కరోనా సెకండ్ వేవ్ లో కొత్త సినిమాల కోసం ఎదురుచూసేవారికి ‘అర్ధశతాబ్దం’ వచ్చేసింది. ‘కేరాఫ్ కంచరపాలెం’ నటుడు కార్తీక్ రత్నం హీరోగా ప్రవీణ్ పుల్లె దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ‘ఆహా’ ఓటీటీ ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
తెలంగాణలోని ఓ పల్లెటూరి కుర్రాడు డబ్బు సంపాదన కోసం చేసే ప్రయత్నాల్లో ఎదురైన సంఘటనలతో రూపొందిన సినిమా ఇది. అతని పేరు కృష్ణ (కార్తీక్ రత్నం). కష్టాల్లో ఉన్నతన కుటుంబాన్ని ఆదుకునేందుకు అతను దుబాయికి వెళ్లాలనుకుంటాడు. అతను చేసే ఆ ప్రయత్నాలు తల్లికి ఇష్టముండు. ఆ ఊళ్లోని ఓ అమ్మాయితో అతనికి ప్రేమ వ్యవహారం సాగుతుంది. వన్ సైడ్ లవ్ అనుకోండి.
ఆమె పేరు పుష్ప (కృష్ణప్రియ). తన ప్రేమను వ్యక్తం చేసుకునే నేపథ్యంలో కొన్ని అనుకోని పరిణామాలు తలెత్తుతాయి. కులఘర్షణలు తలెత్తుతాయి. మరి అతను దుబాయి వెళ్లే ప్రయత్నాలు ఏమయ్యాయి? ఊళ్లో కుల ఘర్షణల పర్యవసానం ఏమిటి? పుష్ప అతనికి దక్కిందా లేదా? అనే అంశాల చుట్టూ తిరిగే సినిమా ఇది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి సామెత లాంటిదే ఈ సినిమా. ఈ కరోనా కాలంలో ఈ పేరు చూసి, ట్రైలర్ చూసి ఏదేదో ఊహించుకుంటే మాత్రం నిరాశ కలగకమానదు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సినిమా తీయడం ఎలాగో ఈ సినిమాని చూసి నేర్చుకోవచ్చు. ఇందులోని డైలాగులో భారీ తనం చూసి అబ్బ ఎంత బాగా రాశారు అని మురిసిపోవాలో, ఇలాంటి డైలాగులతో ఇంత దారుణంగా ఎలా తీశారు అని ప్రశ్నించుకోవాలో అర్థంకాని అర్ధశతాబ్దమిది. అర్థవంతమైన కథను కూడా వ్యర్థంగా తీయడం అంటే ఇదే. అర్థం లేని పాత్రలు, అసందర్భ సన్నివేశాలతో గందరగోళంగా కథనం సాగింది.
కనీసం కథలో ఇంటెన్సిటీ ఉందా అంటే అదీ లేదు. ఎలాంటి నటులైనా తమ పరిధి మేరకే మెప్పించగలరు. మిగతా నటన దర్శకుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ సినిమానే. ఇందులో కొన్ని సన్నివేశాలకు సరైన కారణమే కనిపించదు. కథనం లొసుగుల మయంగా సాగుతుంది. ఏ పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. సినిమాలో ఎమోషన్ అసలే పండలేదు. సినిమా గమనమే నీరసంగా ఉంటుంది. కార్తీక్ పోషించిన పాత్ర సాదాసీదా ఉంటుంది. తనలోని నటుడిని కొత్త చూపే ప్రయత్నం కూడా అతను ఏమీ చేయలేకపోయాడు.
కృష్ణప్రియ చూడటానికి అందంగానే ఉన్నా ఆమె పాత్ర గురించి పెద్దగా చెప్పడానికంటూ ఏమీ లేదు. నటనలో సీనియర్లు అయిన శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ ఉన్నా ఆ పాత్రల్లోనూ పసలేదు. అవి నస పెట్టే పాత్రల్లా అనిపిస్తాయి. శుభలేఖ సుధాకర్ పాత్ర ఇచ్చే ఊకదంపుడు ఉపన్యాసాలు వినడానికి జనం సిద్ధంగా లేరు. తన పాత్ర పరిధి మేరకు ఆయన నటించి మెప్పించారు. సాయి కుమార్ మార్కు డైలాగులు అసలే లేవు.
సీనియర్ నటి ఆమనిని కూడా సరిగా వినియోగించుకోలేకపోయారు. పాటల పరంగా కూడా మంచి మార్కులు పడవు. నేపథ్య సంగీతం విషయంలోనూ న్యాయం జరగలేదు. డైలాగులు బాగున్నా, అందులో డెప్త్ ఉన్నా దర్శకుడు వాటికి న్యాయం చేయలేకపోయారు. ఓవరాల్ గా ఇది నిరాశాజనక ప్రయత్నంగా చెప్పాల్సి ఉంటుంది. రచయితగా సంభాషణల్లో కొన్ని మెరుపులు చూపించాడు ప్రవీణ్.
నటీనటులు: కార్తీక్ రత్నం, కృష్ణప్రియ, ఆమని, నవీన్ చంద్ర, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అజయ్ తదితరులు
సంగీతం: నవ్ ఫాల్ రాజా
డీవోపీ : ఈజె వేణు-వెంకట్ శాఖమూరి, అష్కర్
నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
దర్శకత్వం: ప్రవీణ్ పుల్లె
ఒక్క మాటలో: వ్యర్థ శతాబ్దం
రేటింగ్: 2/5











