అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ ఏడాది స్ట్రీమింగ్ అయిన సినిమాల్లో అందరినీ బాగా ఆకట్టుకొన్న మలయాళ సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’. ఒక సూపర్ స్టార్ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ .. అది వారికి ఎన్నటికీ సమస్య కాకూడదు. లేకపోతే.. అది అపార్ధాలకూ, అనర్ధాలకూ దారి తీస్తుంది. వెహికల్ ఇన్ స్పెక్టర్ అయిన ఒక సూపర్ స్టార్ వీరాభిమాని.. అతడికే శత్రువుగా మారడం అనర్ధమే కదా. ఈ పాయింట్ ను చాలా కన్విన్సింగ్ చెప్పాడు దర్శకుడు లాల్ జూనియర్ (దర్శకుడు, నటుడు లాల్ తనయుడు).
కథేంటి?: కురువిళా జోసెఫ్ ఒక వెహికల్ ఇన్ పెక్టర్. అతడికి సూపర్ స్టార్ హరీంద్రన్ అంటే చెప్పలేని అభిమానం. ఆ వయసులో కూడా ఆ హీరో సినిమాల్ని చూస్తూ .. థియేటర్స్ లో ఎంజాయ్ చేసేంతటి అభిమానం అది. ఒకానొక సమయంలో హీరో హరీంద్రన్ కు.. విదేశాల్లో ఒక కార్ ఛేజింగ్ సీన్ లో పాల్గొనడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అవుతుంది. తనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలని .. తన ఫ్రెండ్ జానీ పెరింగోడన్ చేత కబురు పంపిస్తాడు. దానికి కురువిళా సంతోషంగా అంగీకరిస్తాడు.
అయితే ఈ విషయాన్ని ప్రెస్ కు లీక్ చేస్తాడు .. హరీంద్రన్ ప్రత్యర్ధి హీరో అయిన భద్రన్. ఆ సమాచారం కురివిళానే ఇచ్చాడని .. హరీంద్రన్ అపోహ పడి.. అతడి కొడుకు ముందే కురువిళాను అవమాన పరుస్తాడు. దాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న కురువిళా హరీంద్రన్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ప్రాసెస్ ను కాంప్లికేటెడ్ గా మార్చేస్తాడు. చివరికి హరీంద్రన్ కు కురువిళా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడా ఇవ్వడా? వారిద్దరి మధ్యా అపార్ధాలు ఎలా తొలగుతాయి? అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు?: తాము సూపర్ స్టార్స్ ను ఎంత అభిమానిస్తారో .. ఆ స్థాయిలోనే సూపర్ స్టార్స్ నుంచి కూడా ఆదరణను ఆశిస్తారు అభిమానులు. అయితే ఒకోసారి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ను అభిమానులు సీరియస్ గా తీసుకున్నా, సూపర్ స్టార్స్ సిరీయస్ గా తీసుకున్నా.. ఇద్దరి ఇగోస్ దెబ్బతినే ప్రమాదముంది. ఆ క్లాష్ వార్ ను ఎంతో సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు లాల్ జూనియర్. ఆర్టీవో ఆఫీస్ లో తన అభిమాన హీరోని మొదటి సారిగా చూడబోతున్నందుకు ఎంతో ఎగ్జైట్ అవుతూ… అతడికి గిఫ్ట్ రూపంలో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని…దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకొని హీరో కోసం వెయిట్ చేస్తాడు కురువిళా.
అయితే ఆ అభిమానాన్ని.. అపార్ధం చేసుకొని ఒక్క చీదరింపుతో అభిమాని ఇగోని దెబ్బతీస్తాడు హరీంద్రన్. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్. చెప్పాలనుకున్న పాయింట్ ను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా.. చాలా సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు. సూపర్ స్టార్ హరీంద్రన్ గా పృధ్విరాజ్ సుకుమారన్ చాలా స్టైలిష్ గా నటిస్తే.. అభిమాని కురువిళా పాత్రను సురాజ్ వెంజారమూడ్ ఎంతో సహజంగా పోషించాడు.
ఒక్కమాటలో : అభిమాని, సూపర్ స్టార్ మీద సినిమా తీస్తే.. ఏ దర్శకుడైనా.. వారిద్దరి అభిమానాన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. దానికి తగ్గట్టుగానే ఆ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం బిల్డప్ అయ్యే సీన్స్ ను రాసుకుంటాడు. కానీ.. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో మాత్రం దర్శకుడు అలా ఆలోచించలేదు. ఒక వేళ ఆ ఇద్దరికీ ఇగో క్లాషెస్ వస్తే .. దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే పాయింట్ ను కాన్ఫ్లిక్ట్ గా తీసుకొని .. దానికి తగ్గ రీతిలో మంచి సీన్స్ రాసుకున్నాడు. ఈ విషయంలో అతడి థాట్ ను మెచ్చుకోవాల్సిందే. అందుకే ఈ సినిమా ను తెలుగులో రీమేక్ చేసుందుకు ప్రముఖ నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎక్కడ చూడాలి ?: అమెజాన్ ప్రైమ్
నటీనటులు : పృధ్విరాజ్ సుకుమారన్, సురాజ్ వెంజారమూడ్, మియా జార్జ్ , మేజర్ రవి, సైజు కురుప్పు, సురేశ్ కృష్ణ, లాలు అలెక్స్, నందు , సలీమ్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు : సంగీతం: ఎగ్జన్ గ్యారీ పెరీరా, నేహా నాయర్, ఛాయాగ్రహణం : అలెక్స్ జె పులిక్కల్.
నిర్మాణం : సుప్రియా మీనన్, లిస్టన్ స్టీఫెన్
భాష : మలయాళం
రేటింగ్ : 3.5 / 5