బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అంటే ఉన్న క్రేజ్ మామూలుది కాదు. విభిన్న పాత్ర పాత్రలను పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి అక్షయ్ హారర్ కామెడీ వైపు మొగ్గుచూపడం విశేషమే. ఈ తరహా చిత్రాలను తెరకెక్కించడంలో రాఘవ లారెన్స్ సత్తా ఏమిటో మనకు తెలియంది కాదు. లారెన్స్ డైరెక్ట్ చేసి నటించిన ‘కాంచన’ సినిమా గురించి మనకు తెలియంది కాదు. ఇదే పాత్రను ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ పోషించారు. ఈ సినిమా పేరును మొదట్లో లక్ష్మీ బాంబ్ అని పెట్టినా ఇప్పుడు లక్ష్మిగా మార్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది దెయ్యాలతో ముడిపెట్టి అల్లిన కథ. దెయ్యాలు, భూతాలంటే నమ్మకం లేని పాత్ర ఆసిఫ్ (అక్షయ్ కుమార్)కు ఎదురైన అనుభవాలతోనే కథ ముందుకు సాగుతుంది. రష్మీ (కియారా అద్వానీ)తో ఆసిఫ్ ప్రేమలో పడతాడు. ఆమె హిందువు. ఆసిఫ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఈ కారణంగానే రష్మీ కుటుంబ సభ్యులకు దూరమవుతుంది. తన తల్లిదండ్రుల పెళ్లి రోజు ఉత్సవానికి రష్మీ అసిఫ్‌తో వెళతుంది.
వాళ్ల ఇంటికి సమీపంలోని స్థలంలో దెయ్యాలున్నాయనే ప్రచారం ఉంటుంది. అందరూ దాన్ని నమ్మినా అసిఫ్ వాటిని కొట్టిపారేస్తాడు. ఓ రోజు పిల్లలతో అతను ఆ ఖాళీ స్థలంలోకి క్రికెట్ ఆడటం కోసం వెళ్తాడు. ఇంటికి తిరిగొచ్చాక ఆసిఫ్ ను ఓ దెయ్యం ఆవహిస్తుంది. ఆ ఆత్మ పేరే లక్ష్మి. అది హిజ్రా ఆత్మ. ఆ ఆత్మ అతన్ని ఎందుకు ఆవహించింది? ఆ ఆత్మ కోసం ఆసిఫ్ ఏంచేయాల్సి వచ్చింది? లాంటివన్నీ సినిమాలో చూడాల్సిందే. చిన్న చిన్న మార్పులు తప్పితే కాంచన సినిమాని యధాతథంగానే తెరకెక్కించారు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఈ సినిమాలోది అక్షయ్ ఇమేజ్ కి తగిన పాత్ర కాదు. పైగా ఇది హిజ్రా పాత్ర. దీన్ని పోషించడంలో అక్షయ్ తనదైన ప్రత్యేకత చూపారు. దెయ్యం ఆవహించిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలానే తన హావభావాలను అక్షయ్ పలికించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఇది అక్షయ్ వన్ మ్యాన్ షో. హీరోయిన్ గా కియారా అద్వానీ కూడా మెప్పించింది. కథ అంతా అక్షయ్ చుట్టూ తిరగడంవల్ల ఆమె పాత్ర నిడివి తక్కువగానే ఉంది. అయితే కాంచనలో పండినంతగా ఇందులో కామెడీ పండలేదు. హిందీ నేటివిటీకి తగినట్టుగా కథలోనూ కథనంలోనూ దర్శకుడు లారెన్స్ మార్పులు చేయడం వల్ల ఏదో లోపించినట్లు అనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఫార్ములాగా సినిమాగా దీన్ని మలచాలని అక్షయ్ ప్రయత్నం చేసినట్టు కనపిస్తుంది.
నటీనటులు: అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, తరుణ్ అరోరా, శరద్ కేల్కర్, రాజేష్ శర్మ, రిషి చద్దా, ఆయేషా రజా మిశ్రా తదితరులు.
సాంకేతిక వర్గం: నేపథ్య సంగీతం: అమర్ మొహైల్
సంగీతం: తనిష్క్ బగ్చీ, షాహి డీజే కుషీ, అనూప్ కుమార్, ఉల్లు.
కెమెరా: వెట్టి పళని స్వామి, కుష్ చాబ్రియా
ఎడిటింగ్: రాజేశ్ జీ పాండే
నిర్మాణం: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్, షబీనా ఎంటర్ టైన్ మెంట్, తుషార్ ఎంటర్ టైన్ మెంట్ హౌస్.
కథ, రచన, దర్శకత్వం : రాఘవ లారెన్స్
విడుదల: డిస్నీ+ హాట్‌స్టార్ (ఓటీటీ)
ఒక్కమాటలో: అక్షయ్ నటన కోసమే చూసే సినిమా
రేటింగ్: 2.5/5
– హేమసుందర్ పామర్తి