వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కే రోజారెడ్డి ప్రస్తుతం వైసీపీలో చర్చకు కారణం అయ్యారు. తమకు జిల్లాలో, నియోజకవర్గంలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపిస్తూ.. శాసనసభ హక్కుల కమిటీ ఎదుట భావోద్వేగానికి గురయ్యారనే చర్చే ఇందుకు కారణం. ఎంతో శ్రమకోర్చి గెలిచినా. తన పార్టీ అధికారంలో ఉన్నా.. తనకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆమె ఆరోపణ. ఈ సమస్య రోజాకు ఇటీవలి కాలంలోనే మొదలైంది కాదని చెప్పవచ్చు. దాదాపు దశాబ్దకాలం నుంచి రోజా రాజకీయంగా ఆధిపత్య పోరును తట్టుకుని నిలబడ్డారు. అయితే అధికారంలో ఉన్నందున..కొన్ని సమస్యలు తీరతాయని ఆశించినా.. పరిస్థితి మారకపోవడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
నేతలపై డామినేషన్ చేయకున్నా..
రోజా మీడియా ముందుకు వస్తే చాలు..ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వ్యవహారంలోనూ కన్నీళ్లు పెట్టుకుంటూనే..శాపనార్దాలూ పెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. మంత్రి పదవి వస్తుందని ఆశించినా సామాజిక, సీనియార్టీ కారణాల నేపథ్యంలో ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి వచ్చింది. అయినా తాను అడ్జెస్ట్ అయ్యానని, అయినా తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా జోక్యం చేసుకోవడం, తన ప్రత్యర్థి వర్గానికి, తాను ఘర్షణకు దిగిన వర్గానికి పదవి కట్టబెట్టడంతో ఈ రచ్చ తారస్థాయికి చేరింది. కాగా జిల్లాలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై రాజకీయ వర్గాల్లో పలు అంశాలు చర్చకు వస్తున్నాయి.
- నగరిలో రోజాకు ప్రత్యర్థి వర్గం వేరే పార్టీ కాదని చెప్పవచ్చు. వైసీపీకే చెందిన K J కుమార్ దంపతులనే రోజా ప్రత్యర్థి వర్గంగా పార్టీ నేతలు చెబుతారు. గతంలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. వేదికలపై తిట్టుకునే పరిస్థితి కూడా తలెత్తింది. పార్టీ సీనియర్‌గా తీసుకోవడంతో తెరపైకి ఈ రెండు వర్గాల పోరు తగ్గిందనిపించినా.. అంతర్గతంగా కత్తులు దూసుకునే పరిస్థితి కనిపించింది. కొన్నాళ్ల క్రితం ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా కేజే కుమార్ భార్య శాంతిని ఎంపిక చేసింది అధిష్టానం. జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి, నారాయణస్వామిలు కేజే కుమార్‌కు సపోర్టు చేస్తున్నారని రోజా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
- ఇక నగరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా డిప్యూటీ సీఎం నారాయణ పర్యటించడంపై రోజా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తాను నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నా కూడా తనను పట్టించుకోకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని రోజా గతంలో ఆరోపించారు. ఆ పర్యటనలో దళితులకు కల్యాణ మండప స్థల ఎంపిక కోసం.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తూరులో ఆకస్మికంగా పర్యటించిన విషయమై ఈ వివాదం చోటు చేసుకుంది.
Must Read ;- వైసీపీలో కలవరం.. వెల్లంపల్లిపై గరం గరం
- గతంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై వచ్చిన ఆరోపణల వెనుక రోజా వర్గం ఆరోపణ ఉందని కూడా మరో ప్రచారం జరిగింది. గతంలో ఆయన ఎస్టేట్‌కు రోడ్డు నిర్మించిన వ్యవహారం వివాదానికి కారణమైంది. మున్సిపల్ అథారిటీనే రోడ్డు నిర్మించిందని, కొందరు ఉద్యోగులు ఆయనకు ఈ రోడ్డును కానుకగా ఇచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నారాయణ స్వామి వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
- సీఎం జగన్ తిరుమల పర్యటనలో జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు.. జగన్‌ని కలిసి సమస్యలు వివరించాలనే ప్రయత్నాన్ని.. అన్ని మార్గాల ద్వారా జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ యువ ఎమ్మెల్యేలు, సీఎంని కలవాలనుకున్న ఎమ్మెల్యేలకు రోజాతో సత్సంబంధాలు ఉండడం కూడా సదరు సీనియర్లకు రోజా టార్గెట్‌గా మారారు.
- నగరి నియోజకవర్గంలో SEZ కోసం రైతులకు తాను ఎన్నో హామీలిచ్చి ఒప్పించి సేకరించిన భూమిలో..తనకు తెలియకుండానే ఓ సీనియర్ మంత్రి జోక్యంతో ఆ భూమిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపైనా.. రోజా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డైరెక్ట్‌గా జగన్‌ను కలిసే స్థాయి ఉన్న సీనియర్ నాయకుడే కారణమని రోజా వర్గం ఆరోపిస్తోంది.
- యంత్రాంగంతో కూడా తనతో ఒకమాట.. సదరు ముఖ్య నాయకుడితో ఒక మాట చెప్పిస్తున్నారని, తాను ఏ ప్రతిపాదన పెట్టినా.. స్పందించడం లేదని రోజా ఆరోపిస్తున్నారు.
- ఈ వివాదాల నేపథ్యంలో గతంలో రోజా సంధి కోసం కూడా యత్నించినట్టు వార్తాలు వచ్చాయి. పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ అయిన మిధున్‌రెడ్డికి రోజా రాఖీ కట్టి ట్విస్ట్ ఇచ్చారు. అంతా ఓకే అనుకున్నా..తరువాత జరిగిన పరిణామాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని చెప్పవచ్చు.
- చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సైతం రోజాతో జత కలిశారనే విషయంలో మంత్రి పెద్దిరెడ్డి సైతం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా.. అరణి శ్రీనివాసులు ప్రత్యర్థి వర్గమైన బుల్లెట్ సురేశ్‌ను మొదలియార్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా చేయడాన్ని కూడా అక్కడి నేతలు ప్రస్తావిస్తున్నారు.
- మొత్తం మీద బయటకు జరుగుతున్న ప్రచారం ప్రకారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు వ్యతిరేకంగా గతంలో రోజా ఒక్కరే వ్యవహరించగా..ఇప్పుడు రోజాకు మరికొందరు జత కావడంతో.. ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఇక ఇవి బయటకు తెలిసిన సమాచారమే. అంతర్గతంలో మరికొన్ని అంశాలు కూడా రోజా కన్నీటికి కారణం అయి ఉండవచ్చనే చర్చ నడుస్తోంది.
Also Read ;- తీవ్ర అసంతృప్తిలో వైసీపీ కార్యకర్తలు : ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్