ఒకరి కోసం ఇంకొకరు త్యాగం చేసే పరిస్థితి సినిమా రంగంలో కొంతవరకే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మంచి కలెక్షన్లు రాబట్టాలంటే కనీసం రెండు వారాలైనా థియేటర్లో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ షోలు వేసుకునే వెసులు బాటు ఏపీలో అసలే లేదు. అందువల్ల కనీసం రెండు వారాలైనా ఆడితేనే ఓ రూ. 150 కోట్లు వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్య రెండు వారాల గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గని’ చిత్రం విడుదలను వాయిదా వేయక తప్పలేదు.
నిజానికి ఈ సినిమా డిసెంబరు 2న విడుదల కావలసి ఉంది. అఖండ రావడంతో పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. డిసెంబరు 17న పాన్ ఇండియా సినిమాగా ‘పుష్ప’ విడుదలవుతోంది. దాంతో 24న గని విడుదల చేయాలని అనుకున్నారు. గని సినిమా కూడా అల్లు అరవింద్ కుటుంబానికే చెందినది. మరీ వారం గ్యాప్ సరిపోదు పక్కకు తప్పుకోవాల్సిందేనని ఒత్డిడి రావడంతో పక్కకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక జనవరిలో నాని సినిమా శ్యామ్ సింగరాయ్ ఉంది. దాని తర్వాత 7న ట్రిపుల్ ఆర్ విడుదలవుతోంది.
భారీ హైప్ తో దాదాపు 5 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 11 వేల స్క్రీన్ల మీద ఆర్ఆర్ఆర్ విడుదలవుతోంది. వెంటనే 5 రోజుల వ్యవధితోనే పవర్ స్టార్ భీమ్లా నాయక్ విడుదలవుతోంది. మళ్లీ మెగా కుటుంబమే త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతి బరి నుంచి పక్కకు వెళ్లడానికి పవన్ కళ్యాణ్ ససేమిరా అంటున్నట్టు సమాచారం. నచ్చచెప్పడానికి పెద్ద తలకాయలు రంగ ప్రవేశం చేసినా పవన్ మాత్రం భీష్మించుకు కూర్చున్నారట. ఎలాగైనా భీమ్లానాయక్ ను బరిలో లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రిపుల్ ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య, రాధేశ్యామ్ నిర్మాత వంశీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ ను కలిసి మాట్లాడారు. తన వంతు ప్రయత్నం చేస్తానని త్రివిక్రమ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఒకవేళ భీమ్లానాయక్ వాయిదా పడినా రాధేశ్యామ్ కూడా పక్కకు వెళితేనే ట్రిపుల్ ఆర్ కు ప్రయోజనం ఉంటుంది. ఈ మధ్యలో చడీచప్పుడు లేకుండా నాగార్జున ‘బంగార్రాజు’గా బరిలోకి దిగుతున్నాడు.భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చిత్రాల్లో ఏ ఒక్కటి వెనక్కి తగ్గినా కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. భీమ్లా నాయక్ ససేమిరా అంటే రాధ్యేశ్యామ్ పక్కకు తప్పుకోవాల్సిందే. రాజమౌళి కోసం ప్రభాస్ కూడా త్యాగం చేయక తప్పదు. మళ్లీ ఫిబ్రవరిలో మెగాస్టార్ ‘ఆచార్య’ ఉంది. ఒకవేళ భీమ్లానాయక్ విడుదల వాయిదా పడితే ఫిబ్రవరిలో మరికొన్ని సినిమాలతో క్లాష్ ఏర్పడుతుంది. ఏదేమైనా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి తమ చిత్రాల విడుదలకు మార్గం సుగమం చేసుకోవడం మంచిది.
Must Read ;- ట్రిపుల్ ఆర్ నిర్మాతతో మెగాస్టార్ సినిమా











