నిజమే… ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార వైసీసీ తన కండబలంతో ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు చేసుకుని సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో విపక్షాలు… ప్రధానంగా తెలుగు దేశం పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేస్తూ తనదైన శైలి దారుణాలకు పాల్పుడుతోంది. ఇలాంటి సమయంలో పార్టీ మద్దతుదారులకు అండాదండగా నిలవాల్సిన పార్టీ యువజన విభాగం తెలుగు యువత అధ్యక్షుడు గుండ్లపల్లె శ్రీరామ్ మాత్రం అత్తా పత్తా లేకుండా పోయారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వెరసి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని గుండ్లపల్లె ఆదిలోనే వమ్ము చేసుకుంటున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.
పార్టీ యువజన విభాగం చాలా కీలకం
మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ వ్యవస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి పార్టీకి సంబంధించి ఏపీ శాఖ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన చంద్రబాబు పలు ఇతర విభాగాలకు బాధ్యులను నియమించే పనిని మొదలెట్టేశారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ.. అధికార పార్టీ నేతల ఆగడాలను ఎక్కడికక్కడ నిలువరించే విషయంలో పార్టీ యువజన విభాగం చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. ఆ పదవికి సరైన నేత కోసం చంద్రబాబు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మొన్నామధ్య చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని అంగళ్ళులో వైసీపీ వర్గీయులు పార్టీ కీలక నేత నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నల్లారి వాహన శ్రేణితో పాటు మదనపల్లెలో యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న గుండ్లపల్లె శ్రీరామ్ వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని కిషోర్‌కుమార్‌రెడ్డి అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో చంద్రబాబు స్వయంగా గుండ్లపల్లెకు ఫోన్ చేసి నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఆరా తీయడంతో మదనపల్లె నియోజకవర్గంలో కీలక సామాజికవర్గానికి చెందిన నాయకుడని, ఆ వర్గంపై పట్టు కలిగి, నియోజకవర్గంలో విస్తృత పరిచయాలున్నాయని తెలియడంతో పార్టీలో అతడికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు. ఆ బాధ్యతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఈ విషయంలో జిల్లా టీడీపీలో స్వల్పంగా అభ్యంతరాలు తలెత్తినా స్వయంగా అధినేతే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగిపోయాయి. వెరసి గుండ్లపల్లె శ్రీరామ్ తెలుగు యువత అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
Also Read: బాబుపై జగన్ పగ ఫలితం.. కర్ణాటకకు టెస్లా కంపెనీ

గుండ్లపల్లె సొంత జిల్లా చిత్తూరులోనూ..
మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ అలియాస్ చినబాబుకు మదనపల్లిలో మంచి ఫాలోయింగ్ ఉంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఆ సామాజిక వర్గంతో పాటుగా పట్టణంలోని ఇతర సామాజిక వర్గాలకు చెందిన యువతపైనా పట్టుంది. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో వుండి మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఛైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి నల్లారితో పాటు టీడీపీలో చేరినప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా అతడికి పెద్ద ప్రాధాన్యత లభించలేదు. ఈ క్రమంలో అంగళ్లు ఘటనతో శ్రీరామ్ నేరుగా అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. బీసీలకు తొలినుంచీ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా సరైన నేత కోసం చూస్తున్న చంద్రబాబు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన గుండ్లపల్లెను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. శ్రీరామ్ ఎన్నిక జరిగిన కొన్నాళ్లకే స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేవడంతో పార్టీ కేడర్‌కు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం గుండ్లపల్లెపై పడింది. ఇక అధికారం చేతిలో ఉందన్న భావనతో వైసీపీ టీడీపీ మద్దతుదారులను ఎక్కడికక్కడ బెదిరింపులకు గురి చేస్తోంది. ఈ తరహా ఘటనలు గుండ్లపల్లె సొంత జిల్లా చిత్తూరులోనూ పెద్ద సంఖ్యలో జరిగాయి. అయితే ఇప్పటిదాకా గుండ్లపల్లె ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా కనిపించిన పాపాన పోలేదు.
పార్టీ శ్రేణులకు వెన్నుదన్నుగా నిలుస్తారని..
అధికార పార్టీ అరాచకాలను సమర్ధవంతంగా ఎదుర్కొనే విషయంలో గతంలో తెలుగు యువత, చంద్రదండు తదితర విభాగాలు క్రియాశీలకంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో యువకుడు… యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న గుండ్లపల్లె పార్టీ శ్రేణులకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తారని చంద్రబాబు భావించారు. ఈ భావనతోనే చిత్తూరు జిల్లా పార్టీ పెద్దల్లో కొందరు గుండ్లపల్లె అభ్యర్థిత్వంపై వ్యతిరేకించినా… చంద్రబాబు ఆయనపై నమ్మకంతో నియామకాన్ని ప్రకటించేశారు. అయితే పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండటం, పార్టీ శ్రేణులపై వైసీపీ దౌర్జన్యకాండకు దిగుతుండటం, ప్రత్యేకించి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ నామినేషన్లు వేయనీయకుండా కిడ్నాప్ చేస్తుండటం, కొందరిపై దాడులు చేస్తుండటం, ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం పార్టీ శ్రేణులను తీవ్రంగా కవలవరపరుస్తోంది. ఇలాంటి తరుణంలో అన్నీ తానే చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు ధైర్యం నూరి పోస్తున్నారు. ఈ తరహా బాధ్యతలను మరింతగా నెరపాల్సిన గురుతర బాధ్యత ఉన్న గుండ్లపల్లె మాత్రం అసలు బయటకే రావడం లేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయం తెలియడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఎంతో నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగిస్తే… గుండ్లపల్లె శ్రీరామ్ మాత్రం ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా గుండ్లపల్లె తన బాధ్యతను గుర్తించి పార్టీ మద్దతుదారులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకతను పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. మరి గుండ్లపల్లె ఇప్పటికైనా మేల్కొంటారో? లేదో? చూడాలి.
Also Read: కాకినాడ టీడీపీలో విభేదాలు..










