కరోనా తర్వాత సినిమా థియేటర్లకు కొత్త కళ ‘సోలో బ్రతుకే సోలో బెటర్’ సినిమాతోనే వచ్చింది. సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. 50 శాతం సీట్ల ఆక్కుపెన్సీతోనే అయినా జనం నుంచి మంచి స్పందన లభించింది. ప్రతి సీటుకూ సీటుకూ మధ్య ఓ సీటును ఖాళీగా ఉంచినా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఒక విధంగా ఇది శుభారంభం అనుకోవాలి. నిన్న ‘మర్దర్’ సినిమా విడుదలైనా ఓ పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా రూపొందిన ‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమాతోనే థియేటర్లకు కళ వచ్చిందని చెప్పాలి. సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళతే..
ప్రేమ, పెళ్లి వద్దు.. సోలోగా బతకడమే మంచిదనే చెప్పే యువకుడి కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. విరాట్ (సాయిధరమ్ తేజ్) ఇలాంటి పాలసీతో కాలేజీ యువతను అందరినీ తన వైపు తిప్పుకుంటాడు. అందరిలోనూ తన బీజాలనే నాటుతుంటాడు. ప్రేమ, పెళ్లి ఎందుకు వద్దో 108 శ్లోకాలు (కొటేషన్లు అనుకోండి) ఓ పుస్తకాన్ని కూడా రాసి అందరికీ పంచుతుంటాడు. అతని మిత్రబృందం కూడా అతనికి వంత పాడుతుంటారు. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో తమ కుమారుడు ఇలా తయారయ్యాడేంటని తల్లిదండ్రులు( సీనియర్ నరేష్, కళ్యాణి నటరాజన్) కూడా జీర్ణించుకోలేకపోతారు. తను ఉండే వైజాగ్ నుంచి హైదరాబాద్ కు మిత్ర బృందంతో వెళతాడు.
ఈవెంట్ మేనేజ్ మెంట్ చేసుకుంటూ ఉంటాడు. విరాట్ ఇంటి యజమాని కుమారుడు గోవిందు (వెన్నెల కిషోర్) పెళ్లి చేసుకోబోతుంటే ఆ పెళ్లిని కూడా చెడగొడతారు. ఆ తర్వాత అతని మిత్రులంతా పెళ్లిళ్ల పేరుతో అతనికి దూరమై పోతారు. విరాట్ ఇలా మారడానికి సగం కారణం అతని మేనమామ వేణు (రావు రమేష్) కూడా కొంత కారణం. అలాంటి విరాట్ ను మరో సారి గోవిందు తన పెళ్లికి తీసుకెళతాడు. అక్కడ పెళ్లి కూతురు అమృత(నభా నటేష్) గోవిందును పెళ్లి చేసుకోనని, తను ఇంకో వ్యక్తిని ప్రేమించానని ఆ పెళ్లికి వచ్చిన విరాట్ ను చూపిస్తుంది.
ఇక్కడ కథకు మరో ట్విస్ట్. ప్రథామార్థమంతా వినోదాత్మకంగా దర్శకుడు కథని మలిచాడు. ద్వితీయార్థంలో మాత్రం కథనంలో వేగం మందగించింది. కామెడీ పరిధి తగ్గిపోయింది. అమృత విరాట్ ను ప్రేమించానని ఎందుకు చెప్పింది? దాని వెనక ఉన్న కథ ఏమిటి? ప్రేమ, పెళ్లి తన జీవితంలో వద్దని అనుకున్న విరాట్ లో వచ్చిన మార్పు ఏమిటి అనేదే ఈ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా. నేటి జనరేషన్ తగ్గ కథను ఎంచుకుని దానికి న్యాయం చేయడంలో దర్శకుడు మంచి మార్కలు కొట్టేశాడు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
విరాట్ కు ఫలానా క్యారెక్టరైజేస్ అని దర్శకుడు అనుకున్నప్పుడు అందుకు దారితీసిన కారణాలు చెప్పి ఉంటే బాగుండేది. పెళ్లి, ప్రేమ అంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పలేకపోయారు. కేవలం మామయ్య మాటల ద్వారానే అతను అలా మారాడని అనుకోడానికి వీలు లేదు. మామయ్య పాత్ర అందులో కొంత వరకే. ఇతర పాత్రల విషయంలోనూ దర్శకుడు అది మిస్ అయ్యాడనిపించింది. గోవిందుగా వెన్నెల కిషోర్ క్యారెక్టరైజేషన్ బాగా పండింది. ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, సత్యల నటనతో కామెడీని దర్శకుడు బాగా పండించగలిగాడు. సెకండాఫ్ లో మాత్రం వినోదం తగ్గింది. దర్శకుడిగా సుబ్బు తన తొలి ప్రయత్నంలోని చాలావరకు విజయం సాధించాడని మాత్రం చెప్పవచ్చు.
ముఖ్యంగా నటీనటుల నుంచి నటనను రాబట్టడంలోనూ, కథనంలోనూ తన గ్రిప్ ఎలాంటిదో చూపించాడు. వినోదాన్ని చక్కగా పండించగలిగాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్.. బోలో బోలో బ్యాచ్ లర్’, ‘నో పెళ్లి.. దీన్ తల్లి’ పాటలు, చిత్రీకరణ ఆకట్టుకుంది. ముఖ్యంగా విరాట్ గా సాయి ధరమ్ లో మరో కొత్త నటుడు కనిపించాడు. పాత్రలోని వేరియేషన్స్ ను బాగా చూపించగలిగాడు. ప్రతి రోజూ పండగే తర్వాత అతని ఖాతాలోకి మరో హిట్ చేరినట్టే. రావు రమేష్, రాజేంద్రప్రసాద్, నరేష్ లాండ్ మంచి ప్యాడింగ్ ఉన్నా వారిని సరిగా ఉపయోగిించుకోలేకపోవడం ఒక లోపం.
ఇక నభా నటేశ్ విషయానికి వస్తే అమృత పాత్రతో మరో సారి మంచి మార్కులు కొట్టేసింది. ప్రథమార్థంలో అమృత కనిపించకపోవడం పెద్ద లోటుగా చెప్పాల్సిందే గానీ కథ అక్కడ ఆ పాత్రను డిమాండ్ చేయలేదు. అందుకే ఆమె పాత్ర ద్వితీయార్థానికే పరిమితమైంది. అమృత తండ్రిగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ మరో సారి తనలోని మంచి నటుడిని ఆవిష్కరించారు. పాత్ర పరిధి తక్కువే అయినా ఆ పరిధుల మేరకే నటించారు. ప్రధానంగా ఇది హీరోహీరోయిన్ల చుట్టూ తిరిగే కథ. తమన్ పాటలు, రీరికార్డిగ్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అనొచ్చు.
హైలైట్స్:
వినోదాత్మకంగా చెప్పిన ఈ కథలో అంతర్లీనంగా ఓ సందేశం ఉంది. ముఖ్యంగా నేటి యువతకు ఇది ఓ సందేశం అనుకోవచ్చు. ఒంటరితనంలో ఉండే లోటు ఏమిటో తెలియజెప్పే ప్రయత్నానికి దర్శకుడు తెలియజెప్పాడు. సోలో బ్రతుకు పనికొచ్చేది కాదని, జీవితంలో అన్నీ ఉంటేనే ఆ బ్రతుకులో ఓ సోల్ ఉంటుందని చెప్పగలిగారు. డైలాగులు సినిమాకి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా సోలో బ్రతుకు ఎందుకు అవసరమో దానికి తగ్గట్టుగా కన్విన్సింగ్ గా డైలాగులు రాయగలిగారు.
నటీనటులు : సాయిధరమ్ తేజ, నభానటేశ్, రాజేంద్ర ప్రసాద్ , రావు రమేశ్, వెన్నెల కిషోర్, నరేశ్ , అజయ్ , సత్య, కళ్యాణి నటరాజన్ తదితరులు
సంగీతం : యస్.యస్.తమన్
సినిమాటోగ్రఫీ : వెంకట్ సి దిలీప్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర
నిర్మాత : బివి యస్ యన్ ప్రసాద్
దర్వకత్వం: సుబ్బు
విడుదల తేదీ : 25, డిసెంబర్ 2020
ఒక్క మాటలో: మంచి సోల్.. అంతకన్నా మంచి ఫీల్ ఉన్న సినిమా.
రేటింగ్: 3.5/5
– హేమసుందర్ పామర్తి