ఏలూరులో కలకలం సృష్టించిన వింతవ్యాధి ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. ఈ నెల ఐదో తేదీ నుంచి 12 తేదీ వరకూ మొత్తం 616 వింతవ్యాధి కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. మెరుగైన చికిత్స కోసం 35 మందిని గుంటూరు, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 29 మందిని డిశ్ఛార్జి చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురికి శస్త్ర చికిత్స అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూరోసర్జన్ లేకపోవడంతో బాధితులకు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. మొత్తం మీద ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో డాక్టర్లు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వ్యాధిపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
ఏలూరు వింత వ్యాధిపై నేటికీ స్పష్టత రాలేదు. మొదట తాగునీటి కాలుష్యం అని భావించిన డాక్టర్లు, తరువాత తినే ఆహారంలో విష రసాయనాల వల్లే బాధితులు ఫిట్స్ వచ్చి పడిపోయారని తేల్చారు. నగరంలోని అన్నీ ప్రాంతాల్లో బాధితుల నివాసాల నుంచి 40 రకాల ఆహార పదార్థాల శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ఎన్ఐఎన్‌కు పంపారు. వాటి నివేదికలు మరో రెండు రోజుల్లో రానున్నాయి. అవి వస్తే ఆహార పదార్ధాల్లో చేరిన విష రసాయనాల వివరాలు తెలియనుంది. మరోవైపు బియ్యంలో పాదరసం అవశేషాలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించారు. అసలు బియ్యంలోకి పాదరసం ఎలా చేరిందనే విషయం అంతుపట్టడం లేదు. తినే ఆహారంలో విష రసాయనాలు కేవలం ఏలూరుకే పరిమితం అయిందా? లేక అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందా? అనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Must Read ;- గుంటూరులో వింత వ్యాధి కలకలం..

ఆర్గానిక్ కూరగాయలు సాగు చేయాలని సీఎం ఆదేశం
కూరగాయల పంటలపై విచ్చల విడిగా పురుగు మందులు పిచికారి చేయడం, వాటిని వినియోగదారులు తినడం వల్లే ఏలూరులో జనం ఫిట్స్ వచ్చి నురగలు కక్కుతూ పడిపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, రైతులు సేంద్రీయ విధానంలో కూరగాయలు పండించేలా వారిని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. చాలా ప్రాంతాల్లో రైతులు కూరగాయల పంటలపై రసాయనాలు పిచికారి చేసిన వెంటనే కూరగాయలు కోసి మార్కెట్లకు తరలిస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించడంతో, నిషేధిత గడ్డి నివారణ మందులను మార్కెట్లో లేకుండా చేయాలని సీఎం ఆదేశించారు. గడ్డి నివారణకు రైతులు వాడే మందులు ప్రజల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే చాలా రాష్ట్రాల్లో గడ్డి మందులను నిషేధించారు. అయితే, కొన్ని కంపెనీలు నిషేధించిన పేర్లు మార్చి, కొత్త బ్రాండ్లతో కలుపు నివారణ మందులను మార్కెట్ చేస్తున్నాయి. కూరగాయల పంటల్లో కలుపు నివారణకు రైతులు విరివిగా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఇవన్నీ కూరగాయల్లో అవశేషాలుగా మిగిలిపోతున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం కరవు
సేంద్రీయ పంటల సాగుకు గత ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టును వైసీపీ అధికారంలోకి వచ్చాక అటకెక్కించారు. వ్యవసాయశాఖ సహకారంతో, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన సేంద్రీయ సాగు ఏపీలో నిలిచిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలో, మండలంలో అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను నియమించారు. వారికి శిక్షణ ఇచ్చి రైతుల్లో సేంద్రీయ సాగుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సేంద్రీయ సాగు ప్రాజెక్టును నిలిపి వేశారు. దీంతో గ్రామాల్లో రైతులు కూడా సేంద్రీయ సాగుకు ఎలాంటి ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో, విచ్చలవిడిగా రసాయనాలు పిచికారీకి అలవాటు పడ్డారు. సేంద్రీయసాగు విధానాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతోపాటు, రైతులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే సేంద్రీయసాగు పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం కలుగుతుందని, తద్వారా రైతులకు కూడా మేలు జరుగుతుందని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read ;- వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే…











