ఏపీలో త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. అదే సమయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం లేదని వైసీపీ ప్రకటించింది. అనంతపురం జిల్లా హిందూపూర్ వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ పోలీసు అధికారి ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం రాగా, తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించడంతో ఆయన కొడుకు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. విజయవాడ కార్పొరేటర్ మహ్మద్ కరీమున్నీసాకు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్‌కు, మరో సీనియర్ నేత సీ రామచంద్రయ్యకు అవకాశం కల్పించింది. ఇటీవల చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్థానంలో ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డికి అవకాశం ఇవ్వగా, వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడంతో ఆ స్థానం కూడా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది. కాగా, మార్చి 29తో గుండుమాల తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వట్టికూటి వీరవెంకట చౌదరి, షేక్ అహ్మద్ ఇక్బాల్ పదవీ కాలం పూర్తవుతుంది. మార్చి15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జగరనుండగా అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం మీద వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఇద్దరు మైనార్టీలు ఉన్నారు.
సీఎం సొంత జిల్లా.. సి. రామచంద్రయ్య
కడప జిల్లా రాజంపేటకు చెందిన కాపు సామాజిక వర్గం నేత సి. రామచంద్రయ్య, చార్టర్డ్ అకౌంటెంట్‌గా చేశాక ఎన్టీఆర్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చారు. దేవాదాయ మంత్రిగా చేశారు. రెండుసార్లు టీడీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరించారు. తరవాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్ పార్టీలోనే ఆయనకు 2012లో ఎమ్మెల్సీ అవకాశం, మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన తన మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. 2018లో వైసీపీలో చేరారు.
ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్
ఐపీఎస్ అధికారి, వైసీపీ హిందూపురం ఇన్‌ఛార్జి మహ్మద్ ఇక్బాల్‌కు రెండోసారి అవకాశం దక్కింది. గతంలో రాయలసీమ ప్రాంతంలో పోలీసు అధికారిగా పని చేశారు. తరువాతి కాలంలో ఐజీ ర్యాంకు హోదాలో సీఎం సెక్యూరిటీ వింగ్ చీఫ్‌గా చేశారు. అప్పట్లో చంద్రబాబుపై మావోయిస్టుల అలిపిరి దాడి ఘటన నుంచి ప్రాణాలతో బయట పడడానికి మహ్మద్ ఇక్బాల్ చాకచక్యంగా వ్యవహరించారని చెబుతారు. పదవీ విరమణ తర్వాత టీడీపీలో చేరారు. తరువాత వైసీపీకి వచ్చారు. గత ఎన్నికల్లో హిందూపురంలో నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అనంతపురంలో స్థిరపడినా..కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. గతంలో 2019లోనే ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ ప్రకటించింది.
Must Read ;- టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక పరాభవాన్ని వైసీపీ గుర్తించిందా?
అవుకు నుంచి చల్లా భగీరథరెడ్డి
కర్నూలు జిల్లాలో పార్టీ కలక నేత, మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గత జనవరి1న కరోనాతో చనిపోవడంతో ఆయన రెండో కుమారుడు భగీరథరెడ్డికి వైసీపీ అవకాశం కల్పించింది. కర్నూలు జిల్లా అవుకు ప్రాంతానికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్‌లో పని చేశారు. తరువాతి కాలంలో చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు. కాగా చల్లా రామకృష్ణారెడ్డి రెండో కోడలు, భగీరథరెడ్డి భార్య జడ్పీటీసీగా బరిలో నిలిచారు. అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది
టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్
శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిపై వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ను ఎంపిక చేసిన వైసీపీ సంచలన నిర్ణయానికి తావిచ్చిందని చెప్పవచ్చు. పలు వివాదాల్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయించే విషయంలో తాను ఎమ్మెల్యేతో సమానం అని మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకు వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్ వైఖరి సంచలనం రేపింది. కాగా ధర్మాన వర్గానికి, దువ్వాడకి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దువ్వాడకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేయడం రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. గతంలో దువ్వాడ శ్రీనివాస్ లాయర్‌గా పని చేశారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి టెక్కలి అసెంబ్లీకి పోటీ చేశారు. 2014లో టెక్కలి అసెంబ్లీకి, 2019లో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు.
ఎంపీ కుమారుడిగా బల్లి కల్యాణ్ చక్రవర్తి
ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గమైన తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ 2020లో కరోనా చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయారు. అప్పట్లోనే ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తామని వైసీపీ ప్రకటించింది. తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నుకోనున్నారు. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం 1985 నుంచి 2019 వరకు టీడీపీలోనే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు దుర్గాప్రసాద్.
విజయవాడ నుంచి కరీమున్నిసా
పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో ఉన్న విజయవాడ 56వ డివిజన్ కార్పొరేటర్ కరీమున్నిసాను ఎంపిక చేసింది వైసీపీ. కరీమున్నిసా కుటుంబం జగన్‌కు సన్నిహితంగా ఉంటుందని పేరుంది. షర్మిల పాదయాత్ర, జగన్ పాదయాత్రలోనూ కరీమున్నిసా కుటుంబం స్థానికంగా కీలకంగా వ్యవహరించిందని చెబుతారు. గతంలో టీడీపీ హయాంలో కేసులు ఎదుర్కొన్నారు. ఈ విషయంలో అప్పట్లోనే జగన్ ఈ కుటుంబానికి హామీ ఇచ్చారు. మొత్తం మీద వైసీపీ ప్రకటించిన ఆరు ఎమ్మెల్సీలో ఒకరు రెడ్డి, ఒకరు కాపు, ఒకరు కాళింగ, ఒకరు ఎస్సీ,ఇద్దరు మైనార్టీ వర్గానికి చెందినవారున్నారు.
Also Read ;- ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ దిశా నిర్దేశం..










