Mega Failure In Maa Election
మంచి మైక్ లో చెప్పండి.. చెడు చెవిలో చెప్పండి.. ఇదీ ‘మెగా’ సూక్తి ముక్తావళి. ఇది ఎవరికీ వంటబట్టినట్టు లేదు అందుకే పెడచెవినపెట్టి మరీ ‘మా’ ఎన్నికల్లో రెచ్చిపోయారు. బాహుబలి కావాల్సిన వారు బలిపశువుగా మారిపోయారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి హోరాహోరీ పోరు సాగితే మంచు విష్ణు గెలుపొందారు, ప్రకాష్ రాజ్ ఓటమి పాలయ్యారు. ఓటమికి కారణాలపై ఇప్పుడు పోస్టుమార్టమ్ నిర్వహించాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్తులో కొన్ని తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగానే పోస్టుమార్టం నిర్వహించాల్సిందే. ముఖ్యంగా ఓటమి అనేది దగా కాదు.. అది మెగా వైఫల్యం అనే చెప్పాలి. సినిమా పెద్దరికం అనే బరువు బాధ్యతల్ని మోయడం అంత సామాన్యమైన విషయం కాదు.
కాయలున్న చెట్టుపైనే రాళ్లు పడతాయి. ప్రకాష్ రాజ్ ను మెగా ప్యానల్ అభ్యర్థిగా నిలబెట్టడం ఓ మెగా తప్పిదం. ఆ స్థానంలో ఏ శ్రీకాంత్ నో నిలబెట్టినా ఇంకా మంచి ఫలితం వచ్చి ఉండేది. అనవసరంగా ప్రకాష్ రాజ్ మీద నాన్ లోకల్ అనే ముద్ర కూడా పడింది. ఇప్పుడు ఓడింది ప్రకాష్ రాజా? మెగాస్టారా? అంటే అందరూ మెగాస్టార్ అనే అంటున్నారు. ప్రకాష్ రాజే మెగాస్టార్ ను ఓడించారని కూడా అంటున్నారు.
ఎప్పుడూ పెద్దరికం వహించే వ్యక్తి వాయిస్ బయటికి రాకూడదు. మెగాసోదరుడు నాగబాబు తన వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పవచ్చుగానీ దాన్ని మెగాస్టార్ వాయిస్ గానూ చెప్పి ఉండకూడదు. ప్రకాష్ రాజ్ ను బలిపశువును చేశారనే మాట వినిపిస్తోంది. ఆయనను అంతలా ఎగదోసి కనీసం ఇంట్లో ఓట్లు కూడా వేయించలేకపోయారనే నింద కూడా పడుతోంది. ఇలా దెబ్బ కొట్టడం వీరికి కొత్తకాదనే ప్రచారం కూడా సోషల్ మీడియా వేదికగానూ చేస్తున్నారు.
‘మెగా’ లీడర్ షిప్ లో లోపముందా?
ఇతర విషయాల్లో వేలు పెట్టకుండా సినిమాలే చేసుకుంటూ వెళితే మెగా ఫ్యామిలీకి ఎలాంటి ఢోకా లేదు. వీరికి అర్థబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. ఏ బలాన్ని ఎప్పుడు ఎలా వాడాలో తెలియకపోవడం వల్లే ఈ వైఫల్యాలు అనే వాదన ఉంది. ప్రత్యర్థుల బలాన్ని అంచనా వేయడంలోనూ వైఫల్యం కనిపిస్తోంది. ఆవేశం ఉంటోందికానీ ఆలోచన ఉండటం లేదు. సమయం, సందర్భం చూసుకుని ప్రత్యర్థులపై దాడికి దిగాలి తప్ప అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు.
రాజకీయం అనేది ఓ చదరంగం. ఇప్పుడు చెద పట్టిన రంగం. అవతలి వాడు ఎత్తు వేసే లోపే మనం చెక్ పెట్టగలగాలి. అలా పెట్టలేకపోవడం వల్లే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా విజయవంతం కాలేకపోయారు. ఈరోజు మా ఎన్నికల్లోనూ అది మరోసారి రుజువైంది.
అందరూ వెళ్లే దారిలో ఎందుకు?
అందరూ వెళ్ళేదారిలో మనం వెళ్ళకూడదు.. వ్యతిరేక దారిలో వెళ్ళాలి. ఓట్లు అడిగే విషయంలో ఈ చిన్న విషయాన్ని మెగాప్యానల్ గుర్తించలేకపోయింది. దీన్నే పోల్ మేనేజ్ మెంట్ అంటారు. ఒక పెద్ద హీరోని ఓటు అడిగి రప్పించడం కన్నా పదిమంది చిన్న నటులను పోలింగ్ బూత్ కు తీసుకురావడం తేలికైన పని. అదే మంచు విష్ణు ప్యానల్ చేయగలిగింది. విజయం దరి చేరింది. ఇక్కడ కావాలసింది యూట్యూబ్ వీడియోల ద్వారా అరుపులు కాదు ఓట్లు రాబట్టగలిగే మెరుపులాంటి చర్యలు.
ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతోనే మెగా కోటకు బీటలు వారాయి. ప్రకాష్ రాజ్ చాలా తెలివైన వాడు. మంచి మాటకారి. కానీ ఆదిలోనే హంస పాదులాంటిది ఆయన ఇచ్చిన ఉపన్యాసం. ‘మా సభ్యులు 900 మంది కాదు. అందులో 150 మంది యాక్టివ్ గా లేరు. 175 మంది స్థానికంగా ఉండరు. షూటింగుల కోసం వచ్చి వారి ఊళ్లకు వెళ్లిపోతారు. వచ్చి ఓటు వేయరు. మాజీ సీఎం కొడుకుని పెళ్లి చేసుకున్న జెనీలియాకు వచ్చి ఓటేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్లలో పెద్ద హీరోలకు ఓటు వేయాల్సిన అవసరం లేదు.
200 మంది సభ్యులు ఆర్థికంగా బాగున్నారు. వీరిందరినీ మినహాయిస్తే మిగిలింది 250 మంది. వీరిని ఆదుకోలేమా’ అన్నది ప్రకాష్ రాజ్ వాదన. ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెత మనకు ఉండనే ఉంది. విభీషణుడు వచ్చి లంక గుట్టంతా బయటపెట్టబట్టే కదా రావణుడికి మూడింది. ప్రకాష్ రాజ్ ఏ మాటలైతే మాట్లాడారో వారి మీదనే మంచు ప్యానల్ దృష్టి పెట్టింది. అందరినీ తీసుకొచ్చి మరీ ఓటు వేయించగలిగింది. మంచు విజయ రహస్యం ఇదే. స్థానికేతరులను పోస్టల్ బ్యాలెట్ల ద్వారా లాక్కొచ్చారు. జెనీలియా లాంటి వాళ్లకు ఫ్లైట్ టిక్కెట్లు కొని మరీ రప్పించగలిగారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే టైటిల్ కే చిక్కు వచ్చిపడింది. తమ గోతిని తామే తవ్వుకోవడమంటే ఇదే. ఆవేశం రాగానే పూనకం వచ్చిన వారిలాగా ఊగిపోతూ వీడియోలు విడుదల చేయడం అంత ఈజీ కాదు ఓట్లు సంపాదించగలగడం అనే సత్యాన్ని తెలుసుకోగలగాలి. ఆలోచనతో ముందడుగు వేయాలి. అప్పుడే మా అధికారం అయినా, రాజ్యాధికారం అయినా మెగా కుటుంబం వశమవుతుంది. అప్పటిదాకా అది ఎండమావే.. ఎండిపోయిన బావే. అంతేకాదు అది మెగా తార అయినా చుక్కలు కనిపిస్తాయి. చిక్కుల్లోకి నెట్టేస్తాయి.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- మెగా ఓటమికి ఇదే ‘జీవిత’ సత్యం