చెప్పాలని ఉంటుంది.. మనసు విప్పాలని ఉంటుంది.. ఈ డిజిటల్ యుగంలో అలా మనసు విప్పితే ఏం జరుగుతుంతో ప్రత్యేకించి చెప్పేదేముంటుంది. చేతిలోకి సెల్ తీసుకుని ఎడాపెడా నొక్కేస్తారు.. ఆ తర్వాత ఎరక్కపోయి నొక్కాను ఇరుక్కుపోయాను అనుకుంటారు. మన జీవితం తెరిచిన పుస్తకం.. సారీ.. లాక్ తీసిన సెల్ ఫోన్.. అంటే నమ్మండి. ఛాటింగులు డేటింగులతో ప్రారంభించి శఠగోపం పెట్టించుకున్న సంఘటనలు అనేకం. ఈ మధ్యే ఓ వార్త వైరల్ అయ్యింది. మసాజ్ చేయించుకోడానికి ఓ పార్లర్ కు వెళ్లి ఆ మాసజ్ చేసిన యువతి భంగిమలన్నిటినీ ఓ యాప్ ద్వారా వీడియో రికార్డింగు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. అన్నీ ఆన్ లైన్ లోనే దొరకుతున్నాయనుకున్నప్పుడు జనానికి వేరే లైనెందుకు.
డేటా ఎంతవరకు పదిలం
మీ మనసులో ఉన్నంత వరకే మీ డేటా భద్రం.. మనసు దాటి బయటికి వచ్చిందంటే అది ఎక్కుడుంటుందో ఎవరికీ తెలియదు. ముక్కూ మొహం తెలియని వ్యక్తికి మీరు ఏదో పని ఉండి ఫోన్ చేస్తారు.. మాట్లాడి ఫోన్ చేశాక ఆ వ్యక్తి పేరు మీ ఫేస్ బుక్ ఖాతాలో ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకునే సజెషన్స్ లో కనిపిస్తుంది. ఇదెలా సాధ్యమబ్బా అనిపిస్తోంది కదూ. అదే డిజిటల్ యుగం మహిమ. మీ ఫోన్ నంబర్లు, మీ మెయిల్ ఐడీలు, మీ సోషల్ మీడియా ఖాతాలు.. ఇలా అన్నీ ఎందరికో తెలిసిపోతుంటాయి.
ఇక మీ జీవితం తెరిచిన పుస్తకం కాకుండా ఎలా పోతుంది. మన జీవితాలను ఉద్దరించడానికి మీరు వచ్చాయనుకుంటున్న యాప్ లు మీ సమాచారాన్నంతా తస్కరిస్తున్నయన్న సంగతి ఎందరికి తెలుసు. కొత్త ప్రైవసీ పాలసీ విధానం వాట్సాప్ ను ఎలా చుట్టుముట్టిందో అందరికీ తెలుసు. దాంతో జనం వాట్సాప్ కు గుడ్ బై చెప్పేయడానికి సిద్ధపడ్డారు. వాట్సప్ లోని జనం ఒక్కసారిగా ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టిసారించారు. సిగ్నల్, టెలిగ్రామ్ ల డౌన్ లోడ్లు పెరిగిపోయాయి. దాంతో తన నిర్ణయాన్ని వాట్సాప్ ఉపసంహరించుకుంది. జనం కూడా హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారనుకోవడం కూడా పొరపాటే. నిజానికి అప్పటిదాకా వాట్సాప్ లోనో మరో యాప్ లోనో ఉన్న సమాచారమంతా మరో చోటుకు చేరలేదన్న గ్యారంటీ ఏముంది.
ఇదంతా టెక్నికల్ ప్రపంచం. ఒకవిధంగా మన జీవితం వీధిన పడినట్టుగానే భావించాలి. మనం ఎంతటి మేధావులమంటే ఒకదాని మీద విమర్శలు వస్తే ఇంకోదాన్ని తెచ్చుకునే పరిస్థితి. అది కూడా ఎంతవరకు జన్యూన్ అనేది తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయం. ఈ తరహా యాప్ లు లేకపోతే మన జీవితం శూన్యం అయిపోతోందనే భావన కలుగుతోంది. నిజానికి ఈ యాప్ లన్నీ మనకు సేవ చేసి తరించడానికి వచ్చిన సంస్థలైతే కచ్చితంగా కావు. ఎవరి స్వలాభం వారిది. మన రాతలు, మన మాటలు, మన వీడియోలు, మన ఫొటోలు ఖండాంతరాలు దాటిపోయినా ఆశ్చపోవాల్సిన పనిలేదు. ఒకటిపోయి ఇంకోటి రావడం చూస్తుంటే ముల్లు పోయి కత్తి వచ్చే పాట మాదిరి అనుకోవాల్సిందే. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడుంటాడు.
Must Read ;- ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్
జీ బలిసిపోతోంది
డిజిటల్ యుగంలో ‘జీ’ బలుపు ఎక్కువైంది. జి అంటే జనరేషన్ అని ప్రత్యేకించి చెప్పాలా. 2జీ, 3జీ, 4జీ, 5జీ.. ఈ జీ ఇక్కడితో ఆగేది కాదు కదా. ఈ జీ పెరిగేకొద్దీ మన జీవిత స్వరూపమే మారిపోతోంది. టోటల్ గా తేలిందేమంటే మన జీవితం మన చేతుల్లో లేదు.. మన చేతిలోని సెల్ ద్వారా ఎక్కడెక్కడికో పోతోంది. ఒకప్పుడు ప్రేమ లేఖలతో బ్లాక్ మెయిల్ చేసే సినిమాలు వచ్చాయి.. ఇప్పుడు మన డేటా చాలు మన ఎంత సేఫ్ జోన్ లో ఉన్నామో. సమాచార మార్పిడి ఏ స్థాయిలో జరుగుతోందంటే.. మనం నాలుగు గోడల మధ్య సంసారం చేసినా అది బహిర్గతం అయ్యే రోజు మరెంతో దూరంలో లేదు అన్నంతగా మార్పు జరిగింది. సోషల్ మీడియాకి జనం బానిసలుగా మారిపోతున్నారు.
డేటాను నమ్ముకోవలసింది పోయి అమ్ముకుని బతికే వారు కూడా పెరిగిపోయారు. సైబర్ ప్రపంచంలో ఎవడు తోపో వాడే కింగ్ అవుతున్నాడు. కాల్ రికార్డింగ్ ఫెసిలిటీ లేదని మనం అనుకుంటున్నాం.. ఇంత చేయగలిగిన వాళ్లం ఈ చిన్న రికార్డింగ్ అసాధ్యం ఎలా అవుతుంది. ప్రతి వీడియో కాల్ రికార్డు చేసే సౌలభ్యం ఉంది. తాజాగా ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ కూడా రంగ ప్రవేశం చేసింది. మన మెదళ్లు తుప్పు పట్టేరోజు మరెంతో దూరంలో లేదు. చివరికి రోబో సినిమా మాదిరిగా మనం తయారు చేసిన టెక్నాలజీ మనల్ని మింగేసే రోజులు మరెంతో దూరంలో లేవని అనిపిస్తోంది. ఈ భూమ్మీద మనుషులు పోయి యంత్రాలే మిగిలినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
కరోనా లాంటి వైరస్ లను అరికట్టలేని టెక్నాలజీ మనకు అవసరమా అని ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. సాధారణ ఫోన్ కాల్ మాట్లాడాలంటే భయం.. ఎక్కడ రికార్డ్ అవుతుందోనని, నేరుగా కలిసి మాట్లాడటం తప్ప మరో మార్గం లేదేమో. ఇంకా చెప్పాలంటే అలా కలిసి మాట్లాడినా ముందుగా అంతా తనిఖీ చేసి చర్చల్లో కూర్చోవాల్సిందేనేమో. ఫోన్ మాట్లాడాలంటే భయం.. ఛాటింగ్ చేయాలంటే భయం.. మనిషిని నేరుగా కలవాలంటే భయం.. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోమంటోంది ఓ పక్క కరోనా. మనిషి అలా కూర్చోలేడు కదా.. ప్రేమ ఎంత మధురం అని ఫోన్ పట్టుకుని పాడుకునే బదులు మీ డేటా ఎంత పదిలమో ఓసారి చూసుకోండి. మౌనవ్రతం అనేది ఒకటుంది.. అన్నీ మూసుకుని కూర్చోవడమే ఈ మౌన వ్రతం.. బహుశా భవిష్యత్తులో అందరూ ఆచరించే వ్రతం ఇదేనేమో.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- కోవిన్ యాప్స్ మొరాయింపు.. ఏపీలో పలు చోట్ల మొదలుకాని వ్యాక్సినేషన్..