సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ మూవీని జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మహర్షి సినిమా తర్వాత మహేష్.. మరో కథ రెడీ చేయ్ మనం కలిసి మరో సినిమా చేద్దామని డైరెక్టర్ వంశీ పైడిపల్లికి చెప్పారు. వంశీ కథ రెడీ చేయడం.. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు ఓకే అనడం కూడా జరిగింది. అంతా ఓకే ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది అనుకుంటుండగా.. కథ పూర్తి స్ధాయిలో సంతృప్తినివ్వలేదని మహేష్ నో చెప్పారు.
అప్పటి నుంచి మహేష్ తో సినిమా చేయడం కోసం వంశీ పైడిపల్లి కథ రెడీ చేయిస్తూనే ఉన్నారు కానీ.. సరైన స్టోరీ సెట్ కాలేదు. దీంతో మహేష్.. పరశురామ్ తో ‘సర్కారు వారి పాట’కు ఓకే చెప్పడం జరిగింది. మహేష్ నో చెప్పడంతో వంశీ పైడిపల్లి రామ్ చరణ్ తో సినిమా చేయాలి అనుకున్నారు. చరణ్ కి కూడా కథ చెప్పడం జరిగింది కానీ.. అక్కడ కూడా సేమ్. స్టోరీ పూర్తి స్ధాయిలో సంతృప్తినివ్వకపోవడంతో సెట్ కాలేదు. దీంతో వంశీ పైడిపల్లి ఆహా కోసం వెబ్ సిరీస్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. వంశీ పైడిపల్లి మహేష్ కోసం ఈసారి ఫుల్ మాస్ స్టోరీ రెడీ చేసారట. ఇందులో మహేష్ రౌడీ క్యారెక్టర్ చేయనున్నారని. ఈ స్టోరీకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఫర్ ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండేలా క్యారెక్టరైజేషన్ ఉంటుందట. మహేష్ పోకిరి తర్వాత ఆ రేంజ్ మాస్ క్యారెక్టర్ చేయలేదు. మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అలాంటి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్ ‘స్టేట్ రౌడీ’ ని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఇదే టైటిల్ తో శివాజీ హీరోగా ఒక సినిమా వచ్చింది. కానీ అది ఘోరపరాజయం పాలైంది. అలాగే.. మహేశ్ వంశీ పైడిపల్లి గత చిత్రం ‘మహర్షి’ కూడా ఓల్డ్ టైటిలే అన్న సంగతి తెలిసిందే. మరి.. మహేష్ నిజంగానే వంశీ పైడిపల్లి స్టోరీకి ఓకే చెప్పారా..? అదే.. నిజమైతే.. ఈ స్టోరీకి స్టేట్ రౌడీ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారా..? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- మహేష్ ‘సర్కారు వారి పాట’ స్టోరీ ఇదేనా.?