ప్రతి ఏడాది డిసెంబర 9 న అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటుంది. అందులో భాగంగా అవినీతి వల్ల జరగుతున్న పరిణామాలు, అవినీతిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవాగాహాన కల్పించడానికి ప్రత్యేకంగా ఈ రోజును ఏర్పాటుచేసుకున్నారు. 2003 లో ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 31 న నిర్వహించిన ‘అవినీతి వ్యతిరేక సదస్సు’లో ప్రతి ఏడాది డిసెంబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక దినోత్సవం జరపాలని నిర్ణయించారు. మరి ఈ రోజు ప్రత్యేకత, దిశానిర్ధేశాలేంటో తెలుసుకుందాం రండి.
పేదరికంపై ప్రభావం
అవినీతి లేని దేశం, రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అవినీతి అంతగా ప్రపంచమంతా వ్యాప్తిచెందింది. ప్రతి వ్యవస్థ అవినీతి మయం అవడం వల్ల పేదవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. వారి స్థితిగతులను ఈ చర్యలు మార్చేస్తున్నాయి. అంతేకాదు, సమాజ ప్రమాణాలు దిగజారీపోతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వాలు, ఎన్జీవోలు.. ఇలా అందరూ చేతులు కలిపి అవినీతిపై ప్రజలకు అవగాహాన కల్పించి, దానిని అరికట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ ప్రజల అవసరాల ముందు పనికి రావడం లేదు.
భారత్ స్థానమేది?
రాజకీయాలు, వ్యాపారాలు, ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ రంగాలు.. ఇలా ఒక్కటేమిటి డబ్బు లేకుండా పని జరగని స్ధాయికి చేరుకుంది ఈ ప్రపంచం. ఏ పని కావాలన్నా డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిధులు, పాలసీలు, పథకాలు ప్రజలకు అల్లంత దూరాన ఆగిపోతున్నాయి, ఎన్నో జీవన ప్రమాణాలు మెరుగుపరిచే పనులకు అవినీతే అడ్డంగా నిలుస్తుంది. 2012-2019 స్టడీ ప్రకారం, భారత్ అవినీతి ఎక్కువగా జరుగుతున్న జాబితాలో ఉందంటే మన దేశ పరిస్థితిని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజ్ లాండ్, స్వీడెన్, సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు అతి తక్కువ అవినీతి కలిగిన దేశాల జాబితాలో మొదటి 6 స్థానాలు సొంతం చేసుకున్నాయి.
Must Read ;- ఖాకీల కనుసన్నల్లోనే.. కాయ్ రాజా కాయ్!
అన్నీ తెలుసు.. కానీ పాటిస్తున్నదెవరు?
అవినీతిని అరికట్టడానికి, నిర్మూలించడానికి మార్గాలు అనేకం. వాటిలో పారదర్శక పని విధానం పాటించడం చేయాలి. అందువల్ల అవినీతికి తావుండదు. ప్రైవేట్ రంగమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విడుదల చేస్తున్న నిధులు పనితీరును పారదర్శకంగా చూపగలిగితే కొంతమేర అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు. సమాచార హక్కు చట్టం అనేది ప్రతి భారతీయుని చేతిలో ఆయుధం వంటిది. దీని ద్వారా సమాచారాన్ని సేకరించి కోర్టులలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ధాఖలు చేయడం ద్వారా కూడా అవినీతిని బట్టబయలు చేయచ్చు. అంతేనా, తర్వాతి కాలంలో అవినీతి తగ్గుముఖం పడుతుందని ఆశించవచ్చు.
అవినీతి నిరోధక సంస్థలను ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి సత్వరం స్పందించే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా కూడా అవినీతిని తగ్గించే ప్రయత్నం చేయచ్చు. ఇలా ఎన్నో మార్గాలు అవినీతికి అడ్డుకట్ట వేయడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ వాటిని సక్రమంగా అమలుజరిగేలా చూడడంలో విజయం సాధిస్తే, అవినీతికి నివారించగలం. కానీ, వీటిని అములుచేయడంలో దేశాలు విఫలమవడంతో ఆ దేశ ప్రజలు జీవన ప్రమాణాలు, అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
పాటించకపోతే ఉపయోగం శూన్యం
‘అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం’ అంటే కేవలం అవినీతి అరికట్టే విధానాలు తెలుసుకుని, తర్వాతి రోజుకు మర్చిపోయి తిరిగి అలాంటి పనులు చేయడం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రతి విషయంలో లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు, అవినీతిని అదుపు చేయడంలో కూడా ప్రపంచదేశాలు లక్షాన్ని పెట్టుకుని పనిచేస్తే, అసలు ఇలాంటి అవినీతి వ్యతిరేఖ దినోత్సవాలతో అవసరమే ఉండదు. మరి అలాంటి రోజు రావాలని కోరుకుందాం.
Also Read ;- ఎస్కేప్ : తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మిస్సింగ్ కనిపించడంలేదు