తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.అదే సమయంలో ఆరోపణలు ప్రత్యారోపణలూ చేసుకుంటున్నాయి. నకిలీ ఓట్ల ప్రస్తావన కూడ ప్రముఖంగా తెరపైకి వస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిబంధనల పేరుతో అధికార యంత్రాగం తమనే టార్గెట్ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రచారాల్లో భాగంగా కొన్ని ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీటింగ్‌పై రాళ్లేసిన ఘటన కూడా రాష్ట్రంలో సంచలనం రేపింది.
ముఖ్య నేతల ప్రచారం..
ఈ ఎన్నికల్లో తాము 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని అధికార వైసీపీ చెబుతోంది. ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ప్రచారం చేస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ఆ పార్టీ ముఖ్యనేతలు, తెలంగాణ నుంచి కొందరు నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏ అవకాశం దొరికినా వదలకుండా పట్టునిలుపుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే బీజేపీ, టీడీపీలు కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశాయి.
నకిలీ ఓటరు కార్డులు
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నకిలీ ఓటరు కార్డులు తయారు చేస్తోందని బీజేపీ, టీడీపీలు సంచలన ఆరోపణ చేశాయి. 2 లక్షల నకిలీ ఓటర్ల కోసం ఆధార కార్డులను కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడే మరో విశేషం ఏంటంటే.. ఈ విషయంలో బీజేపీ, టీడీపీపైనా ఆరోపణలు గుప్పిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నకిలీ ఓటరు కార్డులు క్రియేట్ చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నకూడా తలెత్తుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ ఓటు వేసేందుకు స్థానిక ఓటరు రాకపోయినా.. అతని స్థానంలో మరో వ్యక్తిని పంపి ఓటు వేయించుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు, ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని ప్రకటించారు. అదే సమయంలో తాము నకిలీ ఓటరు కార్డులను పట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, ఓటింగ్ శాతం తక్కువ నమోదయ్యే ప్రాంతాల్లోనే ఈ నకిలీ దందా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఆరోపించారు.

నకిలీ ఓటర్లను పట్టుకున్నా..
ఇదే అంశంపై టీడీపీ కూడా స్పందించింది. నకిలీ ఓటరు కార్డులు భారీగా తయారుచేస్తున్నారని, ఎలాగైన గెలిచేందుకు కుట్ర చేస్తున్నారని, ఇందుకు వలంటీర్ల వ్యవస్థను వాడుకునేందుకు కుయుక్తులు పన్నారని ఆ పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాసులు, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిలు ఆరోపించారు. గడిచిన నగరపాలక, పురపాలిక ఎన్నికల్లో నకిలీ ఓటర్లను పట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వీరు వ్యాఖ్యానించారు. నకిలీ ఓటర్ల విషయమై టీడీపీ ఎంపీలు మంగళవారం సీఈసీకి వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఓటరు కార్డుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. విజయనగరంతో పాటు పలు జిల్లాల్లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిలీ ఓటరు కార్డులను పట్టుకున్నా..తరువాత యంతాంగం చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్నికలు నిర్వహించి ఏం ప్రయోజనం అనే చర్చ కూడా నడుస్తోంది.
5లక్షల మెజార్టీ అందుకేనా..
ఇదే అంశంపై టీడీపీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారు కంటే ముందుగానే తాము 5లక్షల మెజార్టీతో గెలుస్తామని వైసీపీ చెప్పడం వెనుక ఇలాంటి కారణాలే ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పరిస్థితి మారిందని, వైసీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. కాగా గత ఎన్నికలను పరిశీలిస్తే.. 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ నుంచి బల్లి దుర్గా ప్రసాద్ గెలుపొందారు. 2014లోనూ ఇక్కడ వైసీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో మొత్తం 16,50,453 ఓట్లకు13 లక్షల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీపీకి అభ్యర్థికి 7,22,877 ఓట్లు రాగా తెలుగుదేశం అభ్యర్థికి 4,94,501 ఓట్లు వచ్చాయి. 2,28,376 ఓట్ల మెజారిటీని వైసీపీ సాధించింది. ఇదే ఎన్నికల్లో నోటాకి 25,781 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థికి 24,039 ఓట్లు, జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీకి 20,971, బీజేపీకి 16,125 ఓట్లు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి పరిస్థితి మారిందని, అయినా 5లక్షల మెజార్టీ వస్తుందని చెప్పడానికి కారణాలేంటనే చర్చ కూడా టీడీపీలో జరుగుతోంది. మొత్తం మీద ప్రతిపక్షాల ఆరోపణల విషయంలో అధికార పార్టీ కంటే అధికార యంత్రాంగం స్పందించాల్సి ఉంటుంది. ఈ ఆరోపణపై ఇప్పటి వరకు ఎన్నికల సంఘం స్పందించలేదనే చర్చ నడుస్తోంది.
Must Read ;- అలిపిరి ఘటనకే భయపడలేదు, రాళ్ల దాడికి భయపడతానా? : చంద్రబాబు నాయుడు











