ఆంధ్ర ప్రదేశ్ లో నాసిరకం మరియు ప్రాణాంతకమైన మద్యం సరఫరా చేస్తున్నారంటూ మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న కల్తీసారా మరణాలు సహా ఏపీలో సరపరా అవుతోన్న మద్యం నాణ్యతపై చర్చ జరపాలని ఎమ్మెల్సీలు కోరారు.ఛైర్మన్ కి అందజేసిన లేఖతో పాటు మద్యం పై వచ్చిన ల్యాబ్ నివేదికకలను వారు జత చేశారు. సారాక్షసి, జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉభయ సభల్లో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జే బ్రాండ్లలో ప్రజలు ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఆరోపించారు.కేవలం వారం రోజుల్లోనే జంగారెడ్డి గూడెంలో 28 మందికి పైగా కల్తీసారాకి బలైపోయారని తెలిపారు. ఇక ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ జే బ్రాండ్ ప్రమాదకర మద్యం తాగిన వారు ఇంకా చికిత్స పొందుతున్నారన్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని, మద్య నిషేధం హామీతో అధికారంలోకొచ్చిన ప్రభుత్వమే మద్యం వ్యాపారం ఆరంభించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా సుమారు 24 వేల కోట్ల రూపాయలు మద్యంపై ఆదాయం రాబడుతోందన్నారు. పిచ్చిమద్యం అధిక ధరలకి అమ్ముతుండడంతో నిరుపేదలు సారాకి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారని వారు లేఖలో పేర్కొన్నారు.
Must Read:-టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు