బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వృత్తి పరమైన
శత్రుత్వం ఏమైనా ఉందా అనే కోణంతో బాటు అనేక అంశాలపై ముంబై పోలీసులు విచారణ చేశారు. లోతైన విచారణ చేయాలంటూ ఈ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. తన తనయుడి మరణం తరువాత అతని అకౌంట్ నుంచి 15 కోట్లు వేరే అకౌంట్ కు ట్రాన్సఫర్ అయ్యాయని దీని వెనుక నటి రియా చక్రవర్తి ఉన్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు చేసిన ఫిర్యాదుతో కేసు కీలక మలుపు తీసుకుంది. ఫిర్యాదుపై విచారణను ప్రారంభించిన బీహార్ పోలీసులు ముంబైలోని రియా ఇంటికి వచ్చారు. వారు వచ్చేలోగా ఆమె అదృశ్యమయ్యారు. ఆమె కోసం అన్వేషణ చేసిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తరపు లాయర్ ఉన్నత న్యాయస్థానంలో రియా కేసును బీహార్ నుంచి ముంబైకి బదలీ చేయాలనీ కోరారు. ఇదే సమయంలో సుశాంత్ తండ్రి మని లాండరింగ్ ఫిర్యాదుతో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది.
సుశాంత్ ఆత్మహత్యపై పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్న అభిమానులను మీడియాతో బాటు కొందరు విమర్శకులు తమ కామెంట్స్ తో మరింత సందేహాలను రేకెత్తించారు. పోలీసులు తన ప్రాథమిక దర్యాప్తులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్ తో బాధపడుతున్నారని, యాంటిడిప్రెసెంట్స్‌పై ఉన్నారని వెల్లడించారు. ఆత్మహత్య సమయంలో అతని ఇంటి నుంచి ఎటువంటి సుసైడ్ నోట్ దొరకలేదని ప్రకటించారు. జూన్ 14 ఆదివారం ముంబైలోని తన ఇంట్లో సుశాంత్ ఉరి వేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం తరువాత ముంబై పోలీసులు అతను చివరగా ఎవరిని కలిశారు…ఎవరితో మాట్లాడారనే విషయాలను ద్రువీకరించుకొని వారిని విచారించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో బాటు అతనికి చికిత్స అందించిన డాక్టర్లను కూడా విచారించారు.
సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుండి, అతని మరణానికి సంబంధించిన అనేక పరిణామాలు జరిగాయి. ఈ పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే…
జూన్ 14
ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఇంట్లో పని చేస్తున్న వారు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.
జూన్ 15
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలు ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరిగాయి. అతని అంత్యక్రియలకు అతని తండ్రి, సోదరి, సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తితో సహా కొంతమంది సన్నిహితులు హాజరయ్యారు.
జూన్ 17
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి న్యాయం చేయాలని కోరుతూ సినీ ప్రముఖులు సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్‌తో సహా 8 మందిపై స్థానిక న్యాయస్థానంలో ఒక న్యాయవాది క్రిమినల్ ఫిర్యాదు చేశాడు. ఈ ఎనిమిది మంది వ్యక్తులు సుశాంత్‌ను కుట్ర కోణంలో ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేశారని ఫిర్యాదులో ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.
జూన్ 18
సుశాంత్ యొక్క బూడిదను తన స్వస్థలమైన బీహార్, పాట్నాలోని పవిత్రమైన గంగా నదిలో నిమజ్జనం చేశారు. సుశాంత్ తల్లి బూడిదను ఎక్కడ అయితే నిమజ్జనం చేశారో అక్కడే సుశాంత్ అంతిమక్రియలు జరిగాయి. అదే రోజు, సుశాంత్ మాజీ ప్రియురాలు నటి రియా చక్రవర్తి స్టేట్మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డ్ చేశారు.
జూన్ 19
విచారణను వేగవంతం చేసిన ముంబై పోలీసులు ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ సంస్థ నుంచి వివరాలను కోరింది. యష్ రాజ్ సంస్థతో సుశాంత్ చేసుకున్న సినిమాల వివరాలను వారు సేకరించారు. వృత్తిపరమైన శత్రుత్వ ఆరోపణలతో సహా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటించారు.
జూన్ 24
ఐదుగురు వైద్యుల బృందం సంతకం చేసిన తుది పోస్టుమార్టం నివేదికను ముంబై పోలీసులు అందుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సుశాంత్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేలింది. ఉరి కారణంగా అస్ఫిక్సియా ఏర్పడటంతో మరణం సంభవించిందని వైద్యులు నిర్దారించారు.
జూన్ 30
సుశాంత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’లో అతనితో కలిసి నటించిన సంజనా సంఘీని ముంబై పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్‌లో విచారించారు. ఇదే సమయంలో సుశాంత్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు.
జులై 6
ప్రముఖ దర్శకుడు,నిర్మాత సంజయ్ లీలా భన్సాలీని ముంబై పోలీసులు ప్రశ్నించారు. విచారణ సమయంలో, భన్సాలీ “రామ్-లీలా (2013), “బాజీరావ్ మస్తానీ” (2015) మరియు “పద్మావత్” (2018) చిత్రాల కోసం సుశాంత్‌ను సంప్రదించినట్లు వెల్లడించారు. కానీ సుశాంత్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో వేరే వారితో ఆ సినిమాలు చేసినట్లు తెలిపారు.
జులై 11
బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ మేనేజర్లలో ఒకరైన రేష్మా శెట్టి స్టేట్మెంట్ ను ముంబై పోలీసులు నమోదు చేశారు. ఆమెను బాంద్రా పోలీస్ స్టేషన్లో దాదాపు ఐదు గంటలు ప్రశ్నించారు. రేష్మా శెట్టి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సహా పలువురు స్టార్ హీరోలకు మేనేజర్ గా పని చేస్తున్నారు.
జులై 14
సుశాంత్ మరణించిన ఒక నెల తరువాత, అతని మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఆయనను గుర్తు చేసుకుంటూ తన బాధను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వ్యక్తం చేసింది. సుశాంత్ మరణానికి కారణమంటూ ఆరోపణలు ఎదురుకుంటున్నస్నేహితురాలు రియా చక్రవర్తి కూడా తన బాధను వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు.
జులై 16
తనను చంపేస్తానని ఓ యూజర్ బెదిరింపులు చేశాడని స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో రియా చక్రవర్తి పోస్ట్ చేశారు. మన్నూ రౌత్ అనే నెటిజన్ అసభ్యకరమైన పదజాలంతో దూషించినా ఆమె మౌనంగానే ఉండిపోయింది. రియా చక్రవర్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేస్తూ తనకు వస్తున్న బెదిరింపులను పోస్ట్ చేశారు.
జులై 17
సుశాంత్ కేసు విషయంలో సిబిఐ విచారణ అవసరం లేదని ముంబై పోలీసులు సమర్థవంతంగా పని చేయగలరని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. వృత్తిపరమైన పోటీ కోణాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారని దేశ్ముఖ్ తెలిపారు.
జులై 18
ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను పోలీసులు నాలుగు గంటల పాటు విచారించారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా నమోదు చేశారు.
జులై 24
సుశాంత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’ హాట్ స్టార్, డిస్నీ స్ట్రీమింగ్ యాప్ లో విడుదలయింది. సుశాంత్ అభిమానుల సపోర్ట్ తో ఈ సినిమా విడుదలైన నిమిషాలలోనే ఐఎండీబీలో 10 రేటింగ్ సొంతం చేసుకొంది. 21,000 ఓట్లతో ప్రస్తుతం దిల్ బేచారా ఐఎండీబీ రేటింగ్ 9.8గా ఉంది.
జులై 26
సుశాంత్ ఆత్మహత్య కేసులో సిబిఐ విచారణను కోరుతూ మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణియన్ స్వామి రాసిన లేఖను ప్రధాని నరేంద్ర మోడీ ధ్రువీకరించారు.
జులై 27
ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ స్టేట్మెంట్ ను పోలీసులు నమోదు చేశారు. శాంతాక్రాజ్ పోలీస్ స్టేషన్ కు కరోనా నేపథ్యంలో ఆయన ఫేస్ షీల్డ్, గ్లోవ్స్, మాస్క్ తో వచ్చిన ఆయన తన స్టేట్మెంట్ ను ఇచ్చారు.
జులై 28
కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సిఇఒ అపూర్వా మెహతా స్టేట్మెంట్ ను ముంబై పోలీసులు నమోదు చేశారు. నటి రియా చక్రవర్తితో సహా ఆరుగురిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి రియా చక్రవర్తి నటుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ .15 కోట్లు బదిలీ చేశారని ఆరోపించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా రియా ప్రేరేపించిందని ఆరోపించారు. రియా మరియు ఆమె కుటుంబ సభ్యులు సుశాంత్ ల్యాప్‌టాప్, నగదు, ఆభరణాలు, క్రెడిట్ కార్డులు మొదలైనవి దొంగిలించారని, సుశాంత్ మెడికల్ సమస్యలను బయట పెడుతామని వారు బెదిరించారని ఆయన ఆరోపించారు.
జులై 29
ఫోరెన్సిక్ విశ్లేషణలో సుశాంత్ ఆత్మహత్యకు ఉపయోగించిన క్లాత్ అతని బరువును తట్టుకుందని వెల్లడించింది. అతని మెడలో కనిపించే లిగెచర్ మార్కుల విశ్లేషణ కూడా సుశాంత్ మరణం హత్య కాదని ఆత్మహత్య అని నిర్దారణ చేసింది. ఈ విషయంలో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించిన సుశాంత్ తండ్రి పెద్ద నిర్మాణ సంస్థల పేర్లు చెప్పాలని వారు బలవంతం చేస్తున్నారని ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి చెప్పారు. ముంబై పోలీసుల ఆధ్వర్యంలో ఈ కేసు వేరే దిశలో పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు చేసిన ఫిర్యాదుతో కేసు కీలక మలుపు తీసుకుంది. ఫిర్యాదుపై విచారణను ప్రారంభించిన బీహార్ పోలీసులు ముంబైలోని రియా ఇంటికి వచ్చారు. వారు వచ్చేలోగా ఆమె అదృశ్యమయ్యారు. ఆమె కోసం అన్వేషణ చేసిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తరపు లాయర్ ఉన్నత న్యాయస్థానంలో రియా కేసును బీహార్ నుంచి ముంబైకి బదలీ చేయాలనీ కోరారు.
జులై 31
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో తాను “లివ్-ఇన్ రిలేషన్” లో ఉన్నానని కోర్టుకు తెలిపిన రియా ఆత్మహత్య ఘటనకు ఆరు రోజులు ముందుగా జూన్ 8 న ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై పెదవి విప్పిన ఆమె ‘నిజం తప్పక గెలుస్తుంది’ అన్నారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని తెలిపిన ఆమె ఈ విషయం కోర్టులో ఉన్నందున తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించలేనని తెలిపారు.
ఆగష్టు 1
సుశాంత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీబీఐ విచారణకు ఆదేశిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు.
ఆగష్టు 2
సుశాంత్ తమ ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. దీంతో తమతో విచారణకు సహకరించాలని బీహార్ పోలీసులు నోటీసులు అందచేశారు.
ఆగష్టు 3
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్న రియా చక్రవర్తి ఆచూకీపై తమకు సమాచారం లేదని ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ తెలిపారు. సుశాంత్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని, దాని కోసం అతను మందులు వాడుతున్నాడని ఆయన తెలిపాడు.
ఆగష్టు 4
ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు సహకరించకపోవడంతో బాటు ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను ఇవ్వకపోవడంతో తామే సాక్ష్యాల కోసం విచారణ జరుపుతున్నామని బీహార్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. రియా-సుశాంత్ ల మధ్య జరిగిన లావాదేవీల 48 పేజీల రిపోర్టును బీహార్ పోలీసులు బ్యాంకు నుంచి తీసుకున్నారు. సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితతో జరిపిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్, ఆరుగురి స్టేట్మెంట్స్ వారి టెలిఫోన్ సంబాషణలను కూడా బీహార్ పోలీసులు రికార్డు చేశారు.
ఆగష్టు 5
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కు అప్పగించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నిందితుడు రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా, ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరపాలని బీహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. రియా చక్రవర్తి పరారీలో ఉన్నారని, ఆమె తమ ముందుకు రావడం లేదని బీహార్ పోలీసు డిజిపి గుప్తేశ్వర్ పాండే అన్నారు. రియా ఎక్కడికి పోలేదని ఆమె తరుపు న్యాయవాది స్పష్టం చేయడంతో పాటు తాము బీహార్ పోలీసుల నుంచి ఎటువంటి సమన్లు అందుకోలేదని స్పష్టం చేశారు.
ఆగష్టు 6
సుశాంత్ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ రియాతో బాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది.
ఆగష్టు 7
మని లాండరింగ్ కేసులో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోయిక్ ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు.
ఆగష్టు 8
రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మనేషిందే సుయాంత్ సింగ్ రాజ్‌పుత్ రియా కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన ఓ నోట్ ను షేర్ చేశారు. ఆ గ్రాటిట్యూడ్ నోట్ లో రియా కుటుంబం తన జీవితంలో ఉన్నందుకు సుశాంత్ కృతజ్ఞతలు తెలిపినట్లు ఉంది. ఈ నోట్ తో బాటు ‘చిచోర్’ అని వ్రాసిన సుశాంత్ సిప్పర్ ను పంచుకుంది. సుశాంత్‌కు చెందిన ఈ రెండు వస్తువులు మాత్రమే తన వద్ద ఉన్నాయని రియా పేర్కొంది.
ఆగష్టు 10
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మీడియా నివేదికలపై ఫిర్యాదు చేస్తూ నటుడు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మీడియా సుశాంత్ ఆత్మహత్య కేసులో తనను దోషిగా చూపిస్తోందని ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నారు. రాజకీయ క్రీడలో తాను బలిపశువు అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె తనకు రక్షణ కల్పించాలని కోరారు.










