సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే అదో క్రేజ్. ఇప్పుడు పెద్దన్నగా జనం ముందుకు రజనీకాంత్ వచ్చారు. తమిళంలో ‘అన్నాత్తే’ గా సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో పెద్దన్నగా అందించారు. భారీతారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడు శివ ఈ సినిమాకి ఎంతవరకు న్యాయం చేశారు? లాంటి అంశాలను చూద్దాం.
కథలోకి వెళితే..
కథ కలకత్తాలో ప్రారంభమైనా అసలేం జరిగిందో చెప్పడం కోసం వీరన్న (రజనీకాంత్) సొంతూరుకు వెళుతుంది. తల్లీతండ్రి చనిపోతే చెల్లెలు కనకమహాలక్ష్మి( కీర్తి సురేష్)ని అన్నీ తానై పెంచుతాడు వీరన్న. ఆమెకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు అన్న ఇష్టమే తన ఇష్టమని కూడా చెల్లెలు అంటుంది. చెల్లెలి ఆనందం కోసం పరితపించే అన్నకు తన ప్రేమ విషయాన్ని చెల్లి చెప్పదు. కథను మలుపు తిప్పడం కోసం తప్పదు మరి. తీర పెళ్లి సమయం దగ్గరపడే సరికి చెల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆమె ఎవరితో వెళ్లింది? అక్కడ ఏం జరిగింది? చెల్లిని రక్షించడానికి ఈ అన్న ఏంచేశాడు అన్నదే ప్రధానంగా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
పాత కథను తీసుకుని కొత్తగా చూపించాలనుకునే ప్రయత్నం బాగానే ఉన్నా నూటికి నూరు శాతం న్యాయం చేయడంలో మాత్రం దర్శకుడు కాస్త తడబడ్డట్టుగానే భావించాలి. సినిమా ప్రథమార్థమంతా వినోదాత్మకంగా మలిచారు. ఖుష్బు, మీనాలాంటి పాత్రలను కావాలనే కథలో చొప్పించిన భావన కలుగుతుంది. అలాగే ప్రకాష్ రాజ్ పాత్ర కూడా. ప్రథమార్థంలో కనిపించే పాత్రలన్నీ ద్వితీయార్థంలో మాయమైపోతాయి. కేవలం అన్న, చెల్లి మధ్యలో ఓ లాయర్ (నయనతార)లతోనే కథంతా సాగుతుంది.
ఇలాంటి చెల్లిలి సెంటిమెంటు కథలు గతంలో చాలా వచ్చాయి. కొత్త కథలు దొరక్క దర్శకుడు దీన్ని ఎంచుకున్నాడని అనుకోవాలి. పోనీ ఆ పాత కథకు న్యాయం చేశాడా అంటే పూర్తిగా లేదనే చెప్పాలి. తనను ఎంతగానే ప్రేమించే అన్నకు చెల్లి తన ప్రేమ విషయాన్ని చెప్పలేకపోవడం ఇందులో ప్రధాన లోపం. కథను నడపాలి కాబట్టి దర్శకుడు అలా చేశాడని ప్రేక్షకులు సరిపెట్టుకోక తప్పదు. ఇక వీరన్నగా రజనీకాంత్ 70 ఏళ్ల వయసులో మంచి ఎనర్జీతో నటించారు.
ఆయన స్టామినా చూస్తుంటే మరో రెండు సినిమాలు ఈజీగా చేసేయవచ్చని అనిపిస్తుంది. కేవలం ఒంటి చేత్తో ఈ సినిమాను మోశారని చెప్పక తప్పదు. ఇక కనకంగా కీర్తిసురేష్ చక్కగా నటించింది. మహానటి తర్వాత అంతలా పేరు తెచ్చే పాత్ర అవుతుంది. భావోద్వేగాలను పండించడంలో ఆమె తనదైన ప్రతిభను కనబర్చింది. కాకపోతే మోతాదు మించిన వినోదం, అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్, శ్రుతిమించిన సిస్టర్ సెంటిమెంట్ ను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్నది వేచి చూడాలి.
ముఖ్యంగా పాటల పరంగా సినిమా వీక్ అనే చెప్పాలి. రెండు పాటలు మినహా చెప్పుకోతగ్గ అవకాశం వాటికి లేదు. సినిమా ఆసాంతం బోర్ కొట్టకుండా తీయడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. విలన్ గా జగపతి బాబు పాత్రను గెటప్ తోనే భయపెట్టేలా చూపించారు. విలన్ పాత్రలను మలిచిన తీరు కూడా లోపభూయిష్టంగా ఉంది. పంచ్ డైలాగులు, రజనీ మార్క్ స్టయిల్ తోనే కథను నడిపారు. రొటీన్ కథను కూడా భిన్నంగా చెప్పాలనే ప్రయత్నం మాత్రం కనిపించింది. మరి ఈ కథకు, కథనానికి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అవుతారన్నది చూడాలి.
నటీనటులు: రజనీకాంత్, కీర్తి సురేష్, నయనతార, ఖుష్బూ, మీనా, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితరులు
సాంకేతికవర్గం: సంగీతం: డి. ఇమ్మన్, సినిమాటోగ్రఫీ : వెట్రీ, ఎడిటింగ్: రూబెన్
నిర్మాతలు: నారాయణదాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు
నిర్మాణం: సన్ పిక్చర్స్
కథ-స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శివ
విడుదల తేదీ: 04-11-2021
ఒక్క మాటలో: వన్ మ్యాన్ విత్ సిస్టర్ షో
రేటింగ్: 2.75/5