నష్టాల కారణంతో విశాఖ ఉక్కు కర్మాగారంలో నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని కంద్రం ప్రకటిస్తుండగా గడిచిన నాలుగు నెలల్లో ఈ కంపెనీ రూ.740 కోట్ల లాభం ఆర్జించడం గమనార్హం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం ఖాయమంటూ పార్లమెంటులోనూ కేంద్ర మంత్రులు పదేపదే అదే అంశాన్ని చెబుతున్నారు. అందులో భాగంగా నష్టాలు వస్తున్న కారణాన్ని తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ నష్టం ఉత్పాదక నష్టమా లేక అదనపు చెల్లింపుల వలన వస్తున్న నష్టమా అనే విషయంపై కేంద్రం కూడా నోరు మెదపడం లేదు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో కార్మికులు, పార్టీలు ఆందోళన చేస్తున్నారు. ఒక్క బీజేపీ మాత్రం ఇందుకు దూరంగా ఉంది.
గడిచిన నాలుగు నెలల్లో ..
ఈ నేపథ్యంలో మరో విషయం బయటకు వచ్చింది. విశాఖ ఉక్కు సంస్థ గడిచిన నాలుగు నెలల్లో రూ.740 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ విషయం సమాచార హక్కు ద్వారా వెల్లడైంది. డిసెంబరు నుంచి మార్చి నెల కాలానికి గాను లాభాలు వచ్చాయి. ఈ ప్రకారం చూస్తే.. విశాఖ ఉక్కు సంస్థకు వస్తున్న నష్టాలకు కారణం ఏంటనేది స్పష్టం అవుతుందని కార్మికులు చెబుతున్నారు. సొంత ఇనుప ఖనిజ గనులు లేకపోవడంతో ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. టన్నుకు దాదాపు రూ.5వేలవరకు ఇందుకు వెచ్చించాల్సి వస్తోంది. దీంతోపాటుగా అత్యదిక వడ్డీ రేట్లు రుణాలపై వసూలు చేస్తుండడం కూడా కారణంగా మారింది. ఇదే విషయాన్ని కార్మిక సంఘాలు చెబుతున్నా..కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
పనితోనే సమాధానం..
దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో పనిచేసే కార్మికులు ఉన్న సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం. కేవలం ఉద్యోగం కోసమే కాదు.. విశాఖ ఉక్కు సంస్థను తమ సొంతదిగా భావించి కార్మికులు పని చేస్తారు. కంపెనీకి నష్టం కలిగించే చర్యను చేయకపోవడమే కాదు.. అలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా విశాఖ ఉక్కు కార్మికులు సహించబోరు. కంపెనీని కాపాడుకునే అంకితభావం కార్మికుల్లో కనిపిస్తోంది. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా..దేశంలోనే అత్యున్నత కంపెనీల్లో ఒకటిగా విశాఖ ఉక్కు కర్మాగారం నిలిచింది. ఓవైపు ప్రైవేటీకరణకు ఆందోళన కొనసాగుతుండగానే ఉత్పత్తి విషయంలోనూ కార్మికులు రికార్డు సృష్టించారు.
గత ఏడాదిలో 13 శాతం వృద్ధి
2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు18 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాటు ప్లాంట్ చరిత్రలో రికార్డు స్థాయిలో 20 వేల 400 టన్నుల ఉత్పత్తిని సాధించింది. విశాఖ ఉక్కు కర్మాగార చరిత్రలో ఇది రెండో రికార్డు ఉత్పత్తి. మరోవైపు విశాఖ ఉక్కు యాజమాన్య బోర్డు నిర్వహించిన సమావేశంలో గత ఏడాది కాలంలో విశాఖ ఉక్కు సంస్థ 13 శాతం వృద్ధి సాధించిందని, ఈ 4 నెలల్లో 740 కోట్ల నికర లాభం నమోదైందని తెలిపారు. కేవలం ఒక్క మార్చినెలలోనే 7లక్షల 11వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి సాధించడంతోపాటు రూ.3వేల కోట్ల టర్నోవర్ సాధించినట్టు తేలింది. ఈ సంస్థ సీఎండీ పీకే రథ్ సమక్షంలో ఈ చర్చ జరిగింది. నికర లాభం విషయానికి వస్తే 2020 డిసెంబరు నెలకు గాను రూ.212 కోట్లు, 2021 జనవరిలో రూ.134 కోట్లు నికర లాభం సాధించగా, ఫిబ్రవరినెలకు రూ.165 కోట్లు మార్చి నెల 31 నాటికి రూ. 350 కోట్లు నికర లాభం వచ్చినట్టు తేలింది. తుది బ్యాలెన్స్ షీట్ పై కచ్చితమైన క్లారిటీ వచ్చేందుకు ఇంకా సమయం పట్టనుంది. అయితే మూడునెలల్లో ఉత్పత్తి లాభాలు రావడం ఆషామాషీ విషయం కాదని, ఇతర పన్నులు ఉండడం, సొంత ఖనిజ గనులు లేకపోవడంతో అనవసరమైన చెల్లింపులు ఉంటున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ తరహాలో లాభాలు వస్తున్న కంపెనీపై నష్టాలను బలవంతంగా రుద్ది ప్రైవేటుపరం చేయడం ఏంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.