(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రాజధాని రైతులతో మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. అమరావతి రాజధాని కోసం పోరాటం చేసిన దళిత రైతులకు సంకెళ్లు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. కానీ అమరావతిలోనే రాజధాని ఉండాలని జనసేనాని కదలి పోరాటంలోకి దిగితే రాజధాని అంగుళమైనా కదిలించే సత్తా, ఈ ప్రభుత్వానికి ఉందా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన అట్రాసిటీ చట్టాన్ని, వారికే సంకెళ్లు వేయడానికి ఉపయోగించారని, ఇలాంటి దుస్థితి, దేశంలో ఎక్కడా లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టాల్సిన ప్రతిపక్షాలు పడకేస్తే అధికార పార్టీలు మరింత చెలరేగిపోతాయనడానికి ఇదే ఉదాహరణ. ఏపీలో ఇదే జరుగుతోంది. కేసుల భయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు ముడుచుకుని కూర్చుంటే అధికార పార్టీ ప్రజలను మరింత పీడిస్తోంది.ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధానికి అంగీకరించడం వల్లే రైతులంతా భూములిచ్చారని పవన్ గుర్తుచేశారు.
బాగానే ఉంది. జగన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంపై జనసేన ప్రత్యక్ష పోరాటానికి ఎందుకు దిగలేదని ప్రశ్నిస్తే వారివద్ద సమాధానం లభించదు. కేవలం మైకుల ముందు ఆవేశంగా, ఆవేదనతో మాట్లాడడం ద్వారా ప్రభుత్వాలు దిగిరావు. అవసరం అయితే రోడ్డెక్కాలి. జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. అనుకున్నది సాధించాలన్నా, ప్రభుత్వ మెడలు వంచాలన్నా ఒక్కోసారి పోరాటాలు తప్పవనే విషయం మరచి జనసేనాని మాటలకు పరిమితం అయితే అమరావతి రాజధాని రైతులకు ఎప్పటికీ న్యాయం జరగదు.
Must Read: ఇదెక్కడి న్యాయం.. రాజధాని కోసం ఉద్యమిస్తే బేడీలా?
రైతుల కన్నీరు పాలకులకు మంచిది కాదు
రైతుల కన్నీరు ఏ ప్రభుత్వానికి మంచిది కాదని జనసేనాని వైసీపీని ఉద్దేశించి హితవు పలికారు. బీజేపీ కూడా అమరావతి రాజధానికే మద్దతు ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని విషయంలో జనసేన ఆడపడుచులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేసే హక్కు రైతులకు ఉందని పవన్ స్పష్టం చేశారు. 29 గ్రామాల్లోని 33 వేల ఎకరాల భూములను అస్తవ్యక్తం చేసి ఇప్పుడు తిరిగి ఇస్తామనడం దారుణమని వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
పంట భూములను రాజధాని పేరుతో తీసుకుని గోతులు తవ్వి పెట్టారని, ఎవరి భూమి ఎక్కడ ఉందో కూడా గుర్తించడం కష్టమని, అలాంటిది భూమిని రైతులకు మరలా ఇస్తామని చెప్పడం అంటే వారిని మోసం చేయడమేనని పవన్ విమర్శించారు. రాజధాని రైతులకు జరిగిన అన్యాయంపై జనసేనానికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ వారి పక్షాన ఒక్క రోజైనా పోరాటం చేశారా అనేది ప్రశ్నించుకోవాలి. లేదంటే జనసేనాని కేవలం మాటల మనిషనే అపవాదు వచ్చే ప్రమాదం లేకపోలేదు.
అధికారంతో వేలకోట్లు దోచుకోవడం కాదు
అధికారం అండతో వేలకోట్లు కూడగట్టుకోవడం కాదంటూ వైసీపీ అధినేతను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒకరినొకరు దూషించుకోవడం తప్ప సమస్యను పరిష్కరించే ఆలోచన లేదన్నారు. ఓట్లకోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కోమాట చెప్పాల్సిన అవసరం తనకు లేదని పవన్ స్పష్టం చేశారు. అమరావతి రైతుల వేదన, పాలకులకు శాపంగా తగులుతుందని ఆయన అన్నారు. అమరావతిలో రాజధాని పెట్టడానికి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన వైసీపీ అధినేత జగన్ రెడ్డికి, నేడు కులం గుర్తుకు వచ్చిందని, ఏదో ఒక కులం వారికే భూములున్నాయనే నెపంతో రాజధానిని మూడు ముక్కలు చేయడం దారుణమని పవన్ తప్పుపట్టారు.
వైసీపీ చేసిన మోసాన్ని ఎండగట్టి, అమరావతి రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేసే బాధ్యత జనసేనకు లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎంతసేపటికి నేను అండగా ఉంటా అంటారు. కానీ ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తానని జనసేనాని ఎందుకు భరోసా ఇవ్వడం లేదు. ఓ పార్టీ అధినేత నాయకత్వం వహించాలి కానీ, మీరు ఉద్యమం చేయండి నేను మంచినీళ్లు అందిస్తానంటే సరిపోతుందా?
అమరావతి రాజధాని ఉద్యమానికి పవన్ నాయకత్వం వహించాలి
అవును. అమరావతి రాజధాని ఉద్యమానికి పవన్ నాయకత్వం వహిస్తే, రాజధాని తరలింపు గ్యారంటీగా నిలిచిపోతుంది. అయితే పవన్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి. అమరావతి పోరాటానికి నాయకత్వం వహించాలి. పవన్ పిలుపునిస్తే యువత కదలి వస్తుంది. రాజధాని రైతులు కదలి వస్తారు. అందరూ రోడ్డెక్కితే ప్రభుత్వం దిగివస్తుంది. పవన్ పూనుకుంటే అమరావతికోసం పోరాటం రాష్ట్రవ్యాప్తం అవుతుంది. అమరావతి రాజధాని తరలింపు నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జనసేనాని ఆ పని చేయడానికి మాత్రం ముందుకు రాకపోవడంపై రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచింది వారు చెప్పుకుంటున్నారు. మరి జనసేనాని ఏం చేస్తారో వేచి చూడాల్సిందే..
Also Read: అమరావతికి ఐదేళ్లు | Amaravati Farmers Rally | Five Years For Amaravati Foundation