు.. ఆయనో పెద్ద విద్యావేత్త. ఆ ఇద్దరూ ఒకటయ్యారు. ఉన్న హోదాను, చేయాల్సిన వృత్తిని మర్చిపోయారు. పగలు , రాత్రి పార్టీ కోసం పని చేయడంలో భాగంగా విశ్వవిద్యాలయంలో బాధ్యతలను సైతం పక్కన పడేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే… జెండా మోసే కార్యకర్త కన్నా ఎక్కువే కష్ట పడ్డారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఆయన కష్టం గుర్తించారు. ఫలితంగా ఆయన ఆ వర్సిటీకే నాయకుడయ్యారు. సాధారణంగా కోటి మందిలో ఒక్కరికి గాని ఇటువంటి అదృష్టం దక్కదు కదా! కరోనా వైరస్ వ్యాప్తికి ముందు నిర్వహించ తలపెట్టిన స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఆ విద్యాధికుడు చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. విశ్వవిద్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. రాత్రి .. పగలు రాజకీయ నాయకులతో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక కోసం తమ స్టూడెంట్లనే ఎన్నుకున్నారు. వారితో సమగ్ర సర్వే కూడా చేయించారు. పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయో ఓ జాబితాను రూపొందించారు. ఇదంతా ఆయన సొంత నిర్ణయం కాకపోయినా… మరో రెడ్డి గారు పురమాయించడంతో వర్సిటీలోని విధులన్నీ పక్కన పెట్టేశారు. ఆయనిచ్చిన జాబితాలోనే అత్యధికులకు టికెట్ దొరకడం గమనించదగ్గ విషయం.
Also Read ;- జగన్ అక్రమాస్తుల కేసులో కూడా అడిగిందే జరిగింది..
అప్పటి నుంచి పార్టీ నాయకుడిగా కూడా…
అప్పటి నుంచి పార్టీలో ఆయన పాత్రకు తిరుగులేకుండా పోయింది. రాజకీయ సమావేశాలు సైతం నిర్భయంగా వర్సిటీలో నిర్వహించడంలో ఆయనకు మించిన వారు మరొకరు లేరనే చెప్పాలి. విశ్వవిద్యాలయం నుంచి వచ్చే ఏ పత్రికా ప్రకటన కూడా సీఎం ప్రస్తావన లేకుండా రాదు. వర్సిటీలో కొత్తగా వాటర్ టాప్ అమర్చినా … అది ముఖ్యమంత్రి సహకారంతోనే అనేంతగా డప్పు కొట్టుకునే వారు. దేశంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అన్న దాని కన్నా పార్టీ కార్యకర్తలాగే ఆయన ఎక్కువ కాలం గడిపారు. ఏ సమావేశం జరిగినా ముఖ్యమంత్రి భజన లేకుండా సాగేది కాదు. మొత్తానికి ఆయన లక్ష్యం నెరవేరింది.. అనుకున్న హోదా దక్కింది.
రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు
ఆయన రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు కోట్ల విలువ చేసే వర్సిటీ భూములను పక్కదారి పట్టించారని ఆరోపణ ఉంది. అదే విధంగా కోట్ల రూపాయలు స్వాహా చేసి 12000 మందిని రీవాల్యుయేషన్ పేరిట పాస్ చేశారని ఆరోపణ కూడా ఉంది. ఆరు పాయింట్లు ఆధారంగా ఆయనపై విచారణ చేయాలని కోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఆ హోదాలో కొనసాగడం తప్పనిసరి కావడంతో వర్సిటీ నిబంధనల అన్నింటినీ పక్కనపెట్టి పార్టీ నాయకుడిలా పనిచేస్తూ వస్తున్నారు. అయితే, ఆయన్ను ఆ హోదాలో కూర్చోబెట్టడం ముఖ్యమంత్రికి సైతం ఇష్టం లేదని, మరో రెడ్డి గారు సిఫార్సు మేరకు ఇవ్వక తప్పలేదని ప్రచారంలో ఉంది.
Must Read ;- సంక్షేమం, సంక్షోభం, కేసులే ప్రధాన ఎజెండా అంశాలు











