లేత వయసు ప్రేమ కథలు అంటే సున్నితంగా ఉంటాయనే కాదు పండీపండని అపరిపక్వ చేదు కథలు అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడో చాలా పాత తరానికి దేవదాస్ – పార్వతి పేర్లు వినగానే విషాద ప్రేమ కథలు అని తెలిసి పోయినట్లు ఆ తర్వాతి తరానికి బాలు – స్వప్న పేర్లు వినగానే ‘ మరో చరిత్ర ‘ సినిమా, అందులో హీరో హీరోయిన్ల పాత్రల పేర్లు గుర్తుకు వస్తాయి. ఇంకో జనరేషన్ కి బాలు పేరు వింటే పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ ‘ గుర్తుకు వస్తుంది . అవే పేర్లు పెట్టడం సెంటిమెంట్ గా డైరెక్టర్ పోలూరు కృష్ణ ఫీల్ అయ్యాడేమో తెలియదుగానీ బాలు – స్వప్న ల పేర్లతో ఈ కథ ఎలా ఉండబోతుందో ఆడియెన్స్ కి చెప్పేసినట్లయింది.
కథేంటి: కథ మొత్తం1995-1998 నేపథ్యంలో సాగుతుంది. అందువల్ల కథాకథనాలు పాత తరహాలో సాగాయనే నింద నుంచి తప్పించుకున్నారు. పల్లెటూరి వాతావరణంలో చిత్తూరు మాండలికంలో సినిమాని చిత్రీకరించారు. RX100 నుంచి ‘ రాజా వారు – రాణి వారు ‘ , ‘ ఓ పిట్ట కథ ‘ లాంటి సినిమాలకు ఈ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ప్లస్ అయింది. అది ‘బుచ్చినాయుడు కండ్రిగ: తూర్పు వీధి’ అనే గ్రామం. బాలు ఎదురింట్లో ఉండే స్వప్నను ఇష్టపడతాడు.
కాలేజీకి వెళ్లే వయసులో ఆమెతో ప్రేమలో పడతాడు. స్వప్న తండ్రికి కుల పిచ్చి. తమ కులానికి చెందిన పిల్లలతోనే కూతురు స్నేహం చేయాలనుకుంటాడు. తన కొడుకుని రైల్వే స్టేషన్ మాస్టర్ చేయాలని కలలు కంటుంటాడు బాలు తండ్రి. కూతురి ఇష్టాన్ని తెలుసుకోకుండా బావమరిదితో పెళ్లి ఖాయం చేస్తాడు స్వప్న తండ్రి. ఈ నేపథ్యంలో బాలు, స్వప్న ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. పరువు కోసం ప్రాణాలు తీసే స్వప్న తండ్రి ఏం చేశాడు? కొడుకు భవిష్యత్తు కోసం కలలు కనే బాలు తండ్రి ఏం చేశాడు? అనే అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.
ఎలా తీశారు? : ఈ సినిమాకి లొకేషన్స్ బాగున్నా, కథని నిదానంగా చెప్పడంతో ఆసక్తి కలిగించలేకపోయింది . ప్రతీ సన్నివేశాన్నీ, ప్రతి మాటనూ తర్వాత ఏం జరగబోతుందో తెలిసేలా రాసుకున్నారు . ఫస్ట్ హాఫ్ కన్నా, సెకండ్ హాఫ్ కొంత బెటర్ గా ఉంది. కొత్త హీరో హీరోయిన్లు మున్నా- థ్రిల్లక బాగా చేశారు . సరైన పాత్రలు, మంచి దర్శకుడు దొరికితే కెరీర్ లో ముందుకి వెళ్లే అవకాశాలున్నాయి .
హీరో తల్లిదండ్రుల పాత్రలపే పోషించిన ప్రభావతి – రాజు బాగా నటించారు . పాటలు నిరాశ పరిచాయి . నేపథ్య సంగీతం ఫర్లేదు. థియేటర్స్ కి వచ్చి ఈ సినిమా చూడాలంటే కష్టం . ఆలా అని డిజిటల్ ఓటీటీలో ఫ్రీ గా చూడటం కూడా కష్టమే. దీనికి కారణం టైం ఒకటే కాదు.. అవతల ఎన్నో డిజిటల్ ఛానెల్స్ వేల సినిమాలు, వాటి క్వాలిటీ కంటెంట్ తో మనం పోటీ పడాలి అనే విషయాన్ని ప్రతి మేకర్ గుర్తుంచుకోవాలి .
ఒక్కమాటలో: నిరాశాజనక ప్రయత్నం
నటీనటులు: మున్నా, దృశిక చందర్, రవివర్మ, సుబ్బారావు, ప్రభావతి, పవిత్ర
సాంకేతిక నిపుణులు : మిహి రాంశ్ , డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : రామ్ కే . మహేసన్ , ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ , నిర్మాత ; పమిడిముక్కల చంద్ర కుమారి రచన , దర్శకత్వం : పోలూరు కృష్ణ ,
దర్శకుడు: కృష్ణ పోలూరు
ఎక్కడ చూడాలి? : ఆహా
రేటింగ్ : 1/5
– గాదె సాయికృష్ణ