సినిమాల చిత్రీకరణ కోసం భారీ సెట్లు వేయడం ఎప్పట్నుంచో చూస్తున్నదే. బయటి వాతావరణంలో ఎక్కువ రోజులు షూటింగ్ చేయాలంటే చిత్ర బృందాలకు సహజంగా ఎన్నో ప్రయాసలు ఎదురవుతాయి. పైపెచ్చు షూటింగును చూడాలని వచ్చే జనాలతో సమయం వృధా అవుతుంది. అందుకే షూటింగ్ చకా చకా జరిగిపోవాలంటే సన్నివేశాలకు తగ్గట్టు సెట్స్ నిర్మిస్తుంటారు. కోవిడ్ కారణంగా షూటింగులు దాదాపు తొమ్మిది నెలల పాటు షూటింగులు నిలిచిపోయాయి. గత కొద్ది రోజుల నుంచి చాలా సినిమాల చిత్రీకరణలు తిరిగి మొదలయ్యాయి.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే తమ చిత్రాల కోసం భారీ సెట్స్ రూపకల్పనకు పలువురు నిర్మాతలు సంసిద్దమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆచార్య’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ పరిసరాలలో శరవేగంగా జరుగుతోంది. కోకాపేటలో చిరంజీవికి చెందిన సొంత ఫామ్ హౌస్ లో సన్నివేశాలను తీస్తున్నారు. ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్ వేయడానికి 20 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. ఇందులో భాగంగా కేరళ నేపధ్యంలో ఒక గ్రామం సెట్ ను వేశారు. అంతే కాదు నాలుగు కోట్లతో ఒక ఆలయ సెట్‌ను కూడా నిర్మించారు. దాదాపు 28 ఎకరాలలో ఆ ఫామ్ హౌస్ విస్తరించి ఉంటుంది. అందులో 16 ఎకరాలలో ఈ సెట్స్ నిర్మించినట్లు సమాచారం.
Must Read ;- ఆ భారీ సెట్ ఎందులకు ‘ఆచార్య’ దేవా.. ?
అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ లాక్ డౌన్ కారణంగా ముందుకు సాగలేదు. లేకుంటే ఈ పాటికి చాలాభాగం పూర్తి కావాల్సింది..పైపెచ్చు అమెరికాలో కూడా మేజర్ పార్ట్ చిత్రీకరణ జరపాల్సి ఉంది. అమెరికాకు వెళ్లి చిత్రీకరణ జరిపేందుకు అనుకూలమైన సమయం కోసం చిత్ర బృందం ఎదురుచూస్తోంది. బహుశా జనవరిలో వెళ్లాలని యూనిట్ అనుకుంటోంది. ఈ లోగా హైదరాబాదులో ఓ బ్యాంక్ సెట్ వేసి, చిత్రీకరణ జరపాలని నిర్ణయించారట. ఈ సెట్ నిర్మాణం త్వరలో పూర్తి కాగానే, అందులో నెల రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ జరుపుతారట.
ఇంకా జూ.ఎన్ఠీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం చిత్రీకరణ సందర్భానుసారంగా బయటి ప్రాంతాలలో జరుగుతున్నా ప్రధానంగా హైదరాబాద్లో సెట్స్ వేసి మరీ చిత్రీకరణ జరుపుతుండటం తెలియంది కాదు. పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం కోసం కూడా భారీ సెట్స్ నిర్మించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అవి దెబ్బతిన్నాయని అంటున్నారు. మళ్లీ వాటిని పునః నిర్మిస్తారో? లేదో? చూడాలని పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. ఇవే కాకుండా ఇంకొన్ని చిత్రాల కోసం సెట్స్ రూపకల్పన జరుగుతోంది. మొత్తం మీద టాలీవుడ్లో సినిమా సెట్ల సందడి తిరిగి ఊపందుకుంటోంది.
Also Read ;- పవన్ అభిమానులను ఊరిస్తున్న డైరెక్టర్ క్రిష్