నిర్మాతగా ఎమ్మెస్ రాజు పేరు తెలియనివారుండరు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆయన బ్యానర్ నుంచి వచ్చాయి. వైవిధ్యభరితమైన చిత్రాలుగా అవి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ‘శత్రువు’ .. ‘దేవీ పుత్రుడు’ .. ‘మనసంతా నువ్వే‘ .. ‘ఒక్కడు’ .. ‘వర్షం’ .. నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ .. ‘పౌర్ణమి’ సినిమాలు కనిపిస్తాయి. ఆయన నిర్మించిన ప్రేమకథా చిత్రాలు ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించాయి. ఇప్పటికీ ఆ సినిమాలు ప్రేమికులు నిత్యం పఠించే గ్రంథాలుగానే అనిపిస్తాయి. ఇలా నిర్మాతగా మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న ఎమ్మెస్ రాజు, ఆ తరువాత దర్శకుడిగా మారారు. తన అభిరుచికి తగిన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు.
Must Read ;- పవన్ కళ్యాణ్ తో ఎం.ఎస్.రాజు సినిమా నిజమేనా.?
ప్రేమకథాలను యూత్ మెచ్చేలా ఆవిష్కరించడం తెలిసిన ఎమ్మెస్ రాజు, ‘వాన’ .. ‘తూనీగా తూనీగా’ సినిమాలకి దర్శకుడిగా వ్యవహరించారు. ఆ సినిమాల వసూళ్ల సంగతి అటుంచితే, ఆ సినిమాలను అనుభూతి ప్రధానమైన దృశ్య కావ్యాలుగా ఆయన ఆవిష్కరించాడని అంతా చెప్పుకున్నారు. ఆలాంటి ఎమ్మెస్ రాజు, కొంత గ్యాప్ తరువాత రొమాన్స్ పాళ్లు ఎక్కువగా కలుపుకుని ‘డర్టీ హరి’ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. “ఈ సినిమా టైటిల్ బాగుందనే టాక్ రావడంతో, సగం సక్సెస్ వచ్చేసినట్టుగానే నేను భావిస్తున్నాను. ట్రైలర్ ను చూసి కొంతమంది అపోహపడుతున్నట్టుగా ఈ సినిమాలో బూతు లేదు .. శృంగారం ఉంటుంది. ఆ శృంగారం కథకి కట్టుబడే నడుస్తుంది. నా సినిమాను గురించి డబ్బా కొట్టుకోవలసిన అవసరం నాకు లేదు. నా సినిమా బాగోలేదనిపిస్తే నేను ఇంటర్వ్యూ కూడా ఇవ్వను. సినిమా మొదలైన పదినిముషాల్లోనే ఆడియన్స్ కథలో భాగమైపోతారు. ఎమ్మెస్ రాజు ఒక మంచి సినిమా తీశాడనే అభిప్రాయంతో బయటికి వస్తారు.
ఎమ్మెస్ రాజు సినిమాల్లో మంచి ఫీల్ ఉంటుందనే పేరు ఉంది. అలాంటి ఫీల్ ఈ సినిమాలోను మిస్ కాలేదు. ఇంతకుముందు నిర్మాతగా విభిన్నమైన కథలతో సినిమాలు చేశాను .. దర్శకుడిగా ప్రయోగాలు చేశాను. గతంలో చేసిన సినిమాలకి భిన్నంగా, ఈ జనరేషన్ కి తగినట్టుగా ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ‘డర్టీ హరి’ చేశాను. ఇది నా మనసుకి నచ్చిన కథ .. నాకు నచ్చినట్టుగానే తీశాను. ఆడియన్స్ కి నచ్చుతుందనే నమ్మకం ఉంది. సినిమాను చూస్తూ ఎంజాయ్ చేసి ప్రేక్షకులు బయటికి వస్తారు. ఒక దర్శకుడిగా నేను సంతృప్తి చెందడానికి అంతకుమించి కావలసినదేముంటుంది?” అంటూ చెప్పుకొచ్చారు.
Also Read ;- ఆద్యంతం ఆకట్టుకునే ట్రిపుల్స్