అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా రూపొందిన సినిమా ఊర్వశివో రాక్షశివో. తమిళంలో 2018లో వచ్చిన ఫ్యార్ ప్రేమ కాదల్ ఆధారంగా దీన్ని పునర్నించారు. గీతా ఆర్ట్స్ తో కలిసి తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. దీనికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
చూపులు కలిసిన ప్రేమకథ ఇది. ఈ ప్రేమ ఇరుగు పొరుగు ఆఫీసుల్లో పుడుతుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మధ్యతరగతి యువకుడు శ్రీ (అల్లు శిరీష్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆ ఆఫీసుకు పక్కనే ఉన్న ఇంకో ఆఫీసులో సిందు ( అను ఇమ్మానుయేల్) పనిచేస్తుంటుంది. ఆఫీసు కిటికీలో నుంచి సింధును అదే పనిగా చూస్తుంటాడు శ్రీ. అలా ఆమెతో ప్రేమలో పడిపోతాడు. వన్ సైడ్ లవ్ అన్నమాట. ఆమె ఆ తర్వాత శ్రీ పనిచేసే ఆఫీసులోనే ఉద్యోగంలో చేరుతుంది. ఆమెను పరిచయం చేసుకోడానికి అతను నానా తంటాలు పడుతుంటాడు. లిఫ్ట్ లో వెళ్లేటప్పుడు ఓ చిన్న సంఘటనతో ఇద్దరూ దగ్గరవుతారు. అతను పెళ్లి చేసుకుందామంటే ఆమె సహజీవనం చేద్దామంటుంది. చివరికి సహజీవనానికి ఫిక్స్ అవుతారు. వీరి కథ ఇలా సాగుతుంటే శ్రీకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తారు. అతనికి ఎవరూ నచ్చరు. పోనీ సింధును పెళ్లి చేసుకుందామంటే ఆమె ససేమిరా అంటుంది. చివరికి వీరి సహజీవనం ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ సినిమా కథ. దీన్ని వినోదాత్మకంగా దర్శకుడు మలిచాడు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
యువతను టార్గెట్ గా చేసుకుని తీసిన సినిమా ఇది. ముఖ్యంగా నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉంటుంది. మధ్య తరగతి ఆలోచనా విధానం, మోడ్రన్ థింకింగ్ కలగలుపుగా సినిమా ఉంటుంది. దర్శకుడు రాకేష్ శశి తన కలం బలంతో సినమాని నడిపారు. వినోదం పాళ్లు ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. దర్శకుడిగా అతనికి ఇది రెండో సినిమా. పాత్రకు తగ్గ నటులు అతనికి దొరికారు. వినోదం పండింది. కొన్ని సన్నివేశాల్లో కడుపుబ్బ నవ్వించాడు. అదే ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. సంభాషణలు బాగా పేలాయి. దర్శకుడికి, హీరో హీరోయిన్లకి మంచి బ్రేక్ ఇచ్చే సినిమాగా చెప్పొచ్చు. తనదైన టైమింగ్ తో వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. హీర్ ఫ్రెండ్ పాత్ర ఇది. సునీల్ మార్కు పంచ్ డైలాగులు కూడా ఉంటాయి. తల్లి పాత్రలో ఆమని ఒదిగిపోయింది. పోసాని కృష్ణ మురళి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవ్వించాడు. ఈ మధ్య కాలంలో వినోదాన్ని పండించిన చిన్న సినిమాల జాబితాలో ఈ సినిమా చేరిపోతుంది.
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్, ఆమని, కేదార్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, సునీల్ తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: అనూప్ రూబెన్స్ – రాజమణి, కెమెరా: తన్వీర్ మీర్.
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం. తమ్మారెడ్డి భరద్వాజ్
రచన- దర్శకత్వం: రాకేష్ శశి
విడుదల తేదీ: 04-11-2022
ఒక్క మాటలో: కామెడీ పండింది
రేటింగ్: 2.75/5