సుధా కొంగర ప్రస్తుతం సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక సుధా కొంగర తన తదుపరి చిత్రం స్టార్ హీరో అజిత్ తో చేయబోతున్నారని కోలీవుడ్ సమాచారం. ఇప్పటికే సుధా, అజిత్ కు స్టోరీ చెప్పారని, అజిత్ కు కూడా స్టోరీ బాగా నచ్చిందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త కోలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది. ఇదో యాక్షన్ చిత్రంగా తెరకెక్కబోతుందని సమాచారం.
ఈ సినిమాలో అజిత్ ఒక డిఫరెంట్ రోల్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. అయితే వెంటనే ఈ సినిమా పట్టాలెక్కదని, అజిత్ నటిస్తోన్న అన్ని సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్, అజిత్ – సుధా చిత్రాన్ని నిర్మిస్తారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని టాక్.
సుధాకు సహజత్వంతో కూడిన సినిమాలు తీస్తారని మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అజిత్ సరికొత్తగా ఎలివేట్ కానున్నాడట. ప్రస్తుతం అజిత్.. హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘వలిమై’ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధా దర్శకత్వంలో అజిత్ సినిమా అంటూ వచ్చిన వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.