ఉప్పెనలా దూసుకొచ్చాడు.. ఉవ్వెత్తున ఎగిశాడు.. దేశాన్ని శాసించాడు.. అంతలోనే కన్నుమూశాడు. మూడు ముక్కల్లో చెప్పాలంటే ఓ యువనేత కథ ఇది. ఇందిరాగాంధీ చిన్న కుమారుడిగా పరిచయమై.. ఆమె రాజకీయ వారసుడిగా ఎదిగి.. తన దూకుడుతో యువతను ఆకట్టుకుని.. భావి ప్రధానిగా గుర్తింపు తెచ్చుకుని.. అదే దూకుడుతో అర్ధాంతరంగా వెళ్లిపోయాడు.
1946 డిసెంబరు 14న జన్మించిన సంజయ్.. చిన్నతనం నుంచే దూకుడుగా వ్యవహరించే వాడు. ఆయన విద్యాభ్యాసమంతా ఎక్కువగా విదేశాల్లోనే సాగింది. ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో అడుగిడిన ఈ యువనేత.. అప్పట్లోనే జనతా కార్ తయారీకి శ్రీకారం చుట్టాడు. మారుతీ సంస్థతో కలిసి తన కలల ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు. ఆ సంస్థకు ఎండీగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ కాలంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు. తల్లి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అయినా.. సంజయ్ గాంధీ.. అవేవీ లెక్క చేసేవాడు కాదు. తనదైన శైలిలో దూకుడుగా ముందుకెళ్లేవాడు.
రాజకీయ ప్రవేశం
ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించిన సమయంలోనే.. సంజయ్ ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పుడు ఆయన పోషించిన పాత్ర అత్యంత వివాదాస్పదమైంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేసి, జైళ్లలో కుక్కేశాడు. పత్రికల నోళ్లు కుట్టేశాడు. మొత్తం వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. ఆ సమయంలో పాలనా వ్యవహారాలు మొత్తం తనే చూసుకునేవాడు. పాలన పీఎంఓ నుంచి కాకుండా.. పీఎం ఇంటి నుంచి జరిగేదన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించేవి. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు. తన తల్లిని ఎవరైనా ఒక్క మాట అన్నా భరించలేని సంజయ్.. ఆ కాలంలో ఇందిరను విమర్శించిన ఎందరినో హత్య చేయించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన సంజయ్.. పార్టీ వ్యవహారాలు మొత్తం తన చేతుల్లోకే తీసేసుకున్నాడు. పార్టీలోకి భారీగా యువతను చేర్చుకున్నాడు. వారంతా రౌడీలు, గూండాలు అని అప్పట్లో ఎన్ని ఆరోపణలు వినిపించినా లెక్క చేయలేదు. తనదైన దూకుడుతో ముందుకెళ్లాడు. సంజయ్ యువ మోర్చా పేరుతో ఓ వ్యవస్థనే నిర్మించాడు. అప్పట్లో నాయకులు పార్టీ వ్యవహారాలు మాట్లాడాలంటే.. ఇందిరను కాకుండా సంజయ్‌ని కలిసేవారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆయన దూకుడు ఏ స్థాయిలో ఉండేదో. ఒకానొక సమయంలో ఇందిర కూడా సంజయ్‌ని చూసి భయపడేదన్న ప్రచారం కూడా బలంగా జరిగింది.
Must Read ;- ధైర్యానికి, వన్నెతరగని వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సోనియా గాంధీ
ఇందిరనే శాసించిన ఏకైక నాయకుడు
ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలు కావడంతో పార్టీని నడిపించే బాధ్యత మొత్తాన్ని ఆయన తన చేతుల్లోకే తీసేసుకున్నాడు. ఇందిర కూడా ఆయన మాటను జవదాటేవారు కారు. ఈ క్రమంలో జనతా ప్రభుత్వం కూలిన అనంతరం జరిగిన ఎన్నికల్లో.. పార్టీని తిరిగి అధికారంలోకి తేవడంలో ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. పార్టీ మేనిఫెస్టోలో ఆయన పొందుపరచిన పంచశీల పథకం అప్పట్లో ప్రజాదరణ పొందింది. అక్షరాశ్యతను పెంపొందించడం, కుటుంబ నియంత్రణను అమలు చేయడం, కులతత్వాన్ని నిర్మూలించడం, మొక్కలు నాటడం, వరకట్నాన్ని నిషేధించడం వంటి ఆయన విధానాలు ఇప్పటికీ అనుసరనీయమైనవే కావడం గమనార్హం.
ఇందిర.. తిరిగి అధికారం చేపట్టిన తర్వాత.. సంజయ్ దూకుడు మరింత ఎక్కువైంది. తానే అనధికారిక పీఎం గా వ్యవహరించేవాడు. కొన్ని సందర్బాల్లో ఆయన వ్యవహార శైలి ఇందిరను కూడా ఇబ్బందిపెట్టేదని అప్పటి నాయకులు చెప్పేవారు. కానీ, ఆయనపై ఇందిరకు ఆపారమైన నమ్మకం ఉండేది. అందుకే సంజయ్ ను ఆమె తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. దూకుడు తగ్గించుకోవాల్సిందిగా ఆమే స్వయంగా సంజయ్‌కు అనేక సందర్భాల్లో సూచించేవారని చెబుతుంటారు.
కెరటానికి కళ్లేం వేసిన కాలం
ఇలా.. కెరటంలా ఉవ్వెత్తున ఎగసి.. భావి భారత ప్రధానిగా అందరూ భావిస్తున్న తరుణంలో విమాన ప్రమాదంలో 1980, జూన్ 23న ఆయన అకాల మరణం చెందారు. మరణించే నాటికి ఆయన వయసు 34 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. సంజయ్ మరణం.. ఇందిరను తీవ్రంగా ప్రభావితం చేసింది. నాటి ఘటనతో ఆమె మానసికంగా చాలా కుంగిపోయారని అంతరంగికులు చెబుతుంటారు. తన కుడి భుజాన్ని కోల్పోయానని ఆమే స్వయంగా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా.. సంజయ్ గాంధీ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోకుండా ఉండి ఉంటే.. భారత రాజకీయ చిత్రపటంపై సంజయ్‌కు కూడా స్ధానం ఉండేదనడంలో సందేహం లేదు.
Also Read ;- రేవంత్: ఆశపుట్టిన ప్రతిసారీ.. ఆరోపణలు పుడుతున్నాయ్!