ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనత వహించిన సర్కారు వారు.. ఓ బృహత్ కార్యచరణకు ఉపక్రమించింది. ప్రభుత్వం సొమ్ముతో చర్చిలను నిర్మించడానికి పూనుకుంది. గతంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి మరీ చర్చి నిర్మాణానికి పూనుకుంటున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో బేతల క్రిస్టియన్ బ్రదర్న్ ట్రస్ట్ చర్చ్ పేరుతో చర్చి కట్టడానికి 8.72 లక్షల అంచనా బడ్జెట్ తో టెండర్లు పిలిచారు. ఒక ట్రస్ట్ పేరుతో కట్టే చర్చికి ప్రభుత్వం టెండర్లు పిలవడం ఏమిటో అర్థం కాని సంగతి. పైగా ఆరు నెలల్లోగా చర్చిని పూర్తి చేయాలంటూ.. టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు కూడా.
ఒక మతానికి సంబంధించిన ఆలయాలు, ప్రార్ధన స్థలాలను ప్రభుత్వం తరఫున నిర్మించడం, నిర్వహించడం అనేది అరుదుగా జరిగే సంగతి. హిందూత్వం విషయానికి వస్తే విరాళాలతో, టీటీడీ వంటి పెద్ద సంస్థల ప్రోత్సాహంతో చిన్న ఊర్లలో గుడుల నిర్మాణం జరుగుతుంటుంది. మసీదులు, చర్చిలు కూడా విరాళాలతోనే నిర్మితమవుతుంటాయి. కానీ ప్రభుత్వమే పూనుకుని నిర్మించడం అనేది బోధపడ్డం లేదు.
Must Read ;- ఏలూరు వింత వ్యాధిపై సర్కారు విచిత్ర వాదన..!
మైనారిటీ సంక్షేమం ముసుగు
ఇలాంటి చర్చిల నిర్మాణ కార్యక్రమలకు ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం అనే ముసుగు తొడుగుతోంది. అయితే అర్థంకాని సంగతి ఒక్కటే. మైనారిటీ సంక్షేమం అంటే మతాలనుఉద్ధరించడం అనుకుంటున్నారా? వివిధ మైనారిటీ మతాలకు చెందిన పేదలను ఉద్ధరించడం అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిర్దిష్టంగా తక్కువ సంఖ్యలో ఉండే మతాలకు చెందిన వారు.. అలాంటి మతాన్ని అనుసరిస్తున్న కారణంగా.. సమాజంలో వివక్షను ఎదుర్కొంటూ… అసమానతలను అనుభవిస్తున్నప్పుడు.. అలాంటి వారికి మేలు చేకూర్చేందుకు మైనారిటీ సంక్షేమం అనే పథకాలు ఉపయోగపడాలి. అంతే తప్ప.. ఈ ముసుగులో చర్చిలను, మసీదులను నిర్మించడం కాదు కదా అనే వాదన వినిపిస్తోంది.
మైనారిటీ సంక్షేమం కింద చర్చిలు కట్టడం అనేది.. మతవ్యాప్తికి ప్రభుత్వం స్వయంగా పూనుకుని పాటు పడుతున్నట్టుగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ముందు ముందు ఎన్ని చిత్రాలు చూడాలో..
ప్రభుత్వం స్వయంగా.. చర్చిలు నిర్మించడానికి టెండర్లు పిలవడం పెద్ద చిత్రమైన సంగతి. అంటే ఇది సర్కారు వారి చర్చి అవుతుందన్న మాట. ముందుముందు ఈ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగితే.. ప్రభుత్వ చర్చిలో వేడుకలకు అందరూ విధిగా హాజరు కావాల్సిందే అని ఫత్వాలు కూడా జారీ చేస్తారేమో. ‘ఇది సర్కారు వారి చర్చి.. రండి తరించండి’ అని ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు కూడా ఇస్తారేమో. ప్రభుత్వ చర్చిలకు వచ్చే వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయనే నిబంధనలు వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు.
చర్చితో పాటు, మసీదుల నిర్మాణానికి కూడా మైనారిటీ సంక్షేమ నిధులతో ప్రభుత్వం పూనుకుంటుందో ఏమో తెలియదు. మైనారిటీ సంక్షేమం నిదులు మొత్తం చర్చిలు, మసీదుల నిర్మాణానికి పెట్టేసి.. వాటి సంఖ్యను రాష్ట్రంలో ఉండే గుడులకంటె పెంచేస్తారేమో కూడా తెలియదు. ఎటూ మెజారిటీ మతంగనుక.. హిందువుల ఆలయాలు వాళ్ల ఖర్చుతో కట్టుకోవాల్సిందేనని.. ప్రభుత్వం సహకరించదని కూడా ఈ నిర్ణయాల్లో అంతరార్థం ఉన్నదేమో కూడా తెలియదు. ప్రభుత్వ పోకడలు.. అనేకానేక అనుమానాలను రేకెత్తిస్తూ.. అనేకానేక విమర్శలకు కారణమవుతన్నాయి.
Also Read ;- ‘దైవదూత’ కీర్తనలతో తమ్మినేనికి ఫలం దక్కుతోంది మరి!!