మిలియన్ల కొద్దీ వ్యూస్.. భజన చేసే రివ్యూస్.. దీని భావమేమి తిరుమలేశా? అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. సినిమా షూటింగ్ మొదలు ప్రీరిలీజ్ ఫంక్షన్ దాకా ప్రచార పటాటోపానికి కొదవే లేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ప్రచార పరిధి బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పీఆర్వో మాత్రమే ప్రచార వ్యవహారం మొత్తాన్ని పర్యవేక్షించేవాడు. ఇప్పుడు డిజిటల్ పీఆర్వో వ్యవస్థ అదనంగా వచ్చి చేరింది. సినిమా బడ్జెట్ లో ప్రచారానికి చేయాల్సిన బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం, హీరో పరిచయం, గ్లింప్స్, లిరికల్ వీడియోలు, టీజర్, ట్రైలర్.. ఇలా ఒక్కటేమిటి.. అనేక రకాలుగా ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వాటికి వచ్చే వ్యూస్ చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. మన కళ్లను మనమే నమ్మలేకపోతున్నాం. సాధారణ ప్రజలు, అభిమానులు తమ హీరోకి లభిస్తున్న ఆదరణ చూసి చంకలు గుద్దుకుంటూ ఉంటారు. నిజానికి దీని వెనక జరిగే తతంగం గురించి మాత్రం ఎవరికీ తెలియదు. పైసామే పరమాత్మా హై అంటాం చూశారా అలాగే పైసా మే వ్యూస్ హై అని కూడా అనుకోవలసి వస్తుంది. ఒక మిలియన్ వ్యూస్ సాధించాలంటే లక్ష నుంచి 2 లక్షల దాకా ఖర్చు చేయాల్సిందే.
పేరులో గ్రామ్ ఉన్నా ప్రచారంలో ఘనాపాటినని చాటుకుంటోంది ఇన్ స్టాగ్రామ్. ఫేస్ బుక్ ప్రచారం సరేసరి. గూగులమ్మను సంప్రదిస్తే చంకనేసుకుని జనంలోకి తీసుకెళ్లిపోతుంది. ఇక ట్విట్టర్ పిట్ట ఉండనే ఉంది కదా.. ఎట్టెట్టా అని మీకు కూడా అనిపిస్తోంది కదూ. ఇవన్నీ నమ్మలేని నిజాలే. ఒక వస్తువు మార్కెట్లోకి వస్తుందంటే ప్రచారానికి ఇంత అని బడ్జెట్ పెట్టుకోవాల్సిందే. సినిమా కూడా అలాంటి వస్తువే.
మిలియన్లకొద్దీ వ్యూస్
దాదాపు నాలుగైదేళ్లుగా సోషల్ మీడియా ప్రచారం స్పీడందుకుంది. సాధారణ మీడియా ప్రచారం కన్నా సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రచారం త్వరగా జనంలోకి వెళ్లిపోతుంది. అందుకే దీని మీద నిర్మాతలు కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇటీవల జనంలోకి ఎక్కువగా దూసుకెళ్లిన సినిమా నందమూరి బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’. ఇది 46 మిలియన్ల వ్యూస్ దాటిపోయింది. దాదాపు రెండు వారాల్లో ఈ ఘనతను సాధించడం విశేషం.
ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం అబ్బాయిని బాబాయ్ దాటబోతున్నాడని. అంటే జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ రామరాజు ఫర్ భీమ్ పేరుతో ఓ టీజర్ విడుదల చేశారు. దీనికి 50 మిలియన్ వ్యూస్ దాటిపోయాయి. కాకపోతే ఆరు నెలల వ్యవధిలో ఈ వ్యూస్ లభించాయి. బాబాయ్ బాలకృష్ణ మాత్రం రెండు వారాల వ్వవధిలోనే 50 మిలియన్ల వ్యూస్ కి చేరువయ్యారు. ఆ ప్రకారం చూస్తే బాబాయ్ ఈ అబ్బాయిని దాటడానికి ఇంకా ఎంతో సేపు పట్టదు.
ఇక మెగాస్టార్ ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’ టీజర్లు కూడా పోటీపడుతున్నాయి. ఆచార్య టీజర్ విడుదలైన రెండు నెలల్లో 20 మిలియన్ వ్యూస్ సాధించింది. అఖండ మాత్రం 50 మిలియన్లకు చేరువయ్యాయి. దాంతో చిరు ఫ్యాన్స్ ‘అఖండ’ వ్యూస్ ఫేక్ అనేలా ప్రచారం చేస్తున్నారు. రజినీ కాంత్ సినిమాల రికార్డులను కూడా అఖండ బ్రేక్ చేసేసింది. బాలయ్య సినిమాకు ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వ్యూస్ రావడం వెనక రహస్యం ఏమిటబ్బా అనే చర్చలు నడుస్తున్నాయి. బోయపాటి, బాలయ్య సినిమా అంటే క్రేజ్ ఉండే మాట మాత్రం వాస్తవం.
పైగా సింహా, లెజండ్ లాంటి రికార్డు ఉండనే ఉంది. ‘అఖండ’ సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే బిజినెస్ పరంగా కలిసొస్తుందన్న ఉద్ధేశంతో నిర్మాత కూడా కొంత బడ్జెట్ కేటాయించి ఉండటానికి కూడా ఆస్కారం ఉంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఇలాంటి వ్యూస్ పరంగా కొంత వెనకబడే ఉందని చెప్పాలి. అల్లు అర్జున్ మాత్రం పుష్పరాజ్ గా దూసుకుపోతున్నాడు. పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు. ఇది రెండు వారాల వ్యవధిలో 50 మిలియన్ల వ్యూస్ సాధించేసింది.
ఇన్ని వ్యూస్ ఉంటే సినిమా వసూళ్లు ఇంకెంత?
టీజర్లు, ట్రైలర్లు ఇన్ని వ్యూస్ సాధించేస్తుంటే సినిమా ఇంకెంత వసూలు చేయాలో కదా. చాలామందికి వస్తున్న సందేహం ఇదే. టీజర్లు, ట్రైలర్లు చూసిన వారంతా సినిమా చూస్తారని కూడా చెప్పలేం. ఒకవేళ చూస్తే ఆ సినిమా ఎంత వసూలు చేయవచ్చన్న అంచనా వేస్తే కళ్లు తిరిగిపోయే మొత్తం కనిపించింది. ఒక్క టిక్కెట్ ధర యావరేజ్ న వంద రూపాయలు అనుకుంటే 50 మిలియన్ల మంది చూస్తే 500 కోట్ల రూపాయలు వసూలు చేసి తీరాలి.
ఇప్పుడున్న వ్యూస్ ప్రకారం చూస్తే ఈ టీజర్లు సినిమా విడుదలయ్యే లోపు 100 మిలియన్ల వ్యూస్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంటే వెయ్యి కోట్ల రూపాయలన్నమాట. అంతకాకపోయినా 200 కోట్లు వసూలు చేసినా గొప్పే. మనమసలే లెక్కల్లో వీక్.. ఇంకా లోతుగా ఆలోచిస్తే డొక్క పగిలిపోద్ది. ఈ లెక్కల వెనక ఉన్న మతలబు ఏమిటంటే సినిమాని జనంలోకి తీసుకుపోవడమే అని మనకు అర్థమవుతోంది. కాబట్టి ఈ వ్యూస్ లో అసలు వ్యూస్ వేరయా అని అనుకోవాల్సి వస్తోంది. అంతా చదివి మరచిపోండి.. ఈ విషయం ఎక్కడా చెప్పవద్దు సుమా.
– హేమసుందర్
Must Read ;- అఆ.. అఖండ వర్సెస్ ఆచార్య